Home తాజా వార్తలు గులాబీ జెండా ఎగరాలి

గులాబీ జెండా ఎగరాలి

KTR in Nalgonda Meeting

ఇద్దరు ఎంపిలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కెసిఆర్
16 మంది ఎంపిలతో ఏం చేస్తారో మీరే చూస్తారు
టిఆర్‌ఎస్ కార్యకర్తలు గర్వపడే రోజు వచ్చింది
కెసిఆర్ ఆలోచనలు దేశానికే ఆదర్శంగా మారాయి
ఎక్కువ ఎంపి స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో మనమే కీలకమవుతాం
నల్గొండ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కె.టి.రామారావు

హైదరాబాద్: కేవలం టిఆర్‌ఎస్‌లోనే సత్తా ఉన్న నాయకులు ఉన్నారని, అం దుకే ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు తెగేదాకా కొట్లాడే సత్తా టిఆర్‌ఎస్ నాయకుల్లో ఉందని వెల్లడించా రు. ఇద్దరు ఎంపిలతో తెలంగాణ తీసుకొచ్చిన మొనగాడు కెసిఆర్, 16 మంది ఎంపిలతో ఏం చేస్తారనేది మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. శనివారం నల్గొండలో నిర్వహించిన టిఆర్‌ఎస్ నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం సన్నాహక సభలో కెటిఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్గొండ ఎంపి, రైతు సమన్వయ సమితి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలిలో డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. కెటిఆర్ రాకను పురస్కరించుకుని స్థానిక ఎంఎల్‌ఎ భూపాల్‌రెడ్డి 10 వేల బైక్‌లతో భారీగా ర్యాలీతో కెటిఆర్‌కు స్వాగతం పలికారు.

సభా ప్రాంగణంలో కెటిఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశా రు. సర్వమత పెద్దలు కెటిఆర్‌ను ఆశీర్వదించారు. అనంతరం సభకు హాజరైన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించారు. ఎక్కువ పార్లమెంట్ స్థానా లు మన చేతిలో ఉంటే దేశ రాజకీయాల్లో మనమే కీలకమవుతామని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను మనం రాబట్టుకోవచ్చని అన్నారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నారని పేర్కొన్నారు. ఫ్లోరైడ్ సమస్య చరిత్ర పుటలకే పరిమితం కానుందని చెప్పారు. నల్గొండ పార్లమెంటరీ స్థానంలో 3 లక్షల మెజారిటితో విజయం సాధించాలని అన్నారు.

శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు.. అన్నట్లుగా మోడీ పాలన
దేశాన్ని అభివృద్ది చేస్తారని 2014లో నరేంద్రమోడీ 283 స్థానాలు గెలిపించి ఏకపక్ష మెజారిటీ ప్రజలు ఆయనను గెలిపిస్తే, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్లుగా ఆయన పనితీరు ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రోజురోజుకు మోడీ ప్రభ తగ్గిపోతుందని చెప్పారు. రాహుల్ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉందని అన్నా రు. మీడియా సంస్థలు నిర్వహించిన అన్ని సర్వేల్లో ఎన్‌డిఎకు 150 నుంచి 160 స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని తేలిందని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్‌కు 44 స్థానాలు వచ్చాయని, 100-110 స్థానాలు దాటే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఎన్‌డిఎ, యుపిఎ కలిసినా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండబోదని చెప్పా రు. ఇలాంటి కీలకమైన పరిస్థితుల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు మన ముందు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఒక్కో ఎంపి సీటు కీలకం రాబోతుందని, మనం ఎక్కువ ఎంపిలను గెలిపించుకుంటే కేంద్రంలో మనమే కీలకమవుతామని చెప్పారు.

