Friday, April 19, 2024

మా సిఎం కెసిఆర్.. మీ అభ్యర్థి ఎవరు?

- Advertisement -
- Advertisement -

చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు

రాబందులు కావాలో.. రైతు‘బంధు’ కావాలో తేల్చుకోవాలి

తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో ప్రతిపక్షాలు చెప్పాలి

వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఉన్న సీట్లు కూడా రావు

మాతో పోటీపడే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు

గుడెసల నుంచి గుగూల్ వరకు అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తున్నది

పదేళ్లలో రాష్ట్రం తనదైన మార్క్‌ను చాటింది
ఏబుల్ గవర్నమెంట్.. స్టేబుల్ లీడర్‌షిప్‌తోనే ఇది సాధ్యం

ఉల్లిగడ్డ ధర పెరిగితే ప్రభుత్వాలను పడగొట్టిన దేశం మనది
ఎవరినో గద్దె దించడానికిప్రతిపక్ష పార్టీలు ఏకం కాకూడదు

ప్రజలకు మేలు చేసేందుకే చేతులు కలపాలి

డీలిమిటేషన్‌తో దక్షిణాదిరాష్ట్రాలకు అన్యాయం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విలేఖరులతో మంత్రి కెటిఆర్ ఇష్టాగోష్టి

తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలని ప్రతిపక్షాలకు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు సవాల్ విసిరారు. తెలంగాణ కన్నా మెరుగైన మోడల్ రాష్ట్రాన్ని చూపించాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్షాల కు పనిలేక తొమ్మిదేళ్లుగా అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, విపక్షాలు హేతుబద్ధంగా, రుజువులతో మాట్లాడలేక పోయాయని విమర్శించారు. తమ కంటే మెరుగ్గా పనిచేసే వాళ్లు ఎక్కడున్నారో చూపిం చి మాట్లాడాలని సవాల్ విసిరారు. చేతిలో ఉన్న రూపాయి పారేసి చిల్లర ఏరుకోవద్దని కెటిఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబంధుల్లా పీక్కుతినే కాంగ్రెస్ కావాలా..? రైతుబంధు ఇచ్చే కెసిఆర్ కావాలా..? ప్రజలు ఆలోచించాలని కోరారు.

75 ఏండ్లు పాలించిన బిజెపి, కాం గ్రెస్ పార్టీలు ప్రజలకు ఏం చేశాయని ప్రశ్నించారు. తాము తొమ్మిదేళ్లలో అభివృద్ధిలో అద్భుతాలు చేసి చూపించామని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉందని విమర్శించారు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించామ ని, అలాగే ఇంటింటికీ తాగునీరు అందిస్తూ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచామని వ్యాఖ్యానించారు. తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్‌వన్‌గా ఉన్నామని అన్నారు. కేంద్ర మంత్రులు టాయిలెట్స్, రైల్వేస్టేషన్లలో లిప్ట్‌లు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నాని మండిపడ్డారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు గురువారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

రాష్ట్రం సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి సాధించింది
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభు త్వం గత పదేండ్లుగా పని చేస్తుందని కెటిఆర్ తెలిపారు. అందులో తెలంగాణ విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి పే ర్కొన్నారు. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అగ్రవర్ణాలైనా, అణగారిన వర్గాలైనా… అన్ని వర్గాల ప్రజ లకు ప్రభుత్వం చేయూతనిస్తోందని వివరించారు. విద్య, వైద్య రం గంలో తెలంగాణలో అద్భుతమైన మార్పులు సాధించిందన్నారు. మె డికల్ కాలేజీల ఏర్పాటు, బస్తీ దవాఖానాలతో వైద్య రంగంలో సమగ్రమైన మార్పు వచ్చింది. వైద్యరంగంలో 24వ స్థానంలో ఉన్న తెలంగాణ 3వ స్థానానికి చేరిందని చెప్పారు. రాష్ట్రంలో 69 శాతం డెలివరీలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, ప్రభుత్వ వైద్యంపై ప్రజలలో విశ్వా సం పెరిగిందని చెప్పారు. విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు సాధించామని అన్నారు. గురుకులాలు, మోడల్ స్కూ ళ్లు, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని తెలిపారు.

