Home తాజా వార్తలు మున్సిపోల్స్‌లో జెడ్‌పి ఫలితాలే

మున్సిపోల్స్‌లో జెడ్‌పి ఫలితాలే

KTR

n అవినీతి చీడనుంచి ప్రజలను రక్షించాలి
n మున్సిపాలిటీ చట్టంపై త్వరలో శిక్షణాతరగతులు
n చట్టాన్ని రూపొందించడంతో పాటు పటిష్టంగా అమలు
n జాతీయ స్థాయి అధ్యక్షుడు లేని కాంగ్రెస్
n జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది
n గవర్నర్ల మార్పుపై ప్రభుత్వానికి సమాచారం లేదు
n టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: అవినీతి చీడ నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం నూతన చట్టాలను రూపొందిస్తోందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మున్సిపాలిటీ చట్టం మాదిగానే త్వరలో రెవెన్యూ చట్టం రానుందని కెటిఆర్ ప్రకటించారు. రూపొందించిన చట్టాలు ఫలితాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలను పటిష్టంగా అమలుచేసి ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలనే లక్షంతోనే సిఎం కెసిఆర్ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అనుకున్నది సాధించేంతవరకు శ్రమిస్తారని చెప్పారు. శుక్రవారం టిఆర్‌ఎస్ శాసన సభాపక్షం కార్యాలయంలో కెటిఆర్ కొద్దిసేపు మీడియాతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడారు. కొత్తగా వచ్చిన మున్నిపాలిటీ చట్టంపై ప్రజలకు నాయకులకు ఆవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు రూపొందించనున్నట్లు చెప్పారు. కొత్తచట్టం మేరకు ఉద్యోగులు ఒకే చోట పాతుకు పోయేందుకు అవకాశం ఉండదనీ ఈచట్టం జిహెచ్‌ఎంసికి కూడా వర్తిస్తోందన్నారు.
రాజకీయ జోక్యం తగ్గుతుంది
శాసనసభ అమోదించిన మున్సిపాలిటీ చట్టం అవినీతిని తరిమివేసి ప్రజలకు మేలుచేసేవిధంగా ఉందని చెప్పారు. రాజకీయ జోక్యం తగ్గి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందుతాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చట్టాలు అమలు కావాలంటే ప్రధానంగా పాలకులకు చిత్తశుద్ధి అవసరం, ప్రజలకు సేవచేయాలనే ధృడమైన లక్షం అవసరం. ఈమేరకు నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేకస్టేలు ఇచ్చి ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాను. ప్రధానంగా చిత్తశుద్ధితో రూపొందించి అమలుచేసిన టిఎస్ ఐపాస్ చట్టం విజయవంతం అయినట్టుగానే మున్సిపాలిటీ చట్టన్ని కూడా అమలుచేసి ఫలితాలు సాధిస్తామని కెటిఆర్ చెప్పారు.
పోటీ చేసేవారి అవగాహన కలుగుతుంది
త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోటీచేసే అభ్యర్థులకు చట్టం కూడా అవగాహన కలుగుతుంది. మంచిపాలనా సంస్కరణల ద్వారా ప్రజాప్రతినిధులకు సమాజంలో గౌరవం పెరుగుతుందని చెప్పారు. నియోజకవర్గాల శాసనసభ్యులకు ఈచట్టం ద్వారా మరింత గౌరవం ఇనుమడిస్తోందనే ఆశాభావాన్ని కెటిఆర్ వ్యక్తం చేశారు. మంచి లక్షసాధనకోసం, ప్రజలకు పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించేందుకు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ చట్టం తేవడంతోనే బాధ్యత పూర్తి కాలేదు. రూపొందించిన చట్టాన్ని పటిష్టంగా అమలుచేసి ప్రజలకు ఫలాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కెటిఆర్ చెప్పారు. పాలనాసంస్కరణలు ప్రభుత్వానికి మంచిపేరుతెస్తాయనే నమ్మకం ఉందన్నారు. నోటీసులు ఇవ్వకుండా అక్రమ కట్టడాలను కూల్చివేసే అధికారాలు చట్టపరిధిలో ఉన్నాయని ఆయన అక్రమార్కులను హెచ్చరించారు. అలాగే ప్రజలకు సెల్ఫ్ అస్సెస్మెంట్ అధికారం ఇవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు.
చట్టంపై అవగాహనకోసం శిక్షణా తరగతులు
ప్రభుత్వం పాలనావ్యవస్థను పటిష్టంచేస్తూ మున్సిపాలిటీల పరిధిలో పారదర్శకమైన పౌరసేవలు అందించేందుకు రూపొందించిన ఈచట్టంపై ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులను ప్రభుత్వం నిర్వహించ నుందన్నారు. ఈ మేరకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారన్నారు. ప్రధానంగా అవనీతిని పారద్రోలేందుకు కొత్తచట్టం ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం చిన్న ఇల్లుకట్టుకోవాలన్నా అనేక అనుమతులకోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చట్టం అమలుతో మున్సిపాలిటీల పరిధుల్లో 75 గజాల్లోపు ఇళ్లనిర్మాణానికి అనుమతి అవసరం లేదన్నారు. ఈ అంశాన్ని శాసన సభ్యులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని కెటిఆర్ చెప్పారు.
జిల్లాకలెక్టర్లకు పనిభారం పెరగదు
నూతన మున్సిపాలిటీ చట్టం అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లకు పనిభారం పెరగదన్నారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో జిల్లాల్లో మున్సిపాలిటీలు తగ్గాయనీ, ప్రతి జిల్లాకు మూడు నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు పనిభారం పెరుగుతుందని నేను అనుకోవడం లేదన్నారు. చట్టం అమలుతో కలెక్టర్లకు కూడా ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఫలితాలు అందించేందుకు అధికార యంత్రాగానికి కూడా మంచి అవకాశమన్నారు.
ఉద్యమంలా సభ్యత్వం నమోదు
టిఆర్‌ఎస్ సభ్యత్వనమోదు ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. నియోజకవర్గాల వారిగా 50 వేలు లక్షం ఇవ్వగా లక్ష్యాన్ని ఇప్పటికే అనేక నియోజకవర్గాలు చేధించాయని కెటిఆర్ తెలిపారు. గతంలో టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు 43 లక్షలు ఉందనీ ప్రస్తుతం ఇప్పటికే 35 లక్షలు దాటిందని కెటిఆర్ వివరించారు. ప్రజల్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌పై ఉన్న భరోసా, సాధిస్తున్న అభివృద్ధి పై విశ్వాసం ఉండటంతో సభ్యత్వనమోదు వేగంగా సాగుతుందన్నారు. బిజెపి విధానాలను కెటిఆర్ తప్పుబట్టారు. నాలుగు ఎంపి సీట్లు గెలవాగానే ఏదోసాధించామని ఆగడం లేదన్నారు. ఆతర్వాత జరిగిన జెడ్‌పిటిసి ఎన్నికల్లో బిజెపి కనుమరుగైందన్నారు. అలాగే కాంగ్రెస్ పై ప్రజలకు, ఆపార్టీ నాయకులకు విశ్వాసం లేదని విమర్శించారు.