మోడీనో, రాహుల్‌నో ఎన్నుకోవాల్సిన ఖర్మ పట్టలేదు
పార్లమెంట్ ఎన్నికలు మోడీకి, రాహుల్ మధ్యనే అని కొందరు అంటున్నారని, ఈ దేశంలో మోడీ, రాహుల్ తప్ప నాయకులే లేరా..? అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీనో, నరేంద్రమోడీనో ఎన్నుకోవాల్సిన ఖర్మ ఈ దేశ ప్రజలకు ఏం పట్టిందని విమర్శించారు. ఈ దేశంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలంటే పొడగిట్టని ప్రాంతీయ పార్టీలు కోకోల్లలుగా ఉన్నాయని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీకి జాతీయ పార్టీకంటే ఎక్కువ జాతీయ భావాలు ఉన్నాయని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు చనిపోతే మనం ముఖ్యమంత్రి స్పందించినంత గొప్పగా ఏ ముఖ్యమంత్రి అయినా స్పందించలేదని చెప్పారు. తమ పార్టీ వారం రోజులపాటు రాజకీయ కార్యకలాపాలను రద్దు చేసుకుందని పేర్కొన్నారు. దేశం మొత్తం బాధలో ఉంటే రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని మనం అనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం యథావిధిగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారని విమర్శించారు. రాహుల్‌గాంధీ ఒక రోజు కూడా ఆగలేక పుల్వామా అంశాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయపరమైన మాటలు మాట్లాడారని అన్నారు. సిఎం కెసిఆర్ మాత్రం సైనికులకు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా సంయమనం పాటించారని గుర్తు చేశారు. 71 ఏళ్ల కాంగ్రెస్, బిజెపిలు పాలించాయని, అయినా దేశంలో అభివృద్ది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని పేర్కొన్నారు.

కెసిఆర్ ఆలోచనలు దేశానికే ఆదర్శం
సిఎం కెసిఆర్ సారథ్యంలో పనిచేస్తున్న టిఆర్‌ఎస్ కార్యకర్తలు గర్వపడే రోజు వచ్చిందని కెటిఆర్ అన్నారు. కెసిఆర్ ఆలోచనలు దేశం మొత్తానికి ఆచరణగా ఆదర్శంగా మారాయని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో కోట్లాది మంది రైతుల హృదయాలలో చెరగని ముద్రవేసిన నాయకుడు సిఎం కెసిఆర్ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగిపోయేముందు రైతుబంధు పేరుమార్చి పిఎం కిసాన్ అని పేరు పెట్టి రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నారంటే అది సిఎం కెసిఆర్ క్రెడిటా..? కాదా..? అని ప్రశ్నించారు. వ్యవసాయం దండుగ అన్న ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అనివార్యంగా రైతుబంధు పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. కోదాడ రైతులకు పెట్టుబడి వస్తోందని, కృష్ణా రైతులకు పెట్టుబడి ఎందుకు రావడం లేదని రైతులు అడిగితే దిక్కులేక ఆ పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు.

కేంద్రంలో మమతా బెనర్జీ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు రైళ్లన్నీ పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాయని, లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైళ్లన్నీ బీహార్‌కు…ఆయన అత్తాగారి ఊరికి కూడా రైళ్లు వెళ్లాయని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండడం వల్ల గుజరాత్‌కు బుల్లెట్ వేసుకున్నారని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినా మోడీ ప్రభుత్వం 24 పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. సాగునీటి రంగంలో జరిగిన వివక్ష మూలంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని, తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరుకుగానీ, కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ జాతీయ హోదా ఇవ్వమని ప్రధానిని అడిగితే శాలువా కప్పుకుని ముసిముసి నవ్వులు నవ్వారు తప్ప స్పందించలేదని విమర్శించారు. కేంద్రంలో మన ఎంపిలు ఉంటే మన రాష్ట్రానికి నిధులు రావా..? అని ప్రశ్నించారు.

పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ
పోరాటాల పురిటిగడ్డ, చైతన్యానికి చిరుమానా నల్లగొండ అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. సాయుధ పోరాటానికి పురిటిగడ్డ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరిందని, అసెంబ్లీ ఎన్నికల స్పూర్తితో మరోసారి కష్టపడితే నల్గొండ పార్లమెంట్ స్థానంలో అఖండ మెజార్టితో విజయం సాధిస్తామని అన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. చైతన్యానికి మారు పేరైన నల్లగొండకు కొత్తగా రాజకీయాలు చెప్పాల్సిన పనిలేదని, ఎంపిలను గెలిపించుకుంటే కేంద్రంలో మనమే కీలకమవుతామని అన్నారు. ఈ సందర్భంగా తనకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాలు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ను 12 ఏళ్లుగా పూర్తి చేయలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం త్వరలో ఎస్‌ఎల్‌బిసి కాలువను పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి పూల రవీందర్, ఎంఎల్‌ఎలు భాస్కర్‌రావు, గాదరి కిశోర్, నోముల నర్సింహ్మయ్య, రవీంద్ర నాయక్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

KTR in Nalgonda parliamentary constituency level meeting