Home తాజా వార్తలు పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు

పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు

KTR inaugurates premier energies facility at E-City

 

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం
తెలంగాణలో భారీ పెట్టుబడులు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిరామారావు

మన తెలంగాణ/మహేశ్వరం : తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, నూతన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తుండడంతో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు దొరుకుతాయని రాష్ట్ర ఐటి పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలోని ఇ సిటీ (ఫ్యాబ్ సిటీ)లో రూ.483కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీలో 750 మెగావాట్ల సోలార్ ప్లాంటును రాష్ట్ర విద్యాశాఖమంత్రి పి.సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగానికి టిఎస్ ఐపాస్ ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు రాయితీలు గొప్పగా ఉన్నందున ప్రపంచంలోని అగ్రశేణి కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని గుర్తు చేశారు.

సోలార్‌సెల్స్ మాడ్యూళ్ల ఉత్పత్తిలో ప్రీమియర్ ఎనర్జీస్ దేశంలోనే రెండవ అతిపెద్ద ప్లాంటు ఇక్కడ నెలకొల్పడం గర్వంగా ఉందన్నారు. ప్రీమియర్ సంస్థ వచ్చే రెండేళ్లలో రూ.1200 కోట్ల పెట్టుబడులతో సౌరవిద్యుత్తు ఉపకరణాల సామార్థాన్ని మూడు గిగావాట్లకు విస్తరిస్తుండడంతో 2000 మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏడేళ్ల పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందని, 15 వేల పారిశ్రమల ద్వారా రెండు లక్షల 20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ప్రైవేటు రంగంలో పెద్దెత్తున ఉపాధి కల్పిస్తూ మరోపక్క ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఐటి హబ్‌గా అభివృద్ధి చెందిందని, రీజనల్ రింగ్‌రోడ్డు ద్వారా శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు.

కరోనా కాలంలో విపత్కర పరిస్థితులు ఆర్థిక సవాళ్లు సమస్యలను అధిగమించి రాష్ట్రంలో సానుకూల పరిస్థితి తీసుకురావడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఐటిమంత్రి కెటిఆర్‌ల పాత్ర ప్రశంసనీయమన్నారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీ సురభీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ జయేష్ రంజన్, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, టిఎస్‌ఐఐసి చైర్మన్ నర్సింహా రెడ్డి, ప్రేమియర్ ఎనర్జీస్ చైర్మన్ సరేందర్ పాల్‌సింగ్, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సలుజా, డైరెక్టర్ రోహిణీ సుధీర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవానివెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Minister KTR inaugurates premier energies facility at E-City