Home తాజా వార్తలు ‘భారత భాగ్య’నగరం

‘భారత భాగ్య’నగరం

ప్రపంచానికే టీకాల రాజధాని హైదరాబాద్

ప్రపంచం మొత్తంలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలోనే తయారువుతున్నాయి
సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాలు పార్కును నిర్మిస్తున్నాం
జీనోమ్ వ్యాలీలో బయో, ఫార్మాహబ్ ఏర్పాటు చేస్తాం
దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి దేశానికే గర్వకారణం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ దేశాలకు టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. వ్యాక్సిన్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి పలు దేశాలు అబ్బుర పోతున్నాయన్నారు. దీంతో భారతదేశాకే భాగ్యనగరం మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. ఈ ఘనతను సాధించడం వెనుక ఫార్మా కంపెనీల కృషి అభినందనీయమన్నారు. ఆ కంపెనీలకు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తోందన్నారు. దీని కారణంగానే ఫార్మాలో దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. ఫలితంగా రాష్ట్రం లో పెద్దఎత్తున పెట్టుబడులు కూడా వస్తున్నాయని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా-2021 సదస్సును బేగంపేట ఐటిసి కాకతీయ హోటల్‌లో మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి జయేష్ రంజన్, ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు. రెం డు రోజుల పాటు వర్చువల్ విధానంలో జరగనున్న ఈ సదస్సులో ప్రపంచం నలు మూలల నుంచి 30వేల మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్, సైన్సెస్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని గజగజ లాడించిన కరోనాను కట్టడికి వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు ఎన్నో దేశాలు నిర్విరామంగా కృషి చేశాయన్నారు. అందులో హైదరాబాద్ మాత్రమే అద్భుతమైన విజయం సాధించిందన్నారు. భారత్ బయోటెక్ సంస్థ సమర్థవంతమైన కొవాగ్జిన్ టీకా తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. ఇది హైదరాబాద్‌లో ఫార్మా కంపెనీలు పెద్దఎత్తున విస్తరిస్తున్నాయని పేర్కొనేందుకు చక్కటి నిదర్శమన్నారు.
ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో విస్తరిస్తున్నాయని తెలిపారు. దీనికి జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారుతోందన్నారు. ప్రతి ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లు హైదరాబాద్ బయో టెక్ కంపెనీలు తయారు చేస్తున్నాయన్నారు. అలాగే ప్రపంచం మొత్తంలో వాక్సిన్‌లలో మూడవ వంతు వ్యాక్సిన్లు నగరంలోని జీనోమ్ వ్యాలీలోని తయారవుతున్నాయని ఆయన తెలిపారు. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నందునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇక్కడ పర్యటించి వ్యాక్సిన్ తయారీదారులతో చర్చించారని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. దీంతో పాటు 80 దేశాలకు చెందిన రాయబారులు సైతం జీనోమ్ వ్యాలీని సందర్శించి కోవిడ్…19కు సంబంధించి వ్యాక్సిన్ తయారీ పైన వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు.
దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లాబరేటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా టెస్టింగ్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని తాము కేంద్రాన్ని కోరామన్నారు.
జీనోమ్ వ్యాలీ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ప్రయోగాలను, పరిశోధనను పెంచే ఉద్దేశంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయో మెడికల్ రీసెర్చ్ సంస్థను కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంస్థకు కావాల్సిన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందించి దాని ఏర్పాటులో చొరవ తీసుకుందన్నారు. కాగా సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని వివరించారు. హైదరాబాద్‌లో ఫార్మా సెక్టార్ బలోపేతానికి మరింతగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్.. వి-హబ్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్లా, సంయుక్త ఎండి సుచిత్ర ఎల్లాకు జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ఆయన ప్రధానం చేశారు.

హైదరాబాద్ నుంచే 65 శాతం వ్యాక్సిన్లు:కృష్ణఎల్ల
జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందిన భారత్ బయోటెక్ సిఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ, ఈ పురస్కారం తన ఒక్కరిది కాదన్నారు. ఇది ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్‌కు దక్కినట్లు భావిస్తున్నానని తెలిపారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్ నుంచే టీకాలు రావాలని అన్నారు. ప్రస్తుతం 65 శాతం వ్యాక్సిన్‌లు భాగ్యనగరం నుంచే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచంలోనే బెస్ట్ హబ్ అని ఆయన పేర్కొన్నారు.

KTR Speech at Bioasia 2021 in Hyderabad