Friday, March 29, 2024

జీతం అడిగినందుకు శ్రామికుడి చేయి నరికివేత

- Advertisement -
- Advertisement -

MP labourer
భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన రేవా జిల్లాలో తనకు బాకీ ఉన్న జీతం ఇవ్వమని అడిగినందుకు 45 ఏళ్ల శ్రామికుడి చేయిని యజమాని నరికివేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బాధితుడు అశోక్ సాకేత్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని, అతడు దోల్‌మౌ గ్రామంలో గణేశ్ మిశ్రా దగ్గర భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండేవాడని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఏఎస్‌పి) శివ కుమార్ వర్మ తెలిపారు. శ్రామికుడికి మిశ్రా జీతం ఇవ్వకుండా సాగదీస్తూ ఉండేవాడని తెలిపారు. ఈ ఘటన దోల్‌మౌ గ్రామంలోని సిర్‌మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితుడు పద్రి గ్రామ నివాసి. అతడు తన యజమానితో జీతం విషయంలో తీవ్ర వాదోపవాదానికి దిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. దాంతో మిశ్రా కోపావేశానికి లోనై ఓ కత్తితో బాధితుడి ఓ చేతిని నరికేశాడు. తెగిన చేతిని దాచేయాలని నిందితుడు ప్రయత్నించాడు. కానీ తర్వాత దానిని కనుగొన్నామని ఏఎస్‌పి తెలిపారు. పోలీసులు బాధితుడిని సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ డాక్టర్ల బృందం తెగిపోయిన చేతిని బాధితుడికి సర్జరీ చేసి తిరిగి అతికించారని కూడా ఏఎస్‌పి తెలిపారు. కాగా బాధితుడికి రక్తం ఎక్కువ పోయినందున అతడి పరిస్థితి ఇప్పటికి ఆందోళనకరంగానే ఉందని సమాచారం. పోలీసులు గణేశ్ మిశ్రాను, అతడి ఇద్దరు సోదరులు రత్నేశ్ మిశ్రా, కృష్ణ కుమార్ మిశ్రాలను ఐపిసి సెక్షన్ 307(హత్యాయత్నం), ఎస్సీ,ఎస్టీలపై దౌర్జన్యాల నిరోధక చట్టం అభియోగాల కింద అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News