Saturday, April 20, 2024

ఏనుగల్లులో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

వరంగల్ : రాష్ట్రంలోని ప్రజలందరికి స్వచ్ఛమైన గాలి, నీరు ఆహారం ఇవ్వడమే లక్షంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఎనుగల్లు గ్రామంలో బుధవారం మంత్రి కెటిఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ సభలో ప్రసంగించారు.. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయం, విద్య, వైద్యరంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. కెసిఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాదని కె అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లని నిర్వచనం ఇచ్చారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన గోదావరి నీటిని అందిస్తున్నామని, హరితహారంలో 240 కోట్ల మొక్కలను నాటి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నామని, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతి వాగుపై చెక్ డ్యాం కట్టించి ఎండాకాలంలో కూడా పుష్కలంగా కాలువలు, చెరువుల్లో నీళ్లు ఉరకలేస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి కెసిఆర్ చలవేనన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు జిల్లాకో మెడికల్ కళాశాలను మంజూరు చేసి కట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఉచిత స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డబ్బులు అందరూ సంపాదిస్తారు కాని మంచి పనులు చేయడం కొందరే చేస్తారని, పుట్టిన ప్రాంతం మీద మక్కువతో ప్రతిమ ఫౌండేషన్ వారు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేశారని మంత్రి గుర్తు చేశారు. ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు బోయినపల్లి శ్రీనివాసరావు, వినోద్‌కుమార్‌లను ఆయన అభినందించారు.

ముఖ్యమంత్రితో మాట్లాడి ఎనుగల్లులో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేయిస్తానని, గిరిజన పిల్లలకు గిరిజన సంక్షేమ హాస్టల్‌ను ఏర్పాటు చేస్తానని, గడ్డపారతండాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి వసతి కల్పిస్తానని హామీనిచ్చారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఎనుగల్లు గ్రామ ప్రజల ఆశీర్వాదంతోనే తాను ఈస్థాయికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఎనుగల్లుకు ఎంత సేవ చేసినా తక్కువేనన్నారు. మహిళల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, గ్రామీణ ప్రాంత మహిళలకు సరైన అవగాహన లేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు దూరమై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రతిమ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ క్యాంపును వినియోగించుకోవాలని కోరారు.

ఈకార్యక్రమంలో శాసనమండలి డిప్యూటి చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌సి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కెటిఆర్ మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు.
హెలిప్యాడ్ వద్ద మంత్రి కెటిఆర్‌కు ఘన స్వాగతం..
ఎనుగల్లు గ్రామానికి వచ్చిన మంత్రి కెటిఆర్‌కు హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనమండలి డిప్యూటి చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోయినపల్లి శ్రీనివాసరావు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తదితరులు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News