Home తాజా వార్తలు అందరి చూపు హైదరాబాద్ వైపే

అందరి చూపు హైదరాబాద్ వైపే

KTR Speaks at GENome Valley Conference

 

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండటం గర్వకారణం

తొలి టీకా హైదరాబాద్ నుంచే వస్తుందని ఆశిస్తున్నా
మీ నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోంది
జినోమ్ వ్యాలీ సదస్సులో మంత్రి కెటిఆర్
వ్యాక్సిన్ల అభివృద్ధిపై ఫార్మా కంపెనీలతో కేంద్రం చర్చలు జరపాలి
వాటర్ బాటిల్ కన్నా తక్కువ ధరకే కొవిడ్ వ్యాక్సిన్ : భారత్ బయోటెక్ ఎండి కృష్ణ ఎల్లా
వైరస్ ఇమ్యూనిటీని తెలుసుకునే దశలోనే ఉన్నాం, జనసాంద్రత అధికంగా ఉన్న దేశాలు జాగ్రత్తలు పాటించాలి : డబ్లుహెచ్‌ఒ చీఫ్ సైంటిస్టు సౌమ్య
వ్యాక్సిన్ల అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నది, ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధానం రావాలి : బయోలాజికల్ ఇ లిమిటెడ్ ఎండి మహిమ దాట్ల
వ్యాక్సిన్ల అభివృద్ధిలో కంపెనీల మధ్య ఎలాంటి పోటీలేదు : ఇండియన్ ఇమ్యునోలాజికల్ ఎండి ఆనంద్

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా తరిమికొట్టే వ్యాక్సిన్ హైదరాబాద్‌లో తయారవుతోంది. భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌పై నిమ్స్ సహా దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్నా యి. ఈ క్రమంలో దేశం యావత్తు హైదరాబాద్ వైపే చూస్తోందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని జినోమ్‌వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్‌ను కెటిఆర్ మంగళవారం సందర్శించారు. మంత్రి కెటిఆర్‌తో పాటు డాక్టర్ ఎల్లా, శ్రీమతి సుచిత్రా ఎల్లా కూడా పాల్గొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ ఉద్యోగులతో మంత్రి కెటిఆర్ మాట్లాడారు.

సిఎండి డాక్టర్ కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్‌తో కలిసి మంత్రి చర్చను నిర్వహించారు. వ్యాక్సిన్ కోసం పోటీలో సైన్స్, అత్యవసరంసమతుల్యత అంశంపై నిపుణులు, అనుభవజ్ఞులతో మంత్రి కెటిఆర్ ముచ్చటించారు. షార్మా రంగంలో మూడింతల మందులు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి జరుగుతోందని కెటిఆర్ తెలిపారు. ఫార్మారంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్‌బయోటెక్ ముందంజలో ఉండటం గర్వంగా ఉందన్నారు.

కరోనాకు టీకా తొలుత హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందని మంత్రి కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధి, తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు పదే పదే చెబుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్టా హైదరాబాద్ ప్రాముఖ్యత కూడా పెరిగినట్లు మంత్రి కెటి ఆర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి మూడవ వంతు వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్నారు. మీ అందరి నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమవుతోందని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా ఉన్నారు.

వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరలోనే : కృష్ణ ఎల్లా
వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్య సాధించామని భారత్ బయోటెక్ ఎండి కృష్ణ ఎల్లా తెలిపారు. కానీ కొత్త వైరస్ కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకారం అందిస్తున్నాయని కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. ‘మేము మార్కెట్‌లో పోటీదారులం కావొచ్చు.. మా అందరి పోరాటం కరోనాను జయించడంపైనే’నని స్పష్టం చేశారు. భారత వ్యాక్సిన్ ఉత్పత్తిలో 70 శాతం వాటా మూడు హైదరాబాద్ కంపెనీలదేనన్నారు. భారతదేశ ఆవిష్కరణల్లో తెలంగాణ నాయకత్వ స్థానంలో ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కంపెనీ కంటే కూడా హైదరాబాద్ కంపెనీలు తక్కువ కాదని కృష్ణ ఎల్లా అన్నారు. ప్రభుత్వం కరోనాను ఆరోగ్యపరమైన సంక్షోభంగానే చూస్తోందన్నారు. కరోనా భారీ ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చిందని కృష్ణ ఎల్లా తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధి కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలన్నారు. వేగంగా వ్యాక్సిన్ తేవడానికి ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలని తెలిపారు. ప్రపంచంలోని ఏ వ్యాక్సిన్ కంపెనీ కంటే కూడా హైదరాబాద్ కంపెనీలు తక్కువ కాదన్న కృష్ణ ఎల్లా వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరలోనే వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు.

