Home తాజా వార్తలు ఆరోగ్య తెలంగాణ సాధించేవరకు నిబద్ధతతో పనులు: కెటిఆర్

ఆరోగ్య తెలంగాణ సాధించేవరకు నిబద్ధతతో పనులు: కెటిఆర్

KTR

 

సిరిసిల్ల : ఆరోగ్య తెలంగాణ తెలంగాణ సాధించేంత వరకు నిబద్ధతతో పనులు కొనసాగిస్తామని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. ప్రపంచంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా కంటివెలుగు పథకం ప్రారంభించి ఇంటింటిలో కంటి పరీక్షలు చేయించిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. రాష్ట్ర ప్రజలందరికి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి అత్యవసర సమయంలో ప్రజల ఆరోగ్య వివరాలు సరిచూసుకుని వారికి చికిత్స చేసే గొప్ప పథకం సిఎం కెసిఆర్ ప్రారంభిస్తున్నారు.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం కాబట్టి కళ్లకు తగిన వైద్యం అందాలన్నారు. సిరిసిల్లలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభించడం అభినందనీయమన్నారు. తెలంగాణలో సిరిసిల్లలో ప్రారంభించే ఆసుపత్రి 7వ దన్నారు. ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రులు కనీసంగా 150 కిలో మీటర్ల మధ్య దూరం ఉండేలా చూసుకుని ఏర్పాటు చేస్తారని అయితే సిరిసిల్ల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సుమారు 30 కిలో మీటర్ల దూరంలోనే ఆసుపత్రిని ప్రారంభించేందుకు ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా సిరిసిల్ల పట్టణం నడిబొడ్డున 15 వేల చదరపు అడుగుల వైశాల్యంలో కంటి ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రి కోసం కేవలం స్థలం మాత్రమే సమకూర్చిందని, హెటిరో సంస్థవారే రూ.లు 5 కోట్లు వెచ్చించి జి + టూ భవనాన్ని నిర్మిస్తున్నారన్నారు.

సామాజిక బాధ్యతగా పనులు చేసి ప్రజలకు మేలు చేసే వారిని ప్రోత్సహించాల్సి ఉందన్నారు. సిరిసిల్ల ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు కూడా చేస్తారని, సిరిసిల్లలో సాధ్యంకాని స్థాయిలో ఉన్నవాటిని, క్లిష్టమైన ఆపరేషన్లు మాత్రం హైదరాబాద్‌లోని ప్రధాన వైద్యశాలలో నిర్వహిస్తారన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో 50 శాతం కంటి సమస్యలు దూరం చేయాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు. హెటిరో సంస్థ స్ఫూర్తితో ఇతరులు కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నానన్నారు. సేవా భావంతో ఉదాత్తంగా పలువురు ముందుకు వస్తే సిరిసిల్ల అభివృధ్ధి త్వరిత గతిన పూర్తి అవుతుందన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు అధికంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. గుళ్లపల్లి నాగేశ్వరరావు 80వ దశకంలోనే ప్రపంచ ప్రఖ్యాత ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని హైదరాబాద్‌లో స్థాపించారన్నారు.

ఆయన డబ్బే ప్రధానమనుకోలేదన్నారు.నాగేశ్వరరావు స్ఫూర్తితో అనేక మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో భవన నిర్మాణం పూర్తయిన తరువాత నాగేశ్వరరావు, పార్థసారధిల సమక్షంలోనే ప్రారంభం చేసుకుందామన్నారు. ఈ సందర్భంగా హెటిరో సంస్థవారు ఆసుపత్రి పనుల ప్రారంభం కోసం రూ.లు 50లక్షల చెక్కును కెటిఆర్‌కు అందించారు. సమావేశంలో ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ ఆత్మకూరి రామన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రులు 19 నిర్వహిస్తుండగా తెలంగాణలోనే ఆరు ఉన్నాయని, సిరిసిల్లలోది 7వ దన్నారు.

డా. రోహిత్‌కుమార్, సుధాకర్ రెడ్డి, డా. రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ సంపద సృష్టించి పేదలకు పంచాలనేదే తమ లక్షమన్నారు. ఈ సమావేశంలో జడ్‌పి చైర్మన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షులు గడ్డం నర్సయ్య, స్త్రీశిశు సంక్షేమశాఖ రీజినల్ ఆర్గనైజర్ గుగులొతు రేణ, ఎఎంసి చైర్మన్ లింగం రాణి, మునిసిపల్ మాజి చైర్‌పర్సన్ సామల పావని, కలెక్టర్ కృష్ణభాస్కర్, సహయ కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్‌డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

KTR has laid Foundation for an Eye Hospital Building