Wednesday, April 24, 2024

ఇదేం చోద్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లోనూ కేంద్ర మంత్రులు పచ్చి అబద్దాలు చెబుతుండడంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా కేంద్ర మంత్రులు సమాధానాలు ఇస్తుండడంపై తప్పుబట్టారు. చట్టాలను తయారు చేసే పార్లమెంట్‌కు దేశంలో అత్యున్నతమైన స్థానం, గౌరవం ఉందన్నారు. అలాంటి సభల్లో
కూడా కేంద్ర మంత్రులు…బిజెపి బహిరంగ సభల్లో మాట్లాడినట్లు బాధ్యత లేకుండా ప్రకటనలు చేయడంపై ఆక్షేపించారు.
తెలంగాణకు బల్క్‌డ్రగ్ ప్రాజెక్టును ఇచ్చామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి మాండవియా చెప్పడంపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లైఫ్ సైన్స్‌స్‌కు హబ్‌గా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడమే కాకుండా బల్క్‌డ్రగ్‌ను
ఇచ్చినట్లు పచ్చి అబద్దలు ఆడుతున్నారన్నారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ఆయన మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పెట్టించే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్రమంత్రిపై లోక్‌సభలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ఎంపి నామా నాగేశ్వరరావును కోరారు. కాగా లిఖిత పూర్వక సమాధానంలో మాత్రం హిమాచల్ ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు మాత్రమే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించినట్లు పేర్కొన్న కేంద్రం… నోటి మాటతో తెలంగాణకు కూడా కేటాయించినట్లు చెప్పడం దురదృష్టకరమన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి ప్రత్యక్ష నిదర్శనమని విమర్శించారు. ఇలా అన్ని విషయాల్లోనూ కేంద్రం తెలంగాణకు అడుగడుగునా అన్యాయమే చేస్తోందని ధ్వజమెత్తారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా నామా మాట్లాడుతూ… తెలంగాణకు బల్క్‌డ్రగ్ ప్రాజెక్టును ఎప్పుడు కేటాయిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర వైద్య శాఖ మంత్రి మాండవియా స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు గతంలోనే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో 13 రాష్ట్రాలనుంచి ఈ అంశంపై కేంద్రానికి వినతులు వచ్చాయని తెలంగాణలో కూడా బల్క్ డ్రగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ సమాధానంపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బల్క్‌డ్రగ్ పార్కును ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా లోక్‌సభలో కేంద్ర మంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ అంశంపై గత సెప్టెంబర్ 1న బల్క్ డ్రగ్ ఏర్పాటుకు తెలంగాణ చేసిన వినతిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. వరల్డ్ వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఉన్న హైదరబాద్‌ను కాదని మరోసారి గుజరాత్‌కే కేంద్రం వరాలు కురిపించిందని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు.

కేంద్రానికి తెలంగాణ ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే అధికంగా ఉన్నాయని మరోసారి చెప్పకనే చెప్పిందని విమర్శించారు. మోడీ పాలనను చూస్తుంటే అసలు భారత దేశంలో తెలంగాణ అన్నది ఒక రాష్ట్రం ఉన్నదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు. గుజరాత్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బల్క్ డ్రగ్ కేటాయించిన కేంద్రం తెలంగాణను మాత్రం విస్మరించడం సిగ్గుచేటని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేస్తూనే…మరోవైపు చట్టసభల్లో మాత్రం ఏదో ఉద్దరించినట్లుగా ఊకదంపుడు ప్రకటనలు చేయడం ఎందుకని కెటిఆర్ ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రకటన చేసి తెలంగాణ ప్రజల హృదయాన్ని కేంద్రమంత్రి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రజలకు క్షమాపలు చెప్పాలని ఈ సందర్భంగా కెటిఆర్ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News