లక్ష్యం వ్యాక్సిన్ అందించడమే : మహిమ దాట్ల
వ్యాక్సిన్ల లక్షం కరోనా నుంచి రక్షణ కవచం అందించడమేనని బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండీ మహిమ దాట్ల అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సహజంగా కొన్ని ప్రతిజనకాలు ఏర్పడతాయని తెలిపారు. అదే శక్తిని వ్యాక్సిన్లు ఔషద రూపంలో అందిస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం కరోనా స్పైక్ ప్రోటీన్‌ను లక్షంగా చేసుకుని అనేక వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి విధానాన్ని బట్టి వాటి సామర్థాక్యలలో కొన్ని వ్యత్యాసాలున్నట్లు వివరించారు. ఏ వ్యాక్సిన్ కూడా భద్రతను పణంగా పెట్టి ప్రయోగాలు చేయదన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నెల వ్యవధిలోనే భారీ స్థాయి ఉత్పత్తికి సిద్ధమని, నెల వ్యవధిలో వందల కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురాగలమన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధి కంపెనీలు సమన్వయంతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. విధాన నిర్ణయాలు, సవాళ్లపై సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు.

నియంత్రణాపరమైన అనుమతులకు ఆరేడు నెలలు సమయం పట్టగలదన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. ప్రస్తుతం సంస్థలే సొంత ఖర్చులతో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన విధానం రావాలని బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఎండి మహిమ దాట్ల పేర్కొన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిధుల లభ్యత చాలా కీలకమైన విషయమని ఆయన గుర్తు చేశారు. ఎఫ్‌డిఎ, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చాయని చెప్పారు. భారత్ కూడా ఆ తరహా మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వాలన్నారు. దేశంలో క్లీనికల్ ట్రయల్స్ సౌకర్యాలు మెరుగుపర్చాల్సిన అసవరముందని ఆమె అభిప్రాయపడ్డారు. సెల్ కల్చర్ సాంకేతికత కొంచెం సంక్లిష్టమైందని, దానిని అందిపుచ్చుకోవడం కొంచెం కష్టమైన వ్యవహారమని వివరించారు. మిగిలిన వ్యాక్సిన్ల కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

కంపెనీల మధ్య ఎలాంటి పోటీ లేదు : ఆనంద్
వ్యాక్సిన్ల అభివృద్ధిలో కంపెనీల మధ్య ఎలాంటి పోటీ లేదని ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్ ఎండి ఆనంద్ అన్నారు. వైరస్‌ను ఎలా జయించగలమోనని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ అధిక ధరలో ఉంటే చాలా మందికి అందుబాటులో లేకుండా పోతుందని.. ఒక్క డోసు ధర రూ.వెయ్యి అయినా భారత్ లాంటి దేశాలకు అది చాలా భారమైన విషయమన్నారు. జీవితకాలం మొత్తానికి ఒకటి లేదా రెండు డోసులు ఇస్తే సరిపోతుంది. డోసు వ్యాక్సిన్ ధర సాధ్యమైనంత తక్కువకే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు కొంత సమయం పట్టొచ్చని.. సమయం పట్టినా అందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో ఏడు సంస్థలను కలిపి ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. డిబిటి, సిఎస్‌ఐఆర్ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని వివిధ పరిశోధన సంస్థల మధ్య వారధిలా వ్యవహరించాలని ఆనంద్ తెలిపారు. ఇదిలావుండగా ప్రతి చిన్న అనుమతి కోసం ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందని మంత్రి కెటిఆర్ అన్నారు. అవసరమైన అనుమతులు ప్రాంతీయ కేంద్రం నుంచే ఇవ్వాలని కోరారు. అవిష్కరణలను ఆలస్యం చేయడంతో పాటు అంకుర సంస్థలకు ఇబ్బందిగా మారిందన్నారు.

