Thursday, March 28, 2024

మున్సిపాలిటీల్లో ఖాళీల భర్తీపై కసరత్తు

- Advertisement -
- Advertisement -

KTR Meeting with Municipal officials 

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీపై కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. నగరాలను ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి చేయడం, పట్టణల్లో రోజురోజుకు జనాభా పెరిగిపోతుండడం… భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు పంచాయితీలను మున్సిపాలిటీలగా తీర్చిదిద్దింది. ఈ నేపథ్యంలో కొత్తగా పలు మున్సిపాలిటీలు ఏర్పాటు కావడం, పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా పోస్టులు చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నారు. దీంతో వీటన్నింటిని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసి మున్సిపాలిటీల పనితీరును పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా మున్సిపాలిటీల్లో పోస్టుల భర్తీకీ రాష్ట్ర మంత్రవర్గం కూడా ఇది వరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పదవుల భర్తీ ప్రక్రియపై మంగళవారం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీల్లో ఏఏ విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయి? ఎప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నాయి? యుద్ద ప్రాతిపదికన ఎన్ని పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది? తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉంటాయన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది కేటాయింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని రేషనలైజ్ చేసిన తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకాలు జరుపుతామన్నారు.

ప్రధానంగా ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, హెల్త్ అండ్ శానిటేషన్, ఇన్ ఫ్రా విభాగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలన ప్రతిఫలాలు అందాలని ఆదేశించారు. నూతన పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలనను అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. దీంతో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో సిబ్బంది అవసరం మరింత ఎక్కువనగా ఉండే అవకాశమున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. అలాగే హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

KTR Meeting with Municipal officials 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News