Home దునియా ఆధ్యాత్మిక వేదిక అర్ధ కుంభమేళా

ఆధ్యాత్మిక వేదిక అర్ధ కుంభమేళా

Kumbh Mela జనవరి 15 నుంచి మార్చి 4వ తేదీ వరకు అలహాబాద్ ప్రయోగరాజ్ అర్ధ కుంభమేళాకు ముస్తాబవుతోంది.

అమృత కలశం నుంచి నాలుగు బిందువులు జారి భూమి మీద నాలుగు ప్రాంతాల్లోని నదీజలాల్లో పడతాయి. ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అమృత బిందువులు కలిసిన పుణ్యవిశేషం చేత ఆ నదీజలాలు మరింత పవిత్రత, శక్తిని పొందాయి. ఇందుకు ప్రతీకగా ఆ నాలుగు ప్రాంతాల్లో నదీస్నానం ప్రధానాంశంగా కుంభమేళాలు జరగడం సంప్రదాయంగా వస్తోంది.

కుంభమేళా అనగానే సాక్షాత్తూ శివస్వరూపులైన యోగుల సంచారం, ప్రతి ఒక్కరి నోటా ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ నాదం, సశాస్త్రీయంగా జరిగే పితృకార్యక్రమాలు.. అన్నీ కలసి కన్నులముందు నిలుస్తాయి. కోట్లాది ప్రజలు పరమపావనమైన గంగానదిలో పుణ్యస్నానాలు చేసే దృశ్యం వీక్షించాలంటే కుంభమేళాకు వెళ్లాల్సిందే. ఆధ్యాత్మిక పారవశ్యం చెందాలంటే అక్కడికి చేరుకోక తప్పదు.

కుంభం అనే పదానికి కుండ లేదా కలశం అనే అర్థాలు ఉన్నాయి. భారతీయ ఖగోళశాస్త్రం ప్రకారం కుంభం ఒక రాశి. మేళా అంటే కలయిక అని అర్థం ఉంది. ఈ రెండు సమన్వయం చేస్తే కుంభరాశిలో నిర్వహించే ఉత్సవం కుంభమేళా అవుతుంది. త్రికరణ శుద్ధిగా ప్రయాగ త్రివేణీ సంగమంలో స్నానం చేసిన వారికి పది జన్మల పాపాలు నశించటంతో పాటు జనన మరణ చక్రబంధం నుంచి విముక్తి కలుగుతుంది. ప్రయోగలో సాధువులకు సేవ చేసినా యజ్ఞం చేసిన ఫలితం దక్కుతుంది.

కుంభ మేళా ఉత్సవం వెనుక పురాణగాథ ఉంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మధించిన కథ మనకు తెలిసిందే. రాక్షసుల చేతికి చిక్కిన అమృతభాండాన్ని వారినుంచి విడిపించేందుకు మహావిష్ణువు మోహినీ అవతారాన్ని ధరించాడు. తన మాయావిలాసంలో అమృతకలశాన్ని చేజిక్కించుకుని దేవతలకు పంచి పెట్టేస్తాడు. ఈ క్రమంలో విష్ణువు చేతిలో ఉన్న అమృత కలశం నుంచి నాలుగు బిందువులు జారి భూమి మీద నాలుగు ప్రాంతాల్లోని నదీజలాల్లో పడతాయి. ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగ (అలహాబాద్), హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. అమృత బిందువులు కలిసిన పుణ్యవిశేషం చేత ఆ నదీజలాలు మరింత పవిత్రత, శక్తిని పొందాయి. ఇందుకు ప్రతీకగా ఆ నాలుగు ప్రాంతాల్లో నదీస్నానం ప్రధానాంశంగా కుంభమేళాలు జరగడం సంప్రదాయంగా వస్తోంది.

Kumbh Melaఎపుడెప్పుడు జరుగుతాయంటే….:

ప్రతి మూడేళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. మొదటి ప్రాంతంలో కుంభమేళా జరిగిన తర్వాత పన్నెండేళ్లకు తిరిగి ఆ ప్రాంతంలో కుంభమేళా జరుగుతుంది. ఆరేళ్లకోసారి జరిగే ఉత్సవాన్ని అర్ధకుంభమేళా అని, పన్నెండేళ్లకోసారి జరిగే ఉత్సవాన్ని పూర్ణకుంభమేళా అని, 144 సంవత్సరాలకు జరిగే ఉత్సవాన్ని మహాకుంభమేళా అని అంటారు. సూర్యుడు, బృహస్పతి గ్రహాల సంచార స్థానాల ఆధారంగా కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. సూర్య, బృహస్పతులు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోనూ, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో; బృహస్పతి వృషభరాశిలో, సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు అలహాబాద్‌లోని ప్రయాగలోనూ; బృహస్పతి, సూర్యుడు వృశ్చికరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని కుంభమేళాలు జరుగుతాయి. క్రీ.శ. 629 ప్రాంతంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హ్యూమన్‌త్సాంగ్ తన రచనల్లో కుంభమేళా ప్రస్తావన చేశాడు. దీన్ని బట్టి అత్యంత ప్రాచీనకాలం నుంచే కుంభమేళాలు మనదేశంలో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రుద్రాంశ సంభూతులుగా..:

మకర సంక్రమణం నుంచి మహాశివరాత్రి దాకా మొత్తం 55 రోజుల పాటు కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. కుంభమేళాలో మొదటి రోజు చాలా ప్రత్యేకమైన రోజు. వేల సంఖ్యలో సాధువులు ఈ రోజున ప్రత్యక్షమవుతారు, ఏడాదంతా వీరు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తుంటారో ఎవరికీ తెలియదు. జడలు కట్టిన శిరోజాలతో ఒళ్లంతా విబూది పూసుకుని, దిగంబరులుగా ఉంటారు. ఖడ్గం, త్రిశూలం, గద వంటి ఆయుధాలు ధరిస్తారు. కుంభమేళాలో మొదటగా వారు స్నానాలు చేస్తారు. వారు నడిచే దారిని పూర్తిగా పూలు, రంగవల్లులతో అలంకరిస్తారు. పరమశివుడి ప్రమథగణంలా కనిపించే ఈ సాధువుల్ని సాక్షాత్తు రుద్రాంశ సంభూతులుగా భావిస్తారు. వారు నడిచిన దారిలో ఉండే ధూళిని తీసుకుని భక్తులు శిరస్సున ధరిస్తారు.

ఎలా చేరుకోవాలంటే…:

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరంలో త్రివేణీ సంగమం ఉంది. ఇక్కడ గంగ, యమున,సరస్వతీ నదులు కలుస్తాయి. పురాణకాలంలో ఈ నగరాన్ని ప్రయాగ అని పిలిచేవారు. అలహాబాద్‌లోని త్రివేణీ సంగమంలో 2007లో అర్ధకుంభమేళా జరిగింది. 2013లో పూర్ణకుంభ మేళా జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం అర్ధకుంభమేళా జరగనుంది.2025లో పూర్ణ కుంభమేళాకు ప్రయోగ్‌రాజ్ వేదిక కానుంది. ప్రయాగ చేరుకోవడానికి అన్ని రకాల రవాణా సౌకర్యాలున్నాయి. కుంభమేళాను దర్శించాలనుకునేవారు వసతి గదులను WWW. KUMBH.GOV.IN ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు.

Kumbh Mela 2019