27 వ్యాక్సిన్లకు క్లినికల్ ట్రయల్స్ : డా. సౌమ్య స్వామినాధన్
జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థలో వ్యాక్సిన్ ట్రయల్స్‌పై ఐటి శాఖ మంత్రి కెటిఆర్ నిర్వహించిన చర్చలో డబ్లూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాధన్ పాల్గొన్నారు. ఇంకెన్నాళ్లు ఇలా వైరస్‌తో కలిసి జీవించాల్సి ఉంటుందని మంత్రి కెటిఆర్ వేసిన ప్రశ్నకు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ సమాధానం ఇచ్చారు. దేశీయంగా, ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌పై చర్చ భిన్న స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. వైరస్ ఇమ్యూనిటీ గురించి ఇంకా తెలుసుకునే దశలోనే ఉన్నామన్నారు. ఎవరికి వైరస్ ఎక్కువగా సంక్రమిస్తుంది, ఎవరికి సంక్రమించడం లేదో మందు తెలుసుకోవాలన్నారు. పిల్లల్లో ఎందుకు వైరస్ కేసులు తక్కువగా ఉన్నాయో గమనించాలన్నారు. వైరస్ సోకిన వ్యక్తిని ఐసోలేట్ చేయాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని, క్వారంటైన్ కావాలన్నారు. అధిక సాంద్రత జనాభా ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సౌమ్య తెలిపారు. గ్రామాల్లో వైరస్ కేసుల గుర్తింపు బాగానే ఉన్నదని, జిల్లాలను వేరు చేసి కేసులను గుర్తిస్తున్న తీరు సరళంగా ఉందన్నారు. కానీ పట్టణాలు, నగరాల్లో మాత్రం సరిగా లేదన్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.

భారత్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ టెస్టింగ్ ప్రక్రియ తక్కువ స్థాయిలో జరుగుతున్నట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో ఉన్న తీరును కూడా పరిశీలించాలన్నారు. కనీసం 8 నుంచి 10 అంశాల్లో ప్రభుత్వాలు పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను కూడా ప్రభుత్వాలు తెలియజేయాలన్నారు. మాస్క్‌లను ధరించే అంశంలోనూ ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. సరైన పద్ధతిలో మాస్క్‌లు పెట్టుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్‌ను పెట్టుకుంటే, అప్పుడు వైరస్ వ్యాప్తిని అరికట్టే ఛాన్సు ఉందని తెలిపారు. సోషల్ డిస్టెన్సింగ్ కూడా కీలకం అన్నారు. అయితే మురికివాడల్లో ఇలాంటి నియమం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని ఆమె అన్నారు. జనం గుంపులుగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్థిక వ్యవస్థను పునర్‌ప్రారంభించే దశలో జనం ఫ్యాక్టరీల వద్ద గుమికూడే ప్రమాదం ఉంటుందని, అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 27 వ్యాక్సిన్లకు క్లీనికల్ ట్రయల్స్ జరుగుతున్న డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అయితే ట్రయల్స్ జరుగుతున్న టీకాల సామర్థం, భద్రత మరికొన్ని నెలల్లో తెలిసిపోతుందన్నారు. టీకాల విషయంలో సేఫ్టీ చాలా ముఖ్యం అన్నారు. ప్రజల విశ్వాసాన్ని గెలవడంలో అది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. టీకా సామర్థం ఎంత వరకు ఉంటుందో స్టడీ చేయాలన్నారు. కనీసం 70 శాతం ప్రభావాన్ని టీకా చూపిస్తుందా లేదా గమనించాలన్నారు. గరిష్టంగా 70 శాతం, కనిష్టంగా 50 శాతం వ్యాక్సిన్ ఎఫికసీ ఉండాలని ఆమె అన్నారు. అంటే 50 శాతం కన్నా తక్కువ సామర్థం ఉంటే ఆ వ్యాక్సిన్ వాడడం అంత మంచిది కాదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ సామర్థంపై డబ్లూహెచ్‌వో కొన్ని విధానాలను రూపొందించిందని, 50 శాతం కన్నా తక్కువ సామర్థం ఉంటే అప్పుడు అది ప్రజల ఆరోగ్యాన్ని మార్చలేదన్నారు. హెచ్1ఎన్1 మహమ్మారి సమయంలో ఏర్పడిన టీకా ప్రతిష్టంభన ఇప్పుడు ఏర్పడకుండా చూడాలన్నారు. అప్పుడు సంపన్నదేశాలన్నీ వ్యాక్సిన్ కొనుగోలు చేసి వాటిని ఆ తర్వాత పేద దేశాలకు ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

KTR Speaks at GENome Valley Conference