Thursday, April 25, 2024

ఇక విశ్వసిరిసిల్ల

- Advertisement -
- Advertisement -

KTR lays foundation stone for Gokaldas Images Apparel Factory

సిరిసిల్ల అపెరల్ పార్కులో తయారయ్యే సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్‌లో దర్శనం ఇవ్వనున్నాయి

ఈ పార్కులో 10వేల మందికి ఉపాధి లభిస్తోంది 2005లో హామీ ఇచ్చి
నెరవేర్చని వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సిఎం
కెసిఆర్ ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు 60 ఎకరాల
అపెరల్ పార్కులో రెండు, మూడు ఫ్యాక్టరీలు త్వరలో ప్రారంభంకానున్నాయి
నాణ్యమైన పత్తికి తెలంగాణ కాణాచి ఒకనాటి ఉరిసిల్లను ప్రభుత్వ
పథకాలతో నిజమైన సిరిసిల్లను చేశాం : పెద్దూరులో గల అపెరల్ పార్కులో
గోకుల్‌దాస్ ఫ్యాక్టరీకి పునాదిరాయి వేస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ సిరిసిల్ల: అంతర్జాతీయ ప్రమాణాలతో సిరిసిల్ల అపెరల్ పార్క్‌లో తయారయ్యే సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలు అంతర్జాతీయ విఫణిలో ఇక అమ్మకాలకు దర్శనమివ్వనున్నాయని మంత్రి కెటిఆర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని పెద్దూరులో ఉన్న అపెరల్ పార్క్‌లో గోకుల్‌దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫాక్టరీ నిర్మాణానికి ఫౌండేషన్ వేసి, భూమి పూజ నిర్వహించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడారు. సిరిసిల్లలో అపెరల్ పార్క్ ఏర్పాటు చేయాలనేది సిరిసిల్ల ప్రజల చిరకాల కోరిక అని, 2005వ సంవత్సరంలో అప్పటి సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిరిసిల్లలో అపెరల్‌పార్క్ కోసం  హమీ ఇచ్చినా నెరవేర్చలేదన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత సిఎం కెసిఆర్ సిరిసిల్ల ప్రాంత అభివృధ్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో సిరిసిల్ల ప్రజల కోరిక నెరవేరి సిరిసిల్లకు మంచిరోజులు వచ్చి అపెరల్ పార్క్ వచ్చిందన్నారు.

రానున్న కొద్ది రోజుల్లోనే సిరిసిల్లకు చెందిన పది వేల మందికి అపెరల్ పార్క్‌లో ఉపాధి లభిస్తుందన్నారు. అందులో ఎనభైశాతం మంది మహిళలే ఉంటారని మంత్రి అన్నారు. సిరిసిల్లలో ఒకప్పుడు మగవారు మగ్గం పనిచేస్తే నెలకు ఎనిమిది వేల రూపాయలు, మహిళలు రోజంతా కఫ్టపడి బీడీలు చుడితే రెండు వేలు వచ్చేవన్నారు. సిఎం కెసిఆర్ తీసుకున్న చర్యలతో బతుకమ్మ చీరెలు, ఆర్‌విఎం వస్త్రాలు తయారు చేసే మగవారికి నెలకు పదిహేను వేల రూపాయల నుండి పద్దెనిమిదివేల రూపాయలు ఆదాయం వస్తున్నదన్నారు. మహిళలకు అపెరల్ పార్క్‌లో రోజులో కేవలం ఎనిమిది గంట లు ఆరోగ్యకరమైన, ఆహ్లదకర వాతావరణంలో పని చేస్తే నెలకు పది వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయల అదాయం లభిస్తు ందన్నారు. అపెరల్ పార్క్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు ఉంటాయన్నారు. ఇక్కడ ఉత్పత్తయ్యే దుస్తులు సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలుగా అంతర్జాతీయ మార్కెట్ స్థాయికి తగినట్లుగా ఉంటాయన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సిరిసిల్ల బ్రాండ్ వస్త్రాలు అమ్మకానికి సిద్ధ్దంగా ఉంటాయన్నారు.