మోడల్ స్కూల్ విద్యార్థులకు నాసా నుంచి ఆహ్వానం లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 1,001 గురుకుల ఏర్పాటు చేసిందని తెలిపారు. గురుకుల విద్యార్థులు కార్పోరేట్‌కు ధీటుగా నీ ట్, జెఇఇ వంటి పోటీ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పారు. అలాగే విద్యుత్ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని, విద్యుత్ సామర్థాని 7వేల మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెంచామని చెప్పారు. పునరుత్పాదక విద్యుత్‌లో దేశంలోనే తెలంగా ణ రెండవ స్థానంలో ఉందని చెప్పారు. తెలంగాణలో పరిపాలన సం స్కరణలు దేశంలో ఎక్కడా లేనంత వేగంగా జరుగుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాల ను ఆయా విభాగాల గణాంకాలే చెబుతున్నాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన మార్క్‌ను చాటిందని, అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం అద్బుతాలు సృష్టిస్తుందని వివరించారు. గుడిసెల నుంచి గూగుల్ వరకు అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో సంపద పెంచి అన్ని వర్గాలకు పంచుతున్నామని తెలిపారు. 3 శాతం జనాభా ఉన్న రాష్ట్రం 30 శాతం అవార్డులు పొందిందని పేర్కొన్నారు. తెలంగాణలో ఏబుల్ గవర్నమెంట్…. స్టేబుల్ లీడర్‌షిప్ ఉంది కాబట్టే ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది….దేశం అనుసరిస్తోందని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

80 శాతం తిరస్కరణ వల్లనే గెలుపు
దేశంలో మొత్తం ఒకేలా ఉండదని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో 80 శాతం వరకు ప్రజలు తిరస్కరించడం వల్లనే ఇతర పార్టీలు గెలుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఉల్లిగడ్డ ధర పెరిగితే ప్రభుత్వాలను పడగొట్టిన దేశం మనదని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీపై వ్యతిరేకత ఉందని 2024 తర్వాత మోడీ ప్రధానిగా ఉండరని జోస్యం చెప్పారు. సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు సిలిండర్‌కు ప్రణామం చేసి మన్మోహన్ సింగ్‌కు గద్దె దించేందుకు ఓటు వేయాలని మోడీ చెప్పారని, మరి సిలిండర్ ధర రూ.1,200 ఉన్నప్పుడు కూడా అదే చేయాలి కదా అని ప్రశ్నిచారు. మోడీ హయాంలో రూపాయి విలువ పడిపోయిందని, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మోడీ అసమర్ధ ప్రధానిగా గుర్తింపు పొందారని విమర్శించారు. దేశంలో అన్ని రంగాలలో వెనుకబాటుతనానికి బిజెపినే కారణమని కెటిఆర్ విమర్శించారు. అయితే దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎవరినో గద్దె దించడానికి ఏకం కాకూడదని, పాజిటివ్ దృక్పధంతో ప్రజలకు మేలు చేసేందుకు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో రెండు పార్టీల విధానం లేదని, బహుళ పార్టీ విధానం ఉందని చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణలో చేసింది దేశం మొత్తం చేస్తుందని అన్నారు. మహారాష్ట్రలో సిఎం కెసిఆర్ సమావేశాల తర్వాత రైతుబంధు వంటి పథకం వచ్చిందని, అది మార్పుకు నాంది అని వ్యాఖ్యానించారు.

కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని, 8 మంది సిఎంలు ప్రచారం చేశారు
కర్ణాటకలో ప్రభుత్వం బాగా పనిచేయలేదు కాబట్టే అక్కడి బిజెపి ప్రభుత్వం ఓడిపోయిందని కెటిఆర్ అన్నారు. తెలంగాణలో సమర్థవంతమైన పాలన అందించే ప్రభుత్వం ఉంది కాబట్టి కర్ణాటక వంటి పరిస్థితి ఇక్కడ రాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపున తాము ప్రచారం చేస్తే బిజెపి నాయకులు విమర్శించారని, కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ సహా, ఎనిమిది మంది ముఖ్యమంత్రులు ప్రచారం చేశారని చెప్పారు. అయినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే అమిషత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో పనిచేయని ప్రభుత్వం ఓడిపోయిందని అన్నారు.

