Home తాజా వార్తలు ఢిల్లీ గులాములొద్దు… తెలంగాణ గులాబీలే ముద్దు

ఢిల్లీ గులాములొద్దు… తెలంగాణ గులాబీలే ముద్దు

KTR

మన తెలంగాణ/హైదరాబాద్ కాంగ్రెస్, బిజెపి పార్టీలను కాదని దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. 70 ఏళ్ల పాలించిన కాంగ్రెస్, బిజెపిలు చేసిందేమిలేదని విమర్శించారు. శనివారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన దేశానికే ఆచరణ మారిందని అన్నారు. సిఎం కెసిఆర్ ఏ పథకాన్ని రూపొందించినా దేశం మొత్తం అబ్బురపడి చప్పట్లు కొడుతున్నదని వ్యాఖ్యానించారు. ఆయన పథకాలు ఆచరణాత్మకం, ఆదర్శప్రాయమని ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్‌ది మేకపోతే గాంభీర్యం అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపిలు మనకు ప్రత్యామ్నాయం కాదని చెప్పారు. కేంద్రంలో మోడీ సొంత ంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. మోడీ మీ టర్ రోజురోజుకు డౌన్ అవుతోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి 150 కంటే ఎక్కువ రావని తెలిపారు. రాహుల్‌గాంధీ పార్టీకి 100 సీట్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పారు.

ఎన్‌డిఎ, యుపిఎ కలిసినా మెజార్టీ స్థానాలు సాధించలేవని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాలు కూడా కీలకం కాబోతున్నాయని పేర్కొన్నారు.ప్రాంతీయ పార్టీలకు ఇదో మంచి అవకాశమని, 16 ఎంపి స్థానాలలో టి ఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇద్దరు ఎంపిలతో తెలంగాణకు తీసుకువచ్చిన కెసిఆర్, 16 మంది ఎంపిలను గెలిపించి కెసిఆర్ చేతులో పెడితే మన నాయకుడు ఢిల్లీ మెడలు వంచడా అని అడిగారు. 16 ఎంపి స్థానాలు గెలిస్తే మనకు బుల్లెట్ రైళ్లు రావా..? కేంద్ర నిధులు రావా..? మన ప్రాజెక్టులను జాతీయ హోదా రాదా అని ప్రశ్నించారు. ధృడసంకల్పం ఉన్న నాయకుడు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాని కావాలని సిఎం కెసిఆర్ సంకల్పం తీసుకున్నారన్నారు. 2014లో దేశంలో మోడీ దేశాన్ని ఉద్దరిస్తారని ఆయనకు 250 సీట్లిచ్చి ఆయనను ప్రధానిని చేశారని అన్నారు. ఐదేళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే మోడీ చేసిందేమి లేదని అన్నారు. సబ్ కా సాత్..సబ్ కా వికాస్ అన్న మోడీ తెలంగాణకు హాత్ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే 24 పైసలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

ప్రత్యర్థుల్లో భయం మొదలైంది
గులాబీ ప్రభంజనం చూసి ప్రత్యర్థుల్లో భయం మొదలైందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సత్తా చూపబోతుందని అన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా పశ్చిమ రంగారెడ్డి సస్యశామలం చేస్తామని అన్నారు. ఎర్రకోటపై జెండా ఎవరు ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలని చెప్పారు. ఏం చేయాల్ననా కాంగ్రెస్ నేతలు ఢిల్లీని అడగాలని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలను గులాంలను గెలిపిద్దామా..? లేక తెలంగాణ గులాబీలను గెలిపిద్దామా..? అని ప్రశ్నించారు. చేవెళ్ల సెగ్మెంట్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, రాహుల్ గాంధీ తిరిగారని, వాళ్లిద్దరు తిరిగినా కూటమి అభ్యర్థులు గెలవలేకపోయారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని పథకాలు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి అని అన్నారు.

సిఎం కెసిఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులు గల్లా ఎగురేసుకుని తిరిగే పరిస్థితి తీసుకువచ్చారని చెప్పారు. ఢిల్లీ గులాములు కాదు, తెలంగాణ గులాబీలు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోరీలో వేసినట్లే అని విమర్శించారు. ఈ సమావేశంలో మంత్రి చామకూర మల్లారెడ్డి,ఎంఎల్‌ఎలు ఎంఎల్‌ఎ కాలె యాదయ్య, టి.ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, పట్నం నరేందర్‌రెడ్డి,ఎంఎల్‌ఎ మెతుకు ఆనంద్, టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్, సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ నాయకులు పట్నం మహేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి, తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

KTR Fires On Congress and BJP Governments