Thursday, April 18, 2024

బాబాసాహెబ్ బాటలో…

- Advertisement -
- Advertisement -

 లండన్‌లో అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి కెటిఆర్
 కెటిఆర్‌ను సత్కరించిన ది ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్, బుద్ధిష్ట్ ఆర్గనైజేషన్- యుకె ప్రతినిధులు

మనతెలంగాణ/హైదరాబాద్: బ్రిటన్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహాన్ని పోలిన నమూనాను మంత్రి కెటిఆర్ ఆ మ్యూజియం అధికారులకు బహూకరించా రు. లండన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో అంబేద్కర్ నివసించిన ఇంటిని ఆ తరువాత అంబేద్కర్ మ్యూజియంగా మార్చారు. ఆదివారం అంబేద్కర్ నివసించిన గదితో సహా మొత్తం భవనాన్ని మంత్రి కెటిఆర్ ఆసక్తిగా వీక్షించారు. ఇంకా చాలా విషయాలను మ్యూజియం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పరిపాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభినందిస్తూ.. ది ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్, బుద్ధిష్ట్ ఆర్గనైజేషన్-యూకే (ఎఫ్‌ఎబిఒ యుకె) అధ్యక్షుడు సంతోష్ దాస్, జాయింట్ సెక్రెటరీ సీ గౌతమ్ మంత్రి కెటిఆర్‌కు ఓ లేఖను అందజేశారు. “అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చేసిన కృషిని కొనసాగిస్తూ తెలంగాణలో మీరు చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాలకు అభినందనలు. హుస్సేన్‌సాగర్ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం తెలంగాణకే కాదు.. యావత్ భారత దేశానికి గర్వకారణం.

నూతన సచివాలయ సముదాయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఆయనపట్ల మీకున్న గౌరవాన్ని తెలియజేస్తున్నది” అని ఆ లేఖలో సిఎం కెసిఆర్‌ను ప్రశంసించారు. బాబా సాహెబ్ సహకారాన్ని హైలైట్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అసాధారణ ప్రయత్నాలకు ఎఫ్‌ఎబిఒ యుకె మంత్రి కెటిఆర్‌ను సత్కరించింది. ఎఫ్‌ఎబిఒ యుకె ప్రెసిడెంట్ సంతోష్ దాస్, విలియం గౌల్డ్, క్రిస్టోఫ్ జాఫ్రలాట్‌లతో కలిసి రచించిన “అంబేద్కర్ ఇన్ లండన్‌” పుస్తకం సంతకం కాపీని మంత్రి కెటిఆర్‌కు అందించారు. ప్రజాస్వామ్య,సంక్షేమ భారత నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని ఈ తరానికి తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ది ఫడరేషన్ ఆఫ్ అంబేద్క రైట్,బుద్ధిష్ట్ ఆర్గనైజేషన్- యుకె మంత్రి కెటిఆర్‌ను సత్కరించింది. ఈ సందర్భంగా అంబేద్కర్ ఇన్ లండన్ పుస్తకాన్ని మంత్రి కెటిఆర్‌కు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News