Home తాజా వార్తలు కాంగ్రెస్‌కు కూన రాజీనామా

కాంగ్రెస్‌కు కూన రాజీనామా

Kuna Srisailam Goud says good bye to Congress

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. మరో సీనియర్ నాయకుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడడంతో రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఇలాంటి తరుణంలో తాజాగా మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడు కూనశ్రీశైలం గౌడ్ పార్టీని వీడారు. ఆదివారం ఉదయం ఆయన తన రాజీనామా లేఖను టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు కూన వెల్లడించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్ని రోజులుగా పిసిసి పనితీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్న కూన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో సంప్రదింపులు జరిపారు. బండి నుంచి పార్టీ పరంగా ఆయనకు తగు ప్రాధాన్యత నిస్తామని స్పష్టమైన హామి వచ్చిన నేపథ్యంలో కూన కాంగ్రెస్‌కు రాంరాం చెప్పారు.

పార్టీని వీడొద్దని ఆయనను బుజ్జగించేందుకు పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. గడిచిన ఎన్నికల్లో కూడా కుత్బుల్లాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేసి ప్రత్యర్ధులకు గట్టిపోటీ ఇచ్చారు. ఇప్పటికే శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భిక్షపతి యాదవ్ కుటుంబం కూడా ఇప్పటికే బిజెపికి గూటికి చేరింది. తాజాగా కూన శ్రీశైలం గౌడ్ కూడా పార్టీ వీడడంతో ఆ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలమేనని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇచ్చేందుకు సీనియర్ నేతలు పాదయాత్రలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలు చేపట్టారు. త్వరలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమౌతున్నారు. త్వరలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతున్న క్రమంలో కూన శ్రీశైలం గౌడ్ రాజీనామా చేయడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇటీవలే జిహెచ్‌ఎంసిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో కూన చాలా చురుకుగా పాల్గొన్నారు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికతో పాటు జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీస స్థాయిలో పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దుబ్బాకలో దారుణంగా ఓటమి చెందగా, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ పట్టుమని పదిమంది కార్పొరేటర్లను కూడా గెలువలేకపోయారు. పార్టీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు వెరసి నాయకులు కాంగ్రెస్‌ను వీడేందుకు దోహద పడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న దీన పరిస్థితిపై పార్టీ జాతీయ నాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోని కారణంగా నేతలు తలోదారిన పయనిస్తున్నారు. ఎవరి సొంత ఎజెండాతో వారు ముందుకు సాగుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల పరిస్థితి మరి రోజురోజుకు దిగజారుతోంది.

వారు ప్రత్యర్ధి పార్టీలతో పోరాటం చేస్తున్నప్పటికీ వారికి భరోసా ఇచ్చే నాయకులు లేకపోవడంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. ఫలితంగా పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేములు ముందుకు వచ్చి పార్టీని గెలిపించేందుకు కూడా యత్నించడం లేదు. ఇక రాష్ట్రానికి చెందిన అగ్రనేతలు సైతం అధికార టిఆర్‌ఎస్‌తో రాజకీయ వైరం పెట్టుకునే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప… కింది స్థాయి కార్యకర్తలకు ఒక ధీమా కల్పించలేకపోతున్నారు. దీంతో నాయకులతో పాటు కార్యకర్తలు సైతం తమ రాజకీయ భవిష్యత్‌పై పునరాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వీడి పలువురు నాయకులు టిఆర్‌ఎస్, బిజెపి గూటికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కూన బాటలో మరికొందరు నాయకులు కూడా ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో మరి కొద్ది రోజుల్లో హస్తం పార్టీకి మరికొందరు నేతలు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

ప్రజల పక్షాన పోరాటం చేయలేకపోతున్నాం…
కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతున్నట్లుగా కూన శ్రీశైలంగౌడ్ ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. 2009లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకున్నా స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీచేసి గెలిపొందానన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డిసిసి అధ్యక్షుడిగా,మాజీ శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన పోరాటం చూశాన్నారు. అయితే గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు బాధకలిగించాయన్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర ప్రజలు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా శాసనసభ్యులను నిలుపుకోవడంలో పిసిసి నాయకత్వం విఫలమైందని ఆరోపించారు.

దీనికి ఉదాహరణ దుబ్బాక, జిహెచ్‌ఎంసి ఎన్నికలేనని పేర్కొన్నారు. చివరకు పిసిసి చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరిగిందన్నారు. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలే ఇందుకు ప్రధాన కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని కూన తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బిజెపితోనే సాధ్యమని నిర్ణయానికి వచ్చే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా టిఆర్‌ఎస్‌పై అసలు సిసలు పోరాటం చేస్తున్న కమలం పార్టీయేనని వ్యాఖ్యానించారు. అందుకే బిజెపిలో చేరినట్లు ఆదివారం నాడిక్కడ మీడియా ప్రతినిధులకు కూన వెల్లడించారు.

Kuna Srisailam Goud says good bye to Congress