Tuesday, March 19, 2024

విశ్వ విపత్తుపై రాజకీయాలా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటున్నదన్నారు. అయినప్పటికీ విపక్షాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తుండడం, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడంపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నదన్నారు. ఇలాంటి సమయంలో బాధ్యతగల ప్రతిపక్షాలుగా ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి.. చిన్నచిన్న తప్పులను పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తుండడం తగదన్నారు.

సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కరోనా కేసుల్లో ప్రస్తుతం మన దేశం మూడో స్థానంలో నిలిచిందన్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యంగా భావించవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. దీనికి రాష్ట్ర బిజెపి నాయకులు ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. అలాగే బిజెపి పాలిత రాష్ట్రంలో కూడా కోరనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కరోనా తీవ్రత లేదా? అని కెటిఆర్ అన్నారు. కరోనా కట్టడికి ఏ ప్రభుత్వానికి తీసిపోని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఆయా రాష్ట్రాలకు మించి కట్టడి చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. కరోనా నివారణ అనేది కేవలం ప్రభుత్వ సంబంధమైన విషయం కాదన్నారు. దేశంలో కరోనాను పూర్తిగా నివారించిన రాష్ట్రం ఏదో చెప్పాలని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. కరోనా లాంటి అతిపెద్ద విపత్తులో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయన్నారు. దాని పట్టుకుని వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయవొద్దని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐసిఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారమే పరీక్షలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కరోనా కేసుల్లో 98 శాతం మంది బాధితులు రికవరీ అవుతున్నారని, కేవలం 2 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. విపక్ష నేతలు ఆ 2 శాతంపైనే ఫోకస్ చేయడం సరికాదన్నారు. కరోనాపై ప్రజలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం సాగిస్తున్న తరుణంలో వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రతిపక్షాలు తమ సంకుచిత భావాలతో వ్యవహరించవద్దని ఆయన హితవుపలికారు. కరోనాకు పేద, ధనిక అన్న తేడాలు ఉండవని, ఎవరికైనా రావచ్చు అని అన్నారు. ఇప్పటికైనా కరోనా విషయంలోనూ విపక్షాలు రాజకీయం చేయడం మానుకుని, నిర్మాణాత్మక సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామన్నారు.

KTR Fires on Opposition over Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News