మహిళలు పనివేళల్లో చంటి పిల్లలతో వస్తే చంటి పిల్లలకు ఆడుకోవడానికి పార్కులు ఉంటాయని, వైద్య సదుపాయాలు ఉంటాయని వివరించారు. అపెరల్ పార్క్‌లోని 60 ఎకరాల్లో రెండుమూడు ఫాక్టరీలు త్వరలోనే పనులు ప్రారంభి స్తాయన్నారు. సిఎం కెసిఆర్ ఆశీస్సులతో సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృధ్ధి పథంలో నడిపిస్తూ, కళకళలాడేలా తయారు చేస్తానన్నారు. దేశంలో తెల్ల బంగారం (పత్తి) ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, నాణ్యమైన పత్తికి తెలంగాణ కేరాఫ్ అడ్రసని తమిళనాడుకు చెందిన సౌత్ ఇండియా మిల్స్ అసోసియేషన్ వెల్లడించిందన్నారు. తెలంగాణలో పండే పత్తి గుజరాత్, మహరాష్ట్ర, కర్ణాటలకంటే కూడా నాణ్యమైనదన్నారు. రైతుకు మద్దతు ధర, యువతకు ఉపాధి, కొలువులు లభించేలా చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం టి టాప్ (తెలంగాణ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ పాలసీ) తీసుకువచ్చిందన్నారు. ప్రముఖ వస్త్రోత్పత్తి సంస్థలను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరామన్నారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌లో యంగ్ వన్స్ సంస్థ ద్వారా దాదాపు పన్నెండు వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. వరంగల్, సిరిసిల్ల, గద్వాల, నారాయణపేట, పోచంపల్లిలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని వివరిం చారు. సిరిసిల్ల అపెరల్ పార్క్ ద్వారా పది వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మేడ్ ఇన్ సిరిసిల్ల బ్రాండ్ ప్రపంచవిఫణికి తెలుస్తుం దన్నారు.

దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులను పథకాలను తెలంగాణలో అమలు పరుస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ ప్రకటించిన నేతన్నకు చేయూత చేనేత బీమా పథకాన్ని త్వరలోనే అమలు పరిచి రైతు బీమా మాదిరిగా ఏ కారణంతో నేతన్నలు మరణించినా వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు అందేలా చేయనున్నట్లు వివరించారు. గతంలో సిరిసిల్లలో వారానికి ఎనిమిది మంది మృతి చెంది సిరిసిల్ల ఉరిశాలగా మారితే దాన్ని ప్రభుత్వ పథకాలతో సిరిసంపదలకు నిలయంగా విలసిల్లేలా చేస్తున్నామని అంటూ ఇప్పటికి ఆఠాణ పని జరిగిందని, ఇంకా ఆఠాణ పని చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికీ 50 శాతం నూలు సబ్సిడీని కొనసాగిస్తున్నామన్నారు. మరమగ్గాల ఆధునీకరణకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నామన్నారు. పవర్ సబ్సిడీని కొనసాగిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 88 ఎకరాల్లో వర్కర్ టూ ఓనర్ పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాలుగు వందల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నామన్నారు. రైతుల ఆత్మహత్యలు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిందన్నారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ అభివృధ్ధికి తగిన కృషి చేస్తానన్నారు.మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తే నెలకు పన్నెండు వేల రూపాయల ఆదాయం వచ్చేలా అపెరల్ పార్క్‌లో ఉపాధి లభిస్తుందని, సిరిసిల్ల నుండి బస్సుల్లో పార్క్‌కు తీసుకొని వచ్చి మళ్లీ సిరిసిల్లలో ఇంటివద్ద దిగబెడతారని వివరించారు.

ఇది ప్రారంభం మాత్రమేనని ఇప్పుడే బీజం పడిందనిత్వరలోనే సిరిసిల్లలో మరింత అభివృధ్ధిని సాధిస్తామని అన్నారు.నిరంతరం సిరిసిల్ల అభివృధ్ధికి పనిచేసి సిరిసిల్లప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి శైలజారామయ్యార్, గోకుల్‌దాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సుమీర్ హిందూజా, సహకార సంఘాల జాతీయ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు,జడ్‌పి చైర్మన్ న్యాలకొండ అరుణ, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, రైతు బంధు జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య,గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళిశాఖ అధికారి అశోక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News