Thursday, April 25, 2024

ఉచిత జలక్రాంతి

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసిలో ఎన్నికల్లో మాట
ఇచ్చాం… ఇప్పుడు నిలుపుకున్నాం
ఇదే కెసిఆర్ ప్రభుత్వ పనితీరుకు గీటురాయి
రాష్ట్ర ఆదాయన్ని పెంచుతున్నాం.. ప్రజలకు పంచుతున్నాం
ఇప్పటి వరకు ప్రజలపై పన్నుల భారం మోపలేదు… ఉన్న పన్నులు తగ్గించాం
ఉచిత మంచినీటి పథకం వల్ల ప్రభుత్వంపై యేటా రూ.500 కోట్ల అదనపు భారం
రెహమత్‌నగర్‌లో ఉచిత తాగు నీటి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ వాసులకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రభుత్వం ఉచిత మంచి నీటి సరఫరా పథకాన్ని అందిస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. మొన్నటి జిహెచ్‌ఎంసి ఎన్నికల ముందు మాట ఇచ్చాం. దానిని ఇప్పుడు నిలుపుకున్నామన్నారు. ఇది సిఎం కెసిఆర్ ప్రభుత్వ పనితీరుకు గీటురాయిగా ఆయన అభివర్ణించారు. ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై యేటా రూ.500 కోట్ల ఆర్ధిక భారం పడనుందన్నారు. పలు విప్లవాత్కమైన నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచుతూ దానిని తిరిగి ప్రజలు పంచుతున్నామన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలపై విస్మరించే నైజం తమకు లేదన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలపై పన్నుల భారం మోపలేదని, పైగా ఉన్న పన్నులను తగ్గించామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజల పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిలువెత్తు నిదర్శమని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని రెహమత్‌నగర్‌లో ఉచిత తాగు నీరు పథకాన్ని మంత్రి కెటిఆర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఇంటింటికీ జీరో వాటర్ బిల్లులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. ఆ ఒరవడిలోనే తాజాగా సిఎం కెసిఆర్ భాగ్యనగర్ వాసులకు ఉచిత మంచినీటి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఇదొక అద్భుతమైన స్కీమ్‌గా ఆయన అభివర్ణించారు. ఇందులో ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల తాగునీరు ఉచితంగా అందజేస్తామన్నారు. అంతకంటే అదనంగా నీరు వాడుకుంటేనే చార్జీలు విధించడం జరుగుతుందన్నారు. అయితే ఉచిత తాగునీటిని పొందేందుకు మీటర్ తప్పనిసరి చేశామన్నారు. బస్తీలతో పాటు అపార్ట్‌మెంట్ వాసులకూ ఈ పథకం వర్తింపజేస్తున్నట్టు సూచించారు. అయితే ఒక్కో ప్లాటుకు 20 వేల లీటర్ల చొప్పున తాగునీటిని కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో మొత్తం 10.08 లక్షల నల్లా కనెక్షన్లలో 2.37 లక్షల నల్లాలకే మీటర్లు ఉన్నాయని తెలిపారు.ఈ పథకంతో గ్రేటర్‌లో 97 శాతం మందికి లబ్ది చేకూరనుందన్నారు. ఉచిత తాగు నీరు కావాలంటే మార్చి 31లోపు తప్పనిసరిగా మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. కరోనా వంటి కష్టకాలంలోనూ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అమలు చేస్తోందన్నారు. ఉచిత నీరు ఇవ్వడం వల్ల నెలకు సుమారుగా వాటర్‌బోర్డు రూ.19 కోట్ల 92 లక్షల ఆదాయాన్ని కోల్పోనుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమ్మూద్ ఆలీ, మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్, శాసనసభ్యులు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, ముఠా గోపాల్, వివేక్ పాల్గొన్నారు.

KTR launched free drinking water scheme in GHMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News