Wednesday, April 24, 2024

హస్తంవి మాటలే.. చేతలు ఉత్తవే

- Advertisement -
- Advertisement -

KTR satires on Utham kumar reddy

 

బిజెపి ఏదో ఊహించి తమకు తామే ఆందోళనలు చేస్తుంది

గుజరాత్ తరహా చట్టాలు తెచ్చి రోడ్ల విస్తరణ చేస్తాం

రోడ్ల మధ్యలో ఉన్న దర్గాలు, గుళ్ల తొలగించేందుకు బిజెపి, ఎంఐఎం సహకరించాలి

శాసనమండలిలో మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ఆలోచనలు చేస్తుందే కానీ ఆచరణ చేయదు. ఆచరణ చేస్తమని ఏ ప్రభుత్వమైనా ముందుకు వస్తే ఆరోపణలు చేస్తుంటుందని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. బుధవారం శాసనమండలిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యాక్ట్ సవరణ బిల్లుపై వాడిగావేడిగా చర్చ జరిగింది. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఈ బిల్లుద్వారా సంక్రమిస్తాయని కెటిఆర్ వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రతిపాదన కాంగ్రెస్ ఎప్పుడో చేసిందన్నారు. దీనికి మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పుతూ కాలం వెళ్లబుచ్చుతూ ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెడుతుంటుందన్నారు. రాష్ట్రాన్ని, దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రణాళికలకు ఆలోచనలు చేసిందే కానీ ఆచరించలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లు ఎందుకు తీసుకురాలేదని కెటిఆర్ ప్రశ్నించారు. ఏ అభివృద్ధి పని ప్రారంభించినా, ఏ బిల్లు తీసుకువచ్చినా మేము ఎప్పుడో ఆలోచించామనడం కాంగ్రెస్‌కు అలవాటై పోయిందని విమర్శించారు.

ఎప్పడో ఆలోచిస్తే ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌కు ప్రాధాన్యత ఇస్తోందని కెటిఆర్ చెప్పారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో జిఒ ద్వారా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రస్తుతం ఆ జిఒకు చట్టబద్దత కల్పిస్తున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 150 వార్డులకు 75 మంది మహిళలను రిజర్వేషన్ల మేరకు పోటీలో నిలపడంతో పాటుగా జనరల్ కోటాలో కూడా మహిళలకు అవకాశం ఇవ్వడంతో 79 మంది మహిళలు కార్పొరేటర్లు గా గెలిచారని ఆయన వివరించారు. అలాగే బిసి రిజర్వేషన్లను కూడా పటిష్టంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో ఇబిసిలతో కలుపుకొని 67 శాతం బిసి రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బిసి రిజర్వేషన్ అమలు కాకున్నా మాట్లాడని ఆపార్టీ నాయకులు ఇక్కడ ఏదో మాట్లాడాలని మాట్లాడుతారన్నారు.
బిజెపి విధానాలు మరీ విడ్డూరంగా ఉంటాయని విమర్శించారు. ఏదైనా చట్టం తీసుకురావలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ముందుగానే ఏదో ఊహించి బిజెపి ఆందోళనలు చేస్తూ నవ్వుల పాలవుతుందన్నారు. మున్సిపాలిటీ చట్టంలో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అర్హులను చేస్తూ చట్ట సవరణ చేశారని బిజెపి ఊహించి ఛలో అసెంబ్లీ పిలుపు ఇస్తారు.

ఆతర్వాత ఆందోళన విజయవంతమని వారికి వారే ప్రకటిస్తారు. మున్సిపాలిటీ బిల్లులో పిల్లల ప్రసక్తే లేదని కెటిఆర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నుంచి రాష్ట్రాభివృద్ధికి ఒక్కపైసా కూడా తీసుకురాని బిజెపి నాయకులు రాష్ట్రం లో అభివృద్ధి గురించి మాట్లాడుతారు, అసత్య ఆరోపణలు చేస్తారని విమర్శించారు. చట్టం మేరకు కేంద్రం నుంచి రావల్సిన నిధులను కూడా కేంద్రం నుంచి రావడం లేదన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికప్పుడు ప్రజలను మభ్యపెట్టి బట్టకాల్చి ముఖాన వేస్తారని కెటిఆర్ విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏది చేసినా ప్రజాక్షేమం, రాష్ట్రాభివృద్ధి, చట్టం మేరకు పనులు చేస్తుందనే విషయం ప్రజలకు తెలుసని కెటిఆర్ చెప్పారు.

గుజరాత్ తరహాలో చట్టాలు చేస్తాం

రోడ్లమధ్యలో ఉన్న దర్గాలను, చిన్నచిన్న గుళ్లను తొలగించేందుకు గుజరాత్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి పక్కాగా అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అహ్మదాబాద్‌లో రోడ్ల విస్తరణలో అడ్డుగా ఉన్న దర్గాలను, గుళ్లను, కట్టడాలను కూల్చి, రోడ్లను విస్తరించిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న ఈ దర్గాలు, చిన్నచిన్న గుళ్లు తొలగిస్తామంటే ఒకవైపు బజెపి, మరో వైపు ఎంఐఎం ఆందోళనలకు దిగుతున్నాయని చెప్పారు. అంబర్‌పేటలో దర్గా విషయంలో ఇదే జరగుతుందని కెటిఆర్ వివరించారు. ఏ దేవుళ్లు రోడ్ల మధ్యలో, కాలుష్యం మధ్యలో ఉండాలని కోరుకోరని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో బిజెపి, ఎంఐఎం సహకరిస్తే రోడ్ల మధ్యలో ఉన్న గుళ్లు, దర్గాలను తొలగిస్తామని కెటిఆర్ చెప్పారు.

అంగీకరించం ఎంఐఎం

అంబర్‌పేటలోని దర్గాను తొలగించడానికి, తరలించడానికి ఎంఐఎం అంగీకరించే ప్రసక్తే లేదని ఎంఐఎం సభ్యుడు జాఫ్రీ స్పష్టం చేశారు. కెటిఆర్ ప్రసంగం తర్వాత జాఫ్రీ తక్షణం స్పందించారు. ఈ దర్గాకు చరిత్ర ఉందన్నారు. అవసరమనుకుంటే పక్కనుంచి రహదారి విస్తరణ చేయాలని చెప్పారు.

కాంగ్రెస్‌కు సవాల్ విసిరిన మంత్రి వేముల

గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టం తీసుకువస్తే ఏవో మాటాలు చెపుతున్న కాంగ్రెస్ సభ్యుడు మహిళా రిజర్వేషన్‌కు అనుకూలమా కాదా అని స్పష్టం చేయాలని సవాల్ విసిరారు. అయితే సవాల్ పై ఎలాంటి వివరణ ఇవ్వని కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డి మున్సిపల్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో మహిళా రిజరేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకతను స్పష్టం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News