Home తాజా వార్తలు వేగం పెంచాలి

వేగం పెంచాలి

KTR

రాష్ట్రం మొత్తం మీద లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
స్థలాలు ఇచ్చిన వారి ఎంపిక ముందు చేపట్టాలి
జిల్లాల కలెక్టర్లు, హౌసింగ్ , పురపాలక శాఖల అధికారులతో మంత్రి సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకంపైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సమీక్షించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష చేశారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణం పైన ప్రధానమైన చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, ముఖ్యంగా లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా జిహెచ్‌ఎంసి పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని హౌసింగ్ శాఖ అధికారులు మంత్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వాటి నిర్మాణ పనుల పురోగతిని మంత్రులు సమీక్షించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు చాలా చోట్ల 70 శాతానికిపైగా పూర్తయ్యాయని, మిగిలినచోట్ల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని మంత్రులకు అధికారులు తెలియజేశారు. నిర్మాణాలు దాదాపు పూర్తయ్యేందుకు వచ్చిన ప్రాజెక్టు సైట్ల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని, ఆయా ప్రాంతాలకు అవసరం అయిన తాగునీరు మరియు ఇతర సౌకర్యాల కల్పన పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతోపాటు హైదరాబాద్ నగరంలోమ్ మురికివాడల్లో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి ఇప్పటికే ఆ ప్రాంతాల కోసం స్థలాలు ఇచ్చిన పేదలకు అప్పగించాలని కోరారు. దీంతోపాటు హైదరాబాద్ నగర పరిధిలోని జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినందున వాటి లబ్ధిదారుల ఎంపికను ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు ఒక నిర్దిష్టమైన ప్రక్రియను వెంటనే తయారుచేయాలని హౌసింగ్ శాఖ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్లకు మంత్రులు ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ రూపొందించిన తర్వాత లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో అందరి ముందట ఎంపిక చేయాలని సూచించారు. ఒక్కసారి ఒక లబ్ధిదారుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పొందిన తర్వాత, ఇంకోచోట దరఖాస్తు చేయకుండా చూసుకోవాలని కోరారు. హైదరాబాద్ , రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.

జిహెచ్‌ఎంసి నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయని, వీటికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక నివేదిక తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు, హౌసింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండి దానకిషోర్ పాల్గొన్నారు.

KTR Review On Double Bedroom House Scheme