Home తాజా వార్తలు హెల్త్‌కేర్ త్రిడి రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి

హెల్త్‌కేర్ త్రిడి రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి

KTR participates at national conference organized in hicc

 

వైద్య రంగంలో కీలక పాత్ర పోషించనునన ఈ సాంకేతిక పరిజ్ఞానం
త్రిడి ప్రింటింగ్ కోసం టి..హబ్‌లో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు
వైద్య పరికరాలు, ఇంప్లాంట్‌ల త్రిడి ప్రింటింగ్‌పై హెచ్‌ఐసిసిలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : హెల్త్ కేర్ త్రిడి ప్రింటింగ్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞా నంతో వైద్యసేవలు మరింత మెరుగుపర్చవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు దేశాలు త్రిడి ప్రింటింగ్ పరిజ్ఞా నాన్ని ఉపయోగిస్తూ వైద్య రంగంలో దూసుపోతున్నాయన్నారు. భారతదేశంలోనూ ఈ విజ్ఞానంతో వైద్య రంగం అభివృద్ధికి చక్కటి అవకాశముందని కెటిఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం త్రిడి ప్రింటింగ్ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఇందులో భాగంగా త్వరలో అందుబాటులోకి రానున్న టి.. హబ్ కొత్త బ్లాక్‌లో త్రిడి ప్రింటింగ్ కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనన్నట్లు ఆయన తెలిపారు.

టి.. వర్క్ ద్వారా అనేక ప్రోటోటైప్స్ రూపొందిస్తున్నామని.. కరోనా సమయంలో మెకానికల్ వెంటిలేటర్‌ను రూపొందించిందని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో వైద్య పరికరాలు, ఇంప్లాంట్‌ల త్రిడి ప్రింటింగ్‌పై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్రిడి ప్రింటింగ్ ద్వారా సర్జన్లు, రోగులకు వైద్య సేవలను మరింత మెరుగు పరిచే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగంలో వస్తున్న పలు విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా.. ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకోవడంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపనున్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు.

ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. ఆర్థికంగా హెల్త్ కేర్ త్రిడి ప్రింటింగ్ మార్కెట్ విలువ 2020లో 1.7 బిలియన్ డాలర్లుగా ఉండగా.. అది 2027 నాటికి 7.1 బిలియన్లకు చేరుతుందని ఒక అంచనా అని పేర్కొన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్‌తో పాటు పలు విభాగాల రోగుల్లో ఇంప్లాంట్లకు డిమాండ్ పెరగడం ఈ రంగం అభివృద్ధికి ప్రధాన కారణమని కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మన దేశానికి కూడా చక్కటి అవకాశముందన్నారు. యుఎస్, యూరోపియన్ మార్కెట్లలో ఇప్పటికే ఈ సాంకేతికత దూసుకుపోతుందన్నారు. ఈ నేపథ్యంలో ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న నేషనల్ సెంటర్ ఫర్ ఆడిట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్‌లో ఈ రంగంలో దేశం పురోగతి సాధిస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.

KTR participates at national conference organized in hicc