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో జెడ్‌పి ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ధీమావ్యక్తం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం బిజెపి, కాంగ్రెస్ ఎక్కడ ఉంటుం దో, వాటి స్థానమేమిటో ఆపార్టీలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది ఆపార్టీకి జాతీయ స్థాయిలో అధ్యక్షుడే లేరని విమర్శించారు. ఏపి అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు, కర్ణాటక రాజకీయాలపై మాకు అసక్తి లేదన్నారు. కొత్తసచివాలయం, అసెంబ్లీ భవనాల కేసు కోర్టు పరిధిలో ఉం డగా నేను స్పందించడం సజావుగా ఉండదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. కోర్టు తీర్పును గౌరవించడం తప్పనిసరి అన్నారు. అయితే తీర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఉందన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కార బాధ్యత నాది
శాసనసభ్యులు, జర్నలిస్టుల ఇళ్లస్థలాల కేసు సుప్రీంకోర్టులో ఉందని ఆయన గుర్తు చేస్తూ దీనికి సంబంధించిన పరిష్కారం వారం రోజుల్లో కనుగొనాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారని కెటిఆర్ చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. త్వరలోనే జర్నలిస్టుల ప్రతినిధులతో సమావేశమై పరిష్కారమార్గాలను అన్వేషిస్తాన్నారు. ఇదిలా ఉండగా గవర్నర్ మార్పుపై ప్రభుత్వానికి సమాచారం లేదని చెప్పారు. గవర్నర్ వ్యవస్థల్లో తల దూర్చడం సరికాదన్నారు.

ktr speech about municipal elections 2019 in telangana