Home తాజా వార్తలు తెలంగాణ దేశానికి దిక్సూచీగా మారింది:కెటిఆర్

తెలంగాణ దేశానికి దిక్సూచీగా మారింది:కెటిఆర్

KTR Election Campaign

 

ఎంపి ఎన్నికల తరువాత కేంద్రంలో టిఆర్‌ఎస్ క్రియాశీల పోషిస్తొంది
కూకట్‌పల్లి విజయోత్సవ సభలో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్

కెపిహెచ్‌బి కాలనీ: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దేశానికి దిక్సూచీగా నిలుస్తొందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షులు కె. తారకరామారావు అన్నారు. ఆదివారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఎంఎల్ఎ మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో స్థానిక మెట్రో గ్రౌండ్ వద్ద నిర్వహించిన విజయోత్సవ సభకు కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ లో చేపట్టిన పథకాలు నేడు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రైతు బందు లాంటి పథకాన్ని కేంద్రం అధ్యయనం చేస్తుందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలను 11 రాష్ట్రాల ప్రభుత్వాలు అధ్యయనం చేస్తున్నాయని గుర్తు చేశారు. టిఎస్‌ఐపాస్‌లాంటి కార్యక్రమాలు, పాలన సంస్కరణలు ఇతర రాష్ట్రాలు చూసి నేర్చుకుంటున్నాయని కేటీఆర్ అన్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు, ప్రాజక్టులు రావాలంటే టీఆర్‌ఎస్‌పార్టీ కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకోసం త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ప్రొ.జయశంకర్ సార్ అన్నట్లు యాచించి కాదు శాసించి తెచ్చుకోవాలన్నదే టీఆర్‌ఎస్ పార్టీ విధానం, అందుకోసం మన నాయకుడు కేసీఆర్ దేశంలో ఫెడరల్ ప్రంట్ పేరుతో దేశ ప్రజలను చైతన్యం చేసే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభ క్రమంగా తగ్గతుందని, ఆపార్టీకి 150రి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు, రాహూల్‌గాంధీనాయకత్వంలో ఏర్పడిన యుపీఏ కూటమికి 100 సీట్లు దాటే పరిస్థితి లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంటే కేంద్రంలో క్రియాశీలకం అయ్యే పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ వివరించారు.
జాబితాల్లో గల్లంతైన వారి ఓటును నమోదు చేయించాలి
గత ఎన్నికల్లో ఓటు వేసి కేసీఆర్‌ను ఆశీర్వదించాలని భావించి లక్షలాది మంది ఓటు వేయలేక పోయారని కేటీఆర్ ఆవేధన వ్యక్తం చేశారు. ఓట్ల గల్లంతు లేక పోతే అభ్యర్ధుల మెజార్టీ రెట్టింపు అయ్యేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కారాదని, అందుకోసం డివిజన్ల వారీగా, బూతుల వారీగా నాయకులు, కార్యకర్తలు గల్లంతైన వారి ఓటర్లు గుర్తించి వారిచేత నమోదు చేయించాలని కోరారు. ఎన్నికల కమీషన్ ఈనెల 26 నుంచి జనవరి 24వరకు ఓటర్ల నమోదు అవకాశం కల్పించినందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్ల నమోదు చేయించే బాధ్యతను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీసుకుని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్ధికి కూకట్‌పల్లి నుంచి 70వేలకుపైగా మెజార్టీ ఇప్పించాలని సూచించారు.
పార్టీకి దూరమైన వర్గాలను దగ్గరకు తీసుకోండి
‘గెలుపులో పాఠాలు ఉంటాయి. ఓటమిలో గుణపాఠాలుంటాయి. 2016లో కార్పొరేటర్లకు ఎన్ని ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో బేరీజు వేసుకుని పార్టీ కీ దూరంగా ఉన్న వర్గాలేమిటో , వారి సమస్యలేమిటో తెలుసుకోవాలని కేటీఆర్ సూచించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకోవడానికి ప్రణాళిక బద్దమైన వ్యూహాలను రచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గెలుపును ఆస్వాదిస్తూనే అహంకారపూరితంగా పోకుండా దూరమైన వర్గాలను ఏ విధంగా దగ్గరకు తీసుకోవాలి, గత శాసన సభ ఎన్నికల్లో వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నాయకులను,కార్యకర్తలను, వర్గాలను కలుపుకుపోతూ ముందుకు సాగాలని సూచించారు.
ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చే బాధ్యత నాది
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని, అందుకు తానే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ ఈ విషయం ప్రజలకు తెలుసని, ఈ ఎన్నికల్లో ఎవరెన్ని మాయమాటలు చెప్పినా వినకుండా టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఆసరా పించన్లను డబుల్ చేయడం, నిరుద్యోగ బృతి, డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు వంటి పథకాలను అమలు చేస్తామని, ఎన్నికల సందర్భంగా డివిజన్ల వారీగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే బాధ్యత తనదేనని కేటీఆర్ అన్నారు.
పార్టీకోసం పనిచేసే కార్యకర్తలందరికి న్యాయం చేస్తాం
పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అంకిత భావంతోపనిచేస్తున్న ఉధ్యమకారులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తామని మంత్రికేటీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని, వారికి తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని తెలిపారు.
తనకు ప్రత్యేకంగా ఏది అవసరం లేదు… నియోజకవర్గం అభివృద్ధికి నిధులిప్పించాలి
తనకు వేరే కోరికలు ఏమిలేవని, నియోజకవర్గంలోని పేద ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీలునెరవేర్చడానికి ఆశీర్వదించాలని కూకట్‌పల్లి ఎంఎల్ఎ మాధవరం కృష్ణారావు కేటీఆర్‌ను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో గత నాలుగేళ్ల కాలంలో కరెంట్, మంచినీటి సమస్య పరిష్కారమయ్యాయని చెప్పారు. 9వ రిజర్వాయర్లు, పైప్‌లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.ఇంకా 10 కిలోమీటర్ల పైప్‌లైన్, జంక్షన్‌ల ఇంప్రూమెంట్ పెండింగ్‌లో ఉందని వాటికి నిధులు ఇప్పించాలని కోరారు.అదేవిధంగా బాలానగర్‌లో ఖాళీగా ఉన్న 45 ఎకరాల టిఎస్‌ఐఐసీ స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి, హైస్కూల్‌తోపాటు డబుల్‌బెడ్‌రూం ఇళ్ళ నిర్మాణానికి ఇప్పించాలని కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఖైత్లాపూర్ వద్ద చేపట్టనున్న ప్లై ఓవర్ బ్రిడ్జీ అండర్ పాస్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని కోరారు. కేపీహెచ్‌బికాలనీలో స్థలం అందుబాటులో ఉందని, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేయించాలని కృష్ణారావు కేటీఆర్‌ను విన్నవించారు.
ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, సుదీర్‌రెడ్డిలతోపాటు కార్పొరేటర్లు తూము శ్రావణ్, కాండూరి ఆచార్య, జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేష్‌గౌడ్, ముద్దం నర్సింహ్మాయాదవ్, తరుణీనాయి, సబియాగౌసుద్దీన్, పండాల సతీష్‌గౌడ్,బోయిన్‌పల్లి మార్కెట్‌కమిటీ చైర్మన్ నరేందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు ,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.