Home తాజా వార్తలు ప్రజల తీర్పు శిరోధార్యం

ప్రజల తీర్పు శిరోధార్యం

KTR extend wishes to YS Jagan for landslide victory

 

ప్రజలు మరోసారి మెజారిటీ స్థానాలను కట్టబెట్టారు
ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన బాసులు లేరు
వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతాం
ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజం
కొన్నిచోట్ల ఆశించిన ఫలితం రాలేదు
దీనిపై పార్టీలో చర్చిస్తాం
పొరుగువారితో ప్రేమతో ఉంటున్నాం… భవిష్యత్తులో ఇలాగే ఉంటాం

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజాతీర్పే తమకు శిరోధార్యమని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మరోసారి మెజార్టీ స్థానాలను కట్టబెట్టారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఫలితాల అనంతరం సాయంత్రం టిఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ ప్రజాతీర్పే ప్రజాస్వామ్యంలో అల్టీమేట్‌గా శిరోధార్యమని, ప్రజాతీర్పును తప్పుపట్టమని కెటిఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మించిన బాసులు లేరన్నారు. 17 స్థానాల్లో తమ పార్టీకే 9 మెజార్టీ స్థానాలను ప్రజలు కట్టబెట్టా రన్నారు. ఇప్పటి నుంచి వారి విశ్వసాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతామన్నారు. ప్రజలు ఆశిస్తున్న వాటికి అనుగుణంగా ప్రజాసేవలో పునరంకితం అవుతామన్నారు.

కేంద్రం నుంచి మన హక్కులను సాధించుకోవడానికి ప్రజలు తమపై బాధ్యతలను పెట్టారన్నారు. ప్రజలు 9 స్థానాలను తమ పార్టీకి కట్టబెట్టారని, తమ మిత్రపక్షమైన ఎంఐఎంకు ఒక్క స్థానం ఇచ్చారని కెటిఆర్ తెలిపారు. మిగతా 7 స్థానాలను వీరు, వారు గెలుచుకున్నారని, గెలిచిన కాంగ్రెస్, బిజెపి మిత్రులకు ఆయన శుభాకాంక్షలను తెలియచేశారు. ప్రజలు ఇచ్చిన ఫలితాలను శిరోధార్యంగా భావించి, ప్రజా శేయస్సు కోసం అంకితమై నిబద్ధులుగా పనిచేస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన ఫలితాల కోసం కష్టపడ్డామని, 16 స్థానాలను గెలుచుకోవడానికి కృషి చేశామని కెటిఆర్ పేర్కొన్నారు. దీనికోసం టిఆర్‌ఎస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డారని, ఎండలను లెక్కచేయకుండా తిరిగారని, ప్రజలు కూడా ఆశీర్వదించారని ఆయన తెలిపారు.

రాష్ట్రానికి వచ్చే హక్కులను సాధించుకుంటాం
రాష్ట్రానికి వచ్చే హక్కులను సాధించుకునే బాధ్యత ప్రస్తుతం తమపై ఉందన్నారు. ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతలను సవ్యంగా నెరవేరుస్తామన్నారు. రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం అంకితమై నిబద్ధులుగా పనిచేస్తామన్నారు. పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు కెటిఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఓడిపోయినంత మాత్రాన ఆయన్ను కించపరిచే మాటలను తాను మాట్లాడనని ఆయన పేర్కొన్నారు. వాటిని సహజంగా తీసుకోవాలని, దెప్పిపోడవడం లాంటివి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. 5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ పోటీ చేసిన 105 స్థానాల్లో ధరావతు కోల్పోయిందని, ఇప్పుడు కొన్ని చోట్ల గెలిచిందని, దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఫలితాలపై పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఫలితాలు ఆశించాం, దానికోసం కష్టపడ్డాం, తీర్పు కూడా అలాగే ఉంటుందనుకున్నాం, కానీ కొన్నిచోట్ల ఆశించిన ఫలితం రాలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై తాము కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం
రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో ఎలాంటి ఎన్నికలు లేనందున అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎవరితోనూ ఎటువంటి పంచాయతీలు, గెట్టు తగాదాలు లేవని, ఎవరితోనూ వ్యక్తిగత ప్రయోజనాలు లేవని, అందరూ సమానమేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన హక్కులు, నిధుల విషయంలో ఎవరితోనైనా కోట్లాడడానికి తాము సిద్ధంగా ఉంటామన్నారు. అదే సమయంలో ఎవరితోనూ వ్యక్తిగత ద్వేషాలు ఉండవన్నారు. సిఎం కెసిఆర్ మొదటినుంచి చెప్పినట్టుగానే పొరుగువారితో ప్రేమతో ఉంటున్నామని భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటామన్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ బిజెపితో కుమ్మక్కు అయ్యిందన్న వార్తలు వస్తున్నాయని దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, 100 కోట్ల మంది ప్రజలు ఉన్న ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.

ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ప్రక్రియను నిర్వహించడం కష్టమయినా దానిని విజయవంతంగా పూర్తి చేయడం సంతోషకర విషయమన్నారు. ఎపిలో మెజార్టీ స్థానాల్లో విజయకేతనం ఎగురేసి సిఎం కాబోతున్న వైఎస్ జగన్‌కు, ఒడిశాలో 5వ సారి ముఖ్యమంత్రి కాబోతున్న నవీన్‌పట్నాయక్‌కు ఇప్పటికే సిఎం కెసిఆర్‌తో పాటు తాను కూడా వారికి శుభాకాంక్షలు తెలియచేసినట్టు కెటిఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోడీకి పార్టీ తరఫున శుభాకాంక్షలను ఇప్పటికే సిఎం కెసిఆర్ తెలియచేశారని, గెలిచిన మిగతా అభ్యర్థులకు హృదయ పూర్వక శుభాకాంక్షలను కెటిఆర్ తెలియచేశారు.

దేశ ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు : కెటిఆర్
వార్ వన్ సైడ్ అన్నట్లుగా దేశంలో మోడీ హవా మరోసారి చాలా స్పష్టంగా కనిపించిందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. మోడీ పాలనపై దేశ ప్రజలు చాలా స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. ఎన్‌డిఏను సమగ్రమైన విజయం దిశగా నడిపించినందుకు ప్రధాని నరేంద్రమోడీని, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ప్రత్యేకంగా అభినందనలు అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

వైసిపికి కెటిఆర్ అభినందనలు
ఏపిలో వైసిపి ప్రభం జనం సృష్టించిందని కెటిఆర్ వ్యాఖ్యానిం చారు. జగన్ సృష్టిం చిన ఓట్ల సునామిలో అధికార టిడిపి పత్తా లేకుండా కొట్టుకపో యిందన్నారు. జగన్ పడిన కష్టానికి ఏపి ప్రజలు మంచి తీర్పు నిచ్చారన్నారు. ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిం చారని కెటిఆర్ ట్వీట్ చేశారు. తమ సోదరుడి సమర్ధవంతమైన పాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు.

KTR extend wishes to YS Jagan for landslide victory