గ్రేటర్ ఎన్నికల ప్రచార
రేపు పోలింగ్ ఉ॥ 7గం. నుంచి సా॥ 6గం. వరకు
గులాబీతోనే గ్రోత్
టిఆర్ఎస్ వల్లనే డబుల్ ఇంజిన్ ప్రగతి
రాష్ట్ర పాలక పార్టీ జిహెచ్‌ఎంసిలోనూ ఉంటేనే శరవేగ అభివృద్ధి సాధ్యం
బీహార్‌లో బిజెపి చెప్పిందే ఇక్కడ మేమూ చెబుతున్నాం
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, అన్నపూర్ణ, బస్తీ దవాఖానాలు మున్నగు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
అందరి హైదరాబాద్‌ను కొందరి నగరంగా చేద్దామని కొంతమంది కుట్రపన్నుతున్నారు
బిజెపివి రాజకీయ ప్రయోజనాలే, ప్రజాప్రయోజనాలు కావు
ఉత్తరాదిలో మాదిరిగా దక్షిణాది తమను నమ్ముతుందని వారు భ్రమపడుతున్నారు
కెసిఆర్ కృషి వల్ల రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయమై ఇన్వెస్టర్లు వస్తున్నారు
రాష్ట్రానికి కేంద్రం ఏమీ ఇవ్వలేదు
కిషన్‌రెడ్డి తెచ్చిందేమీ లేదు జిహెచ్ఎంసి ఎన్నికలకు చివరిరోజు ప్రచార రోడ్‌షోల్లో కెటిఆర్
హైదరాబాద్ : జిహెచ్ఎంసిపై గులాబీ జెండా ఎగురుతేనే డబుల్ ఇంజన్ గ్రోత్ సాధ్యమవుతుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, జిహెచ్ఎంసిలో కూడా ఉంటనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. పాలన కూడా సాఫీగా సాగుతుందన్నారు. ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో కూడా ఇదే బిజెపి చెప్పిందన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఉన్న నేపథ్యంలో బిహార్‌లో కూడా తమ కూటిమినే గెలిపించాలని బిజెపి నాయకులు ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. మరీ అదే సూత్రం హైదరాబాద్‌లో వర్తించదా? అని ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచినా ఓరిగేది ఏమి లేదని బిజెపి నేతలకు తెలిసి కూడా కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు ఎందుకు ప్రచారం చేశారని నిలదీశారు.
దీనిని బట్టి బిజెపి నేతలకు తెలిసింది ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలే తప్ప…ప్రజా సంక్షేమం కాదని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. నార్త్ రాష్ట్రాల్లో బిజెపిని నమ్మినవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విశ్వసిస్తారని ఆ పార్టీ నేతలు అనుకోవడం మూర్ఖత్వమని అన్నారు. ఆ పార్టీ కొన్ని ఓట్లు పెంచుకుంటుందే తప్ప సీట్లు కాదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన ఆదివారంనాడు గోషామహల్, సనత్‌నగర్, సికింద్రాబాద్ తదితర నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్ షాలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే టిఆర్ఎస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ వస్తే రాష్ట్రం పూర్తిగా చీకటిమయం అవుతుందని కొంతమంది లేనిపోని విష ప్రచారం చేశారన్నారు. సిఎం కెసిఆర్ సమర్ధత కారణంగానే కేవలం ఆరేడు మాసాల్లోనే కరెంటు మిగులు రాష్ట్రంగా తెలంగాణకు చేరుకుందన్నారు.
అందుకే రాష్ట్రంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు మాయమై ఇన్వెస్టర్లు వస్తున్నారన్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.24 గంటల విద్యుత్‌తో పారిశ్రామికవేత్తలు సంతోషంగా ఉన్నారు. కార్మికులకు పనిదొరుకుతుందన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు బాగుంది.. మంచినీళ్ల సౌలత్ ఉందన్నారు. ప్రతిభ గల పిల్లలు ఉన్నారు.. అన్నింటికి మించి సిఎం కెసిఆర్ వంటి దమ్మున్న నాయకులు ఉన్నరని అన్నారు. ఈ భరోసాతోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో చైన్ స్నాచింగ్ లేవు, దొమ్మీలు లేవు, ఆంధ్రా,-తెలంగాణ పంచాయతీలు లేవన్నారు. ఆరేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. ఇది అందరి హైదరాబాద్ అని కానీ కొంతమంది నేడు ఇది అందరి హైదరాబాద్ కాదు అంటున్నారని అన్నారు. అటువంటి వారికి జిహెచ్ఎంసి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్, రూ. 5లకే అన్నపూర్ణ భోజనం, బస్తీదవాఖానాలు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో తెలంగామ రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. ఢిల్లీ నుంచి, పక్క రాష్ట్రాల నుంచి ప్రచారానికి వచ్చేవాళ్లు ఇవాళ ఉంటరు రేపు పోతరు. కానీ మనమంతా ఇక్కడే ఉండాలన్నారు. కరోనాలో ఉన్నది తామే, వరదల కష్టంలో వచ్చింది తామేనన్నారు. అందరినీ సమానంగా చూస్తూ అభివృద్ధిలో నడిపిస్తున్న టిఆర్ఎస్కు అండగా ఉంటూ గ్రేటర్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. గడిచిన ఆరేళ్లలో కేంద్రంలో బిజెపి సర్కార్ హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు.
వరద సమయంలో రానివారందరూ.. ఇప్పుడు వస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు మంత్రులతో కలిసి నగరంలో తిరిగాం. వరద సాయం చేస్తే టిఆర్ఎస్కు పేరు వస్తుందని ఆపారని విమర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? దమ్ముంటే చెప్పాలని మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చింది? కేంద్రానికి రాష్ట్రం ఎన్ని నిధులు తీసుకున్నదో చర్చించడానికి టిఆర్ఎస్ సిద్ధమేనని పలుమార్లు సవాల్ విసిరినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క బిజెపి నాయకుడు కూడా స్పందన లేదన్నారు. వారు ఏం తీసుకరాలేదు కనకనే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తోకముడిచారని మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు.