Home దునియా సానిటరీ ప్యాడ్

సానిటరీ ప్యాడ్

Sanitary-Pad

ఒసేయ్ అంట్లు తోమడం అయ్యిందా? అయ్యగారి బట్టలు ఉతకాలి త్వరగా ఆ పని ముగించేసుకొని ఇక్కడికి వచ్చి చావు పంకజం కేకతో ఉలికిపడ్డ గంగ.., అలాగే అమ్మగారు ఇదిగో ఐదు నిమిషాలే వచ్చేస్తాను. భయాన్నంతా గొంతులో నింపుకొని చెప్పింది. ఛీ.. ఛీ ఈ పని పిల్లతో చస్తున్నా ఉత్తి పని దొంగ ఎక్కడ ఉంటే అక్కడే గంటలు గంటలు సమయం వృథా చేస్తుంది. మళ్ళీ దీని ముఖానికి రోజు అన్నం, కూర, ఇచ్చి పంపాలి, నెల నెలా జీతం. ఏదో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ లాగ ఒకటో తారీఖున ఇచ్చేయాలి. ఈయనకు చెప్తే వినరు వేరే పనిపిల్లను చూడమంటే అస్సలు పట్టించుకోరు. ఇంకెన్ని రోజులు వేగాలో అంటూ ఉండగా గంగ పెరట్లోకి వెళ్ళింది. వచ్చావా తల్లీ… ఇదిగో ఈ బట్టలు ఉతుకు అని దాదాపు ఇరవై జతలు చూపించి గతవారం బట్టలు సరిగా ఉతకలేదని ఆయన చెప్పారు. కంచాలు కంచాలు మెక్కుతావు కదా! కాస్త ఆ జీన్స్ ఫాంట్ బ్రష్ తో బాగా రుద్దు. త్వరగా పూర్తిచేసి వంటగదిలోకి వచ్చేయి, మళ్ళీ పిల్లలు వచ్చే సమయం అవుతుందని వెళ్ళిపోయింది పంకజం. గంగ బట్టలు ఉత్తకడం మొదలు పెట్టింది. ఎందుకో ఉన్నట్టుండి కడుపులో నొప్పి ప్రారంభం అయ్యింది. భరించలేని నొప్పి ఆగబట్టలేక అక్కడి నుండి లేచి హాల్ రూమ్ లో టివి చూస్తున్న పంకజం దగ్గరికి వెళ్లి అమ్మ కడుపు నొప్పిగా ఉంది. ఏదైనా?మందుబిళ్ళ ఉంటే ఇవ్వండి తట్టుకోలేకపోతున్నానని ప్రాధేయపడింది.

ఏంటే ? కడుపు నొప్పి అని సాకులు చెప్పి ఇవాళ పని చేయకుండా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావా? అదేమీ కుదరదు! మందు లేదు గిందు లేదు నాటకాలు మాని వెళ్లి బట్టలు త్వరగా ఉతికి వచ్చేసేయి అని కోప్పడింది. నిజంగానే కడుపులో గుచ్చుతున్నట్టు ఉంది అమ్మగారు తట్టుకోలేకపోతున్న ఏదైనా మందు బిళ్ళ ఇవ్వండి లేదంటే చచ్చిపోతానేమో చాలా బాధగా ఉందని మొరపెట్టుకుంది గంగ. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు, నోరు మూసుకొని వెళ్లి పని చెయ్యి అనగానే చేసేది లేక మెల్లగా బయటికి వస్తుండగా గంగ కాళ్ళ నడుమ నుండి రక్తం అమాంతం రావడంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. పంకజం వెంటనే ఛీ..ఛీ పండగ కోసం ఇల్లు శుభ్రం చేసుకున్నమొత్తం గలీజు చేసి సచ్చిందని ఈసడించుకుంటూ గంగ ముఖంపై నీళ్ళు చల్లి ‘లేచి చావు ముందే చెప్పి చావచ్చు కదా నెలసరని, ఇప్పుడు చూడు! ఇల్లంతా మైల పడిపోయింది మళ్ళీ శుభ్రపరుచుకోవాలి. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో’ అన్నది. అమ్మగారు నిలబడలేను ఎందుకో? కడుపు చాలా నొప్పిగా ఉంది. ఏంటే ? నీ ఉద్దేశం నిన్ను ఎత్తుకొని నేనే బయటకి తీసుకెళ్లమంటావా? చాలు చాలు నీ వేషాలు ఆపి పద బయటకి పద నేను ఇల్లు శుభ్రం చేసుకోవాలి. గంగ నిలబడలేక నెమ్మదిగా పాకుతూ ఇంట్లో నుండి పెరట్లోకి వెళ్ళింది. కానీ ఇంటికి ఎలా వెళ్ళాలి? రక్తస్రావం అవుతూనే ఉంది. అమ్మా అమ్మా.., కాస్త గుడ్డ పీసు ఉంటే ఇవ్వండి రక్తస్రావం ఎక్కువగా అవుతోంది. ఇలాగే ఇంటికి వెళ్ళలేను కాస్త మా అయ్యకి ఫోన్ చేయండని దీనంగా అడిగింది గంగ. సరే సరే అక్కడే చావు నేను ఫోన్ చేసి చెప్తానులే.
************

గంగ వయసు పదహారు, తల్లి ఐదు సంవత్సరాల క్రితం అనార్యోగంతో కాలం చేయడంతో చదువు ఆపేసి ఇళ్ళల్లో పనులు చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటోంది. తండ్రి సూరన్న పల్లెలో వ్యవసాయ కూలిగా పనిచేసేవాడు. పంటలు పండక కూలిపనికి ఎవరు పిలవకపోవడంతో ఆరునెలల క్రితమే పట్నానికి వలసొచ్చాడు. మరో పెళ్లి చేసుకో అని ఎంతమంది చెప్పినా వచ్చిన భార్య తన పిల్లలను సరిగా చూసు కుంటుందో లేదో అని పెళ్లి చేసుకోకుండా పిల్లలతో కలిసి పట్నంలో ఉంటున్నాడు. సూరన్నకు ఇద్దరు కూతుళ్ళు ! మొదటి కూతురు గంగ ఎనిమిది వరకు చదివింది. రెండో కూతురు ప్రభుత్వ బడిలో ఆరో తరగతి చదువుతోంది. పంకజం సూరన్నకు ఫోన్ చేసి ఇదిగో సూరన్ననీ కూతురు నెలసరి అయ్యింది, వెంటనే వచ్చి తీసుకుపో,అయినా ! నెలసరి రోజుల్