Saturday, April 20, 2024

ఆహార శుద్ధికి ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

 రైతులకు ఆర్థిక స్వావలంభన, యువతకు ఉపాధి అవకాశాలు

 సహకార, స్వయం సహాయక సంఘాలకు పెద్ద ఎత్తున రాయితీల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది
 ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అధ్యయనం

 చిన్న యూనిట్ల నుండి భారీ పరిశ్రమల వరకు స్థాపనకు అవకాశం

 కల్తీ లేని ఆహార ఉత్పత్తుల లభ్యత, జల విప్లవానికి మరో మూడు విప్లవాలు తోడయ్యాయి

 వ్యవసాయ ఉత్పత్తులకు ఢోకా లేదు, పంటల మ్యాపింగ్ కూడా పూర్తి చేశాం

 ఆహారశుద్ధి, లాజిస్టిక్స్ పాలసీపై మంత్రి కెటిఆర్ వీడియో ప్రజెంటేషన్
 పలువురు మంత్రుల హాజరు, పాలసీకి పలు సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్: భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, పంటల ఉత్పత్తుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయన్నారు. అందువల్ల ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను తక్షణమే ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ఆహార శుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలను పెద్దఎత్తున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సముఖంగా ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న ప్రోత్సాహకాలు పరిశీలించామన్నారు. ఆహార శుద్ధి, లాజిస్టిక్స్ పాలసిలపై చర్చించడానికి, తగు మార్గదర్శకాల రూపకల్పనకు బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్ నేతృత్వంలో మేధోమథనం జరిగింది. దీనిపై తొలత మంత్రులకు కెటిఆర్ వీడియో ప్రజెంటేషన్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి వివరించారు. అలాగే ఆహార శుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాల గురించి తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం మనకు లేదని వివరించారు.

అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా తీసుకవచ్చే పాలసీ ద్వారా చిన్న యూనిట్ల నుండి భారీ పరిశ్రమల వరకు స్థాపనకు అవకాశం ఉన్నదన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగు అవుతాయని పేర్కొన్నారు. ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యత గల ఆహార ఉత్పత్తుల లభ్యత పెరుగుతుందన్నారు. ఇందులో స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ యువత, మరియు మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. సిఎం కెసిఆర్ చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో జల విప్లవం వస్తున్నదని, ఫలితంగా లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ జల విప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేతా విప్లవం(పాడి పరిశ్రమ) కూడా రాష్ట్రంలో రానున్నాయన్న విశ్వాసాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. సిఎం చేసిన సూచనల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏం పంటలు పండుతున్నాయి అనేది పూర్తిగా మ్యాపింగ్ చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. అలాగే సిఎం చొరవతో గొర్రెల పంపకం, చేప పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కాగా సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు కూడా కొన్ని సూచనలు చేశారు. వాటిల్లో ప్రధానంగా మారుతున్న పంటల సరళిని దృష్టిలో ఉంచుకుని ఆహార శుద్ధి కంపెనీలను ప్రోత్సహించాలన్నారు.

అలాగే పౌల్ట్రీ, మాంస ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్ రంగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కొన్ని పనులకు వర్కర్ల కొరత ఉన్న నేపథ్యంలో ఆయా పనుల్లో యాంత్రీకరణ ప్రోత్సహించాలని సూచించారు. ఇక గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న ఆహార శుద్ధి పరిశ్రమలకు తోడ్పాటు అందించాలన్నారు. దళిత, మహిళా పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాలు అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ బ్రాండ్ నాణ్యమైన ఉత్పత్తులను ప్రపంచం మొత్తం ఎగుమతి అయ్యేలా చూడడంతో పాటు ఆహార కల్తీని అరికట్టి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తులు అందించాలన్నారు. పాల ఉత్పత్తులు విస్తృతంగా అవకాశాలు కల్పించడంతో పాటుగా నూనె గింజల ఉత్పత్తిని పెంచే ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహం అందించాన్నారు. పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన వల్ల వృధా తగ్గి రైతుకు లాభం జరిగే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా మంత్రి వేముల మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా బాల్కొడ నియోజకవర్గంలో 42 ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్పైస్ పార్క్‌కు చుట్టూ 50 కి.మీ లోపల లక్ష ఎకరాల పసుపు సాగు అవుతున్నది కావున బాల్కొండ నియోజకవర్గంలో కల స్పైస్ పార్క్‌లో పసుపు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని కోరారు. అదే విధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లక్కంపల్లి సెజ్‌లో సోయా, మక్కల ఆహార శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలని కేటిఆర్‌ని కోరగా అందుకు వారు సముఖత వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

KTR Review on Food Process Units in Pragathi Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News