Home తాజా వార్తలు వాళ్ల గుండెల్లో ఇంకా కెసిఆరే…

వాళ్ల గుండెల్లో ఇంకా కెసిఆరే…

KTR

మన తెలంగాణ/హైదరాబాద్: నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని విస్మరించిందని, నీతి ఆయోగ్ బృందం తెలంగాణలో పర్యటించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు రూ.24 వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని సిఫారసు చేసినా 24 పైసలు కూడా ఇవ్వలేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. భువనగిరిలో గురువారం జరిగిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో కెటిఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో యావత్తు దేశం స్ఫూర్తిగా తీసుకునే సంక్షేమ పథకాలు అమలవుతున్నా కేంద్రం మాత్రం సహాయం చేయడంలేదని ఆరోపించారు. ఎడారిగా మారిన తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వని మోడి ప్రభుత్వం పుష్కలంగా నీరున్న ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి రూ.80 వేల కోట్ల సహాయం అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరి మంత్రివర్గ సమావేశంలో ప్రకటించిన 50 కొత్త కేంద్రీయ విద్యాలయాల్లో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వకుండా మరోసారి వివక్ష చూపారని ఆరోపించారు.
భువనగిరిలో ఫార్మా సిటీ ఏర్పాటు
భువనగిరి పార్లమెంట్ నియోజక పరిధిలో అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులు రాబోతున్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి ఫార్మా సిటీ క్లస్టర్ ఏర్పాటవుతోందన్నారు. జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కొత్త పరిశ్రమలు చాలా రాబోతున్నాయని, ఆలేరు పరిధిలోని దాతరపల్లిలో ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. రాయగిరి వరకు ఎంఎంటిఎస్ విస్తరించే రైలుమార్గం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. ఎస్‌అర్‌ఎస్‌పి ద్వారా గోదావరిజలాలు తుంగతుర్తిలో పరవళ్లు తొక్కడంతో పాటు రుద్రమ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధమవుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ నాయకులు ప్లోరోసిస్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో సుమారు 2 లక్షల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారని, వారి శాపాలు కాంగ్రెస్‌కు తగిలాయన్నారు. యాదాద్రి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ భక్తుడిలా, స్తపతిలా ఆలోచిస్తున్నారన్నారు. యాదాద్రి ఆలయం ఉన్నంతకాలం ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్ర ఉంటుందన్నారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి
ప్రజాజీవితంలో ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే పురోగతి ఉంటుందని, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలో రెండు నియోజకవర్గాలను కోల్పోవడానికి అనేక కారణాలున్నాయన్నారు. ఆ కారణాలను విశ్లేషించుకుని ఎన్నికల ప్రచారంలోకి వెళ్లాలని చెప్పారు. నకిరేకల్‌లో ట్రక్కుతో ఓడిపోయినా అత్మవిమర్శ చేసుకోవాలన్నారు. మునుగోడులో వెనకబడటానికి కారణాలను తెలుసుకోవాలన్నారు. తుంగతుర్తి, ఇబ్రహింపట్నంలో స్వల్ప మెజారిటీతో గెలిచామని, భువనగిరిలో 25 వేల మెజారిటీ సాధించామని, ఆలేరులో కూడా ఆశించిన మెజారిటీ రాలేదని కెటిఆర్ వ్యాఖ్యానించారు. జనగామలో మెజారిటీ పెంచుకోవాల్సి ఉండిందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు జగదీష్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు గొంగిడి సునీత, గాదరి కిశోర్, ఎంఎల్‌సిలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొనారు.
నగరిలో పోటీ చేసినా కెసిఆర్ గెలుస్తారు : జగదీష్ రెడ్డి
కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శం అవుతూ కొత్త పుంతలు తొక్కుతోందని మంత్రి జగదీష్‌రెడ్డి సన్నాహక సమావేశంలో చెప్పారు. కెసిఆర్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని, పథకాలు దేశప్రజలను ఆకర్షితులను చేస్తున్నాయన్నారు. కెసిఆర్ చిత్తూరు జిల్లా నగరిలో పోటీచేసినా గెలుస్తారని మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 100కు పైగా దేశాల్లో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరిస్తున్నారంటే కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాల అమలు ఫలమేనన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఇంకా సాధించాల్సినవి అనేకం ఉన్నాయని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. పార్లమెంట్ సభ్యుడిగా వేయి కోట్ల రూపాయల ఎయిమ్స్‌ను సాధించడంతో పాటు జాతీయ రహదారులను సాధించినట్లు గుర్తుచేశారు,
అడుగడుగునా కెటిఆర్‌కు ఘన స్వాగతం
ఆలేరు నుంచి భువనగిరి వరకు కెటిఆర్‌కు ఘన స్వాగతం ఏర్పాటు చేశారు. దారి పొడవునా పార్టీ శ్రేణులు, అభిమానులు స్వాగతాలు ఏర్పాటు చేయడంతో పాటు కెటిఆర్ వెళ్తుంటే రహదారుల్లో పూలు చల్లారు. ఆలేరులో శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి స్వాగతం పలిగి సుమారు 2 వేల వాహన శ్రేణితో సభాస్థలికి తీసుకు వచ్చారు.

KTR speech at TRS public meeting in Bhuvanagiri