పాశమైలారం పేలుడు ఘటనలో భయంకర పేలుడు జరిగి యాభై మందికి పైగా చనిపోతే రేవంత్ రెడ్డి మాత్రం సంఘటన స్థలానికి వెళ్లి ఫోటో షూట్ చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆక్షేపించారు. సిగాచీ ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయినవారి పట్ల రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానవీయం-, మృతదేహాలను కార్డ్ బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తమ వారి సమాచారం కోసం కుటుంబ సభ్యులు పోలీసుల కాళ్లపై పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఘటనా స్థలంలో ఎంతమంది ఉన్నారన్న దానిపై కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదని విమర్శించారు.
కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వలస కార్మికులను వదిలేసినప్పుడు.. చాలా మంది హృదయాల్లో ప్రతిధ్వనించింది కెసిఆర్ పేరు మాత్రమేనని గుర్తు చేశారు. వలస కార్మికులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు, సమాన వాటాదారులు అని కెసిఆర్ చెప్పారని అన్నారు. వారికి ఉచితంగా రేషన్, సొంత ప్రాంతానికి రవాణా, వైద్య సదుపాయాలు కల్పించి గౌరవం, ఆశ కల్పించారని పేర్కొన్నారు. ఎస్‌ఎల్‌బిసి ఘటనలో పరిహారం అందక 8 బాధిత కుటుంబాలు ఇంకా వేచి చూస్తున్నాయన్నారు. వలస కార్మికులు మనుషులు కారా..? చనిపోయిన వారికి కనీస గౌరవం ఇవ్వలేరా..? కెటిఆర్ ప్రశ్నించారు.