Home తాజా వార్తలు డబుల్ నత్త!

డబుల్ నత్త!

KTR Dissatisfaction on Double Bedroom Houses

 

నిధుల కొరత లేకపోయినా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం పట్ల మంత్రి కెటిఆర్ తీవ్ర అసంతృప్తి

పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు

మున్సిపల్ కమిషనర్లతో ఒకరోజు సమీక్ష నిర్వహణకు నిర్ణయం, కమిషనర్లకు శిక్షణ

మన తెలంగాణ/హైదరాబాద్ : పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కమిషనర్లతో ఒక రోజు సమీక్షా సమావేశం నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఒక రోజు శిక్షణా సమావేశాన్ని నిర్వహించానున్నారు. ఈ సమావేశంలో పట్టణాలను అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన వ్యూహాలను సిద్దం చేస్తారు. పట్టణాలను ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రాధాన్యతల గుర్తింపు పైన పలువురు నిపుణులు తమ విలువైన సూచనలు, సలహాలు కూడా ఇవ్వనున్నారు. కాగా ఈ సమీక్షలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జగరకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

నగరంలోని ఎసి గార్డ్‌లోని పురపాలక శాఖ కాంప్లెక్స్‌లో గురువారం వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లపై మంత్రి కెటిఆర్ సమీక్ష చేశారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి, మాజీ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరితో పాటు ఖమ్మం, ఖమ్మం వరంగల్ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, కార్పొరేషన్ల పరిధిలో పౌరుల కనీస అవసరాలపైన దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పథకాల్లో ప్రధానంగా ఉచిత డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు.

ఆ పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. అలాగే పట్టణాల్లోని ఇతర మౌలిక వసతుల కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా మంత్రులకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లోనూ ప్రాధాన్యత క్రమంలో ముఖ్యమైన కార్యక్రమాలను వెంటనే పూర్తయ్యేలా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ల కమిషనర్లను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. ఇందుకోసం పురపాలక శాఖ తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు. మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ల అలసత్వం ఉంటే వాటిని ఇతర కాంట్రాక్టర్లకు అప్పజెప్పాలని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేకున్నా ఆలస్యం జరగడం పట్ల వర్కింగ్ ఏజెన్సీల తీరుపైన ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వరంగల్ ,ఖమ్మం పట్టణాల్లో రోడ్ల నిర్వహణతో పాటు ఫుట్ పాత్‌ల నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, జంక్షన్ల అభివృద్ధి, టాయిలెట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి సౌకర్యం, ప్రస్తుతం చేపడుతున్న తాగునీటి సంబంధిత మౌలిక వసతుల కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా కెటిఆర్ సమీక్షించారు. విలీన గ్రామాల్లో నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలన్నారు. కాగా మంత్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల మూడవ వారంలో వరంగల్, ఖమ్మం పట్టణాల్లో స్వయంగా కెటిఆర్ పర్యటించాలని నిర్ణయించారు.

KTR Dissatisfaction on Double Bedroom Houses