Home తాజా వార్తలు నవంబర్‌లో టిఎస్ ఐపాస్వార్షికోత్సవాలు : కెటిఆర్

నవంబర్‌లో టిఎస్ ఐపాస్వార్షికోత్సవాలు : కెటిఆర్

KTR
మనతెలంగాణ/హైదరాబాద్ : ఐటి ఎగుమతుల్లో తెలంగాణ బెంగుళూరును మించిపోయిందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ప్రసుతం ఐటి ఎగుమతులు లక్షా9వేలకోట్లకు చేరుకున్నాయని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సిఐఐ సదరన్ రీజినల్ సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ సదరన్ ఇండస్ట్రీకారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక వేత్తలకు సూచించారు. ఐదేళ్లలో ఐటి రంగం అభివృద్ధిలో బెంగుళూరును మించిపోయిందన్నారు. వేలాధి ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పారు. ఐదేళ్లలో సాధించినప్రగతికి నిదర్శనంగా అనేక అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలకు హైదరాబాద్ వేదికైందని తెలిపారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు రెండువేల ఎకరాలస్థలాన్ని ప్రభుత్వం సిద్ధంచేసిందని ప్రకటించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పించడంతో ప్రపంచదేశాలు హైదరాబాద్‌లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కు అని ఆయన ప్రకటించారు.

టెక్స్‌టైల్ పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్నాయన్నారు. ప్రపంచదేశాలను ఆకట్టుకున్న టిఎస్‌ఐపాస్ 5వ వార్శికోత్సవాలను నవంబర్‌లో అత్యంతవైభవంగా నిర్వహించనున్నట్లు కెటిఆర్ ప్రకటించారు.అలాగే తెలంగాణ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకసంస్థలు ముందుకు వస్తున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. డ్రైఫ్రూట్స్ ఎగుమతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. అలాగే ఆహార తయారీ పరిశ్రమల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ నిర్మాణపనులు వేగవంతం అయ్యాయన్నారు. భవిష్యత్‌లో అతిపెద్ద ఫార్మసిటీ తెలంగాణలో ఆవిర్భవించనుందన్నారు. పారిశ్రామికవేత్తలు, సిఐఐ ప్రతినిధులు తెలంగాణ పారిశ్రామిక రంగాభివృద్ధికి సలహాలు, సూచనలు, మద్దతు ఇవ్వాలని కెటిఆర్ కోరారు.

KTR Speech At CII Southern Regional Council Meeting