Thursday, April 25, 2024

ఫలించిన తారకమంత్రం

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉండి ఏకపక్షంగా విజయాలు నమోదు చేసుకుంది. కెసిఆర్ చూపిన బాటలో కెటిఆర్ అనుసరించిన వ్యూహంతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ‘ఎన్నికలు ఏవైనా గెలుపు టి.ఆర్.ఎస్.దే’ అన్న కెటిఆర్ మాటల్ని ప్రజలు మరోసారి రుజువు చేశారు. అత్యంత కీలకంగా భావించిన పురపాలక ఎన్నికల్లో ఊహించినట్టుగానే తెరాస విజయ దుందుభి మోగించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం వేరు. స్థానిక సంస్థల్లో గెలవడం వేరు.
గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డుల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం అంత సులభం కాదు. అక్కడ స్థానిక సమస్యలే కాకుండా కులం, మతం, బంధువర్గం, స్థానిక ప్రజా సంబంధాలు, బస్తీల్లో ఉండే పరిచయాలు, స్థానికంగా మద్దతు పలికే కుటుంబాలు, వ్యక్తులు తదితర అంశాలన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. కాని జనవరిలో జరిగిన గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ప్రజలు కెసిఅర్‌ను చూసే ఓటు వేశారనేది స్పష్టమవుతోంది. పిడికెడు మందితో ప్రారంభమైన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ర్ట సమితి అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు ఈరోజు తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా, సొంత పార్టీగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అప్రతిహతంగా ముందుకెళుతున్నది.

ఇంతగా విజయాలు ఎలా లభిస్తున్నాయి? పొత్తులు లేకుండానే ఏక కాలంలో ప్రతిపక్ష పార్టీలన్నింటిని మట్టి కరిపించే విధంగా ఫలితాలు ఎలా సాధ్యమవుతున్నాయి? కెసిఆర్ పట్ల ప్రజల విశ్వసనీయత చెక్కు చెదరడం లేదు. అన్ని వర్గాల ఆమోదంతో కారు పార్టీ దినదినం విస్తరిస్తోంది. అందుకే తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం నాటి నుండి జరిగిన ప్రతి ఎన్నికలోన్లూ ఉప ఎన్నికల్లోనూ గెలుస్తూ అంతకంతగా విస్తరిస్తూ వస్తోంది. విరోధులు విస్తుపోయేలా విజయాలు సాధిస్తున్నది. తెలంగాణ ప్రజల ఆలోచన విధానాల్ని, వారు ప్రభుత్వం నుండి ఏమి కోరుకుంటున్నారు? తమ సమస్యల పరిష్కారానికి ఏ విధమైన పరిష్కార మార్గాల్ని కోరుకుంటున్నారు అనే విషయం కెసిఆర్‌కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదు. అన్ని వర్గాల ఆమోదంతో తెరాస దినదిన ప్రవర్ధమానమై విస్తరిస్తోంది.

తెలంగాణ రాష్ర్టం సాకారమయిన నాటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో గెలుస్తూ అంతకంతగా విస్తరిస్తోంది. తమ సమస్యల పరిష్కారానికి ఏ విధమైన పరిష్కార మార్గాన్ని కోరుకుంటున్నారో గమనించి తదనుగుణంగా కార్యాచరణ రూపొందించి ముందుకెళుతున్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనించకుండా నోటికి వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేసి పదేపదే దెబ్బ తింటున్నాయి.

నాయకుడు సమస్యను, పరిస్థితిని అంచనావేసి ఆకలింపు చేసుకుని ఆచరణాత్మక ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని సాధించినపుడు పలువురి ప్రశంసలు పొందుతాడు. అలా చేసేవారు ప్రజలు మెచ్చే నాయకుడిగా స్థిరపడి పోతారు. కెసిఆర్ అత్యున్నతమైన ఆలోచనా విధానంతో పాలనాదక్షతతో వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో ప్రజల మద్దతు కెసిఆర్‌కు పుష్కలంగా లభిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత కెటిఆర్ స్థానం మరింతగా గట్టి పడింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన బాధ్యతను, ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కెటిఆర్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రణాళికను పక్కాగా రూపొందించుకొని పకడ్బందీగా అమలు చేసి రాజకీయంగా మంచి వ్యూహకర్తగా, కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్నారు. 2016 జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పూర్తి బాధ్యతలు తీసుకొని 150 స్థానాల్లో 99 స్థానాలు గెలిచి పొత్తు లేకుండానే మేయర్ స్థానాన్ని దక్కించుకోవడం ఒక చరిత్ర. గత శాసనసభ ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకుని పార్టీని నూతనోత్తేజంతో ముందుకు నడిపిస్తున్న తీరు ప్రశంసనీయం. మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చేయడంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు టిఆర్‌ఎస్ కార్యకర్తలను మరింత చేరువ చేస్తున్నది.

రాజకీయాలలో నాయకత్వం రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారికి ప్రవేశం సులభంగా ఉంటుంది. కానీ నిలబడటంలో లక్షణాలను నిరూపించుకోవడంలో ఎంతో స్వయం కృషి అవసరం. ఈ విషయం భారత రాజకీయాల్లో అనేక సందర్భాల్లో నిరూపితమైంది. కెసిఆర్ ఆలోచనల్ని అంతరంగాన్ని అర్థం చేసుకొని తదనుగుణంగా తన పని తాను చేసుకుంటూ పోతున్న కెటిఆర్ ఈతరం మెచ్చిన నాయకుడిగా ఆమోదం పొందారని అనుకుంటున్నారు. ఒక కార్యం చేపడితే విశ్రమించకుండా, విసుగు చెందకుండా, విరామం లేకుండా పని చేసే వారే విజయం సాధిస్తారు. అనేక క్లిష్ట సమయాల్లో పరిణితి చెందిన నాయకుడిగా ఎదుగుతూ వస్తున్న కెటిఆర్‌లో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు.

టిఆర్‌ఎస్ పార్టీ మూట కట్టుకున్న విజయాల వెనక ఎంతో కఠోర శ్రమ ఉన్నది. ఎన్నో అవమానాలను దిగమింగుకొని, విమర్శల ధాటిని ఎదుర్కొని, కుట్రలు, కుయుక్తులు తట్టుకొని 20వ సంవత్సరంలో అడుగుపెడుతోంది టిఆర్‌ఎస్. ప్రతి క్లిష్ట సమయంలోనూ కార్యకర్తలు పార్టీ బరువును మోస్తూ నిలబెట్టుకున్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ కార్యసాధనలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలపాలని ఆశిస్తున్నారు తెలంగాణ ప్రజలు. వారి ఆశల్ని ఆశయాలను నిలబెట్టే దిశగా కెటిఆర్ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ తెలంగాణ భవిష్యత్‌ను నిర్మించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.

సురేష్ కాలేరు
9866174474

 

KTR Plans Success in Telangana Municipal Elections
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News