మంచి పనితీరు కనబరిచిన సిట్టింగ్‌లకు సీట్లు
వచ్చే ఎన్నికల్లో మంచి పనితీరు ఉన్న పార్టీ సిట్టింగ్ ఎంఎల్‌ఎలందరికీ సీట్లు దక్కుతాయని కెటిఆర్ వెల్లడించారు. పనితీరులో వెనుకబడిన ఎంఎల్‌ఎలు మెరుగుపరచుకోవాలని తెలిపారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి టికెట్ల విషయంలో ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. 2018 ఎన్నికల్లో తాము కేవలం ఏడుగురు ఎంఎల్‌ఎలకే సీట్లు మార్చామని, మిగతా సిట్టింగులందరికీ సీట్లు కేటాయించామని గుర్తు చేశారు. ప్రపంచంలో యుఎస్‌ఎ, యుకె వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా సమస్యలు ఉన్నాయని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

అసత్య ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారు..
రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది అని కెటిఆర్ ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ఆరోపణలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో హేతుబద్ధత లేదని అన్నారు. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరని, మన పాలనను ఇతర రాష్ట్రాల పాలనతో బేరీజు వేసుకోవాలని కోరారు. ఒకప్పుడు పంటలు పండని చోట నేడు ధాన్యం ఎక్కువైన పరిస్థితి నెలకొందని చెప్పారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కెటిఆర్ స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి కూడా బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కె.టి.రామారావు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాల్లో బిఆర్‌ఎస్ సునాయసంగా గెలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని కెటిఆర్ స్పష్టం చేశారు.

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ సిఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోరన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు 75 ఏళ్లు చేయని పనిని తాము తొమ్మిదేళ్లలో చేసి చూపిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పరిపాలన కొత్త సీసాలో పాత సారాలా ఉంటుందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసే దిశగా ఆలోచిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ తమ పార్టీ కార్యాలయం ప్రారంభించి, కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ నమూనా కావాలని ఇతర రాష్ట్రాలు కోరుతున్నాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రం వంటి పాలన చూడరని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఏ రంగంలో తెలంగాణ కంటే మెరుగైన పాలన అందించారో ఖర్గే, మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్‌గాంధీ ఎన్‌జిఒ నడుపుకోవాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఒక రాజకీయ పార్టీ కాకుండా ఎన్‌జిఒ నడుపుకోవాలని కెటిఆర్ ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్‌గాంధీ పారిపోయారని విమర్శించారు. దేశంలో ఎన్నో సంస్కరణలకు తీసుకువచ్చిన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావును కాంగ్రెస్ పార్టీ అవమానించిందని గుర్తు చేశారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని కెటిఆర్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని అన్నారు. బిజెపికి దమ్ముంటే దేశానికి చేసిన మంచి పనులు ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. నోట్ల రద్దుతో ఏం సాధించారో మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు బ్లాక్ మనీని బయటకు తీస్తాం, తీవ్రవాదాన్ని అరికడతామని చెప్పారని అన్నారు. ఆ సమయంలో తమ పార్టీ కూడా నోట్ల రద్దుకు మద్దతిచ్చిందని, ఆ నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు రూ. 2 వేల నోట్ల రద్దుతో సాధించింది ఏంటో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.

లేని నిరుద్యోగం గురించి నిరసనలు
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల నాయకులకు లేని నిరుద్యోగం గురించి ఇక్కడ నిరసనలు చేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట రంగంలో తమ ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు సృష్టించిందని చెప్పారు. తొమ్మిదేళ్లలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా, మరో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రైవేట్ రంగంలో 2.21 లక్షల ఉద్యోగాలు కల్పించామని అనన్నారు. విదేశీ పర్యటనల పర్యటనలు చేసి వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. తాజా యుఎస్, యుకె పర్యటనతో 42 వేల మందికి ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చామని కెటిఆర్ వెల్లడించారు. ఏ ఏ కంపెనీలలో ఎన్ని ఒప్పందాలు జరిగాయో, ఆయా కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తాయో కూడా వెల్లడించామని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హయాంలో 26 వేల ఉద్యోగాలు భర్తీ అయితే, తొమ్మిదేళ్లలో తాము దానికి ఎనిమిదిరెట్లు ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.

నేషనల్ హైవే టెండర్ మాదిరే ఒఆర్‌ఆర్ టెండర్
ఒఆర్‌ఆర్ టెండర్ ప్రక్రియ నేషనల్ హైవే టెండర్ మాదిరే జరిగిందని మంత్రి కెటిఆర్ వివరించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ఇడి, సిబిఐ లేదా ఇతర ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము మౌనంగా ఉంటే ప్రజలు అబద్దాలను నిజం అనుకునే ప్రదానం ఉందని, అందుకే ఒఆర్‌ఆర్ టెండర్ ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు.ఆరోపణలు చేసిన ప్రతిపక్ష పార్టీల నాయకులు లీగల్ నోటీసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒఆర్‌ఆర్ టెండర్‌కు సంబంధించి ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలని కోరారు. చిల్లర మాటలు, ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలు మానుకోవాలి అని కెటిఆర్ హెచ్చరించారు.

ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్నది ఎంఐఎం ఇష్టం
మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను పక్క రాష్ట్రాల్లో పొగిడిన ఒవైసీ ఇక్కడ ఎందుకు విమర్శలు చేస్తున్నారు కెటిఆర్ ప్రశ్నించారు.ఎంఐఎం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది ఆ పార్టీ ఇష్టమని పేర్కొన్నారు. ప్రజలు మతం ప్రాతిపదికనే ఓట్లు వేస్తారని తాను నమ్మనని, ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని తాను నమ్ముతానని వ్యాఖ్యానించారు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని మతాలకతీతంగా ఎన్నుకుంటారని నమ్ముతున్నాను పేర్కొన్నారు.

తెలంగాణలో బిజెపి లేనే లేదు
తెలంగాణలో బిజెపి లేనే లేదు అని కెటిఆర్ తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలోనే తప్ప సొసైటీ లేదని ఎద్దేవా చేశారు. బిజెపికి ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావని అన్నారు. తెలంగాణలో తమతో పోటీ పడే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదని అన్నారు. అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ భ్రమల్లో ఉందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఇద్దరూ పార్లమెంట్ సభ్యులే అని, వారు ప్రధాని పదవి కోసం పోటీ పడితే బాగుంటుందని అన్నారు.

సౌత్ వర్సెస్ నార్త్ అనేది నా వాదన కాదు..
సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేది తన వాదన కాదని కెటిఆర్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే తన వాదన అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెరిగే సీట్ల మొత్తం సంఖ్య దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్న ఎక్కువ అని, ఇది ఏ రకంగా సమంజసం కాదని అన్నారు. దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరని, లోక్‌సభ స్థానాల పెంపుపై ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. డీ లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, దీనిపై అన్ని పార్టీలు ఏకం కావాలని కోరారు. కుటుంబ నియంత్రణ పాటించి ఉత్తమ విధానాలు అలవంభించిన రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. పార్లమెంట్ సభ్యుల స్థానాల పెంపు జనాభా ప్రాతిపదికన కాకుండా ఇతర ఉత్తమ విధానాల ద్వారా పెంచే విధానాలను పరిశీలించవలసిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. బాగా పనిచేసిన రాష్ట్రాలకు లోక్‌సభ స్థానాల సీట్లు తగ్గకూడదని పేర్కొన్నారు. 2024 తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని ఉండరని జోస్యం చెప్పారు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంపుపై అన్ని పార్టీలు ఉత్తమ విధానాలు అన్వేషించి దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగే విధానం తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే ఉచితాలు అని బిజెపి నేతలు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.

షర్మిల, కెఎ పాల్‌ది భ్రమ మాత్రమే..
రాజకీయాలలో సమ ఉజ్జీలతోనే పోటీ ఉంటుంది కానీ, మరుగుజ్జులతో పోటీ ఉండదని కెటిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా పార్టీలు తమతో పోటీ పడే స్థితిలో లేవని అన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భమల్లో ఉందని చెప్పారు. రాష్ట్రంలో షర్మిల, కెఎ పాల్, ప్రవీణ్‌కుమార్, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తామని చెబుతున్నారని, వారిది భ్రమనే అని విమర్శించారు.

21 రోజుల పాటు మాట్లాడేందుకు మా దగ్గర విషయం ఉంది
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకునేందుకు తమ దగ్గర విషయం ఉందని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల కలను సిఎం కెసిఆర్ నిజం చేశారని చెప్పారు. రాష్ట్రంలో 3,400 తండాలను గ్రామ పంచాతీయులుగా మార్చామని తెలిపారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రజలు విజ్ఞప్తి చేసినా జరగలేదని, సిఎం కెసిఆర్ ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని వివరించారు. చత్తీస్‌ఘడ్‌లో ఎన్నో ఏళ్ల తర్వాత సోనియాగాంధీ కొత్త అసెంబ్లీని ప్రారంభించారని, కానీ తమ ప్రభుత్వం స్వల్ప కాలంలోనే సచివాలయ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. సచివాలయ నిర్మాణాన్ని గతంలో వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారని అన్నారు. కొత్త సచివాలయం వద్ద ప్రీ వెడ్డింగ్ షూటింగ్‌లు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పుడు కొంతమంది ట్విన్ టవర్స్‌పై కూడా విమర్శలు చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News