Home తాజా వార్తలు యురేనియం తవ్వొద్దు

యురేనియం తవ్వొద్దు

KTR

నల్లమలతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ తవ్వకాలు చేపట్టవద్దు

నిర్ణయాలను ఉపసంహరించుకోవాలి, కేంద్రాన్ని కోరుతూ శాసనసభ తీర్మానం

తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ ప్రవేశపెట్టిన మంత్రి కెటిఆర్

జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం, తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదముంది. మానవాళితో పాటు సమస్త ప్రాణికోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశాలు దండిగా ఉన్నాయి. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల పంట భూములు, పీల్చే గాలి, తాగే నీరు కలుషితం అయి మనిషి జీవితం నరక ప్రాయమవుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని యావన్మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కూడా ప్రజల భయాందోళనతో ఏకీభవిస్తున్నది. యురేనియం తవ్వకాలు జరపాలనే ఆలోచనను కేంద్రం విరమించుకోవాలి.

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతేకాకుండా యురేనియం అన్వేషణ కూడా కొనసాగించరాదని తీర్మానించింది. ఐటి శాఖ మంత్రి కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో యురేనియం తవ్వకాల వ్యతిరేకిస్తూ సోమవారం సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి , జీవావరణానికి , ప్రకృతి రమణీయతకు నెలవైన సువిశాల నల్లమల అడవులతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాంతాలోనూ యురేనియం నిక్షేపాలను వెలికి తీయడం కోసం తవ్వకాలు జరపాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నల్లమలలో పెద్దపులులు, చిరుతపులులు, చుక్క జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు , నీళాయితో సహా అనేక జాతులకు చెందిన జంతుజాలం ఈ నల్లమల అడవిని ఆధారంగా చేసుకునే మనుగడ సాగిస్తున్నాయన్నారు. అరుదైన ఔషధ మొక్కలతో పాటు లక్షలాది రకాల వృక్షజాలం ఆ అడవిలో ఉందన్నారు. అనాదిగా అడవినే ఆధారం చేసుకుని జీవించే చెంచులు తదితర జాతుల ప్రజలున్నారన్నారు.

ఇదే అడవిలోని ఎత్తైన కొండలు , గుట్టల ద్వారా పారే జలపాతాలే కృష్ణా నదికి పరివాహక ప్రాంతంగా ఉన్నాయన్నారు. మొత్తంగా జీవవైవిధ్యానికి నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం , తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మానవాళితో పాటు సమస్త ప్రాణకోటి మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికత వల్ల పంటలు పండే భూమి , పీల్చే గాలి , తాగే నీరు కాలుష్యం అయి మనిషి జీవితం నరక ప్రాయం అవుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో జరిపిన యురేనియం తవ్వకాల అనుభవాలు కూడా చేదుగానే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడాన్ని యావన్మంది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ కూడా ప్రజల భయాందోళనతో ఏకీభవిస్తున్నదని, నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపాలనే ఆలోచన విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
1992 నుంచి 2013 వరకు అన్వేషణ
ప్రజల్లో భయాందోళన ఉందని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని కెటిఆర్ పేర్కొన్నారు. యూరేనియం అన్వేషణకు సంబంధించి అటవీ కాని ప్రాంతంలో అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. అదే అటవీ ప్రాంతంలో చేయాల్సి వస్తే మాత్రం వైల్డ్ లైఫ్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 1992 నుంచి 2013 వరకు అన్వేషణ జరిగిన మాట వాస్తవమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏనాడు, ఏ సందర్భంలో కూడా యూరేనియం మైనింగ్‌కు అనుమతివ్వలేదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా యూరేనియం తవ్వకాలకు అనుమతివ్వమన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం జాతి ప్రయోజనాలు అని ఒత్తిడి చేసినా, సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా నిరోధించేందుకు ప్రజల మనో నిబ్బరం పెంచేందుకు ఈ చర్య ఉపకరిస్తుందన్నారు.
సంపూర్ణ మద్దతు : భట్టి
నల్లమల్ల అనే కాకుండా తెలంగాణ అంతకుండా ఇటువంటి పరిస్థితి రాకుడాదని చేసిన సూచనను అంగీకరించి తీర్మానానికి సవరణ చేసినందుకు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఎక్సోప్లోరేషన్ నుంచి వచ్చి చేస్తున్నారని చెబుతున్నారని, ఆ రకమైన చర్యలను ఆపితే మంచిదన్నారు. సిఎల్‌పి తరపున సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.
అప్పుడే ఆందోళన చేసినం : రవీందర్ కుమార్
టిఆర్‌ఎస్ సభ్యులు రవీందర్‌కుమార్ మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. 1995లో సర్పంచ్‌గా ఉన్నపుడే తమ ప్రాంతంలో యూరేనియం తవ్వకాలు, అదే విధంగా సొంత గ్రామం శేరిపల్లి దగ్గర శుద్ది కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారని గుర్తుచేశారు. అప్పుడు ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆపుదల చేసినా, కడప జిల్లాలోని పులివెందులకు మార్చినందుకు సంతోషించామన్నారు. నల్లమల్లలో యూరేనియం తవ్వకాలు వద్దు అని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లామని, సానుకూలంగా స్పందించి తీర్మానం చేసినందుకు ధన్యవాదాలు చెప్పారు.

KTR Speech On Uranium Mining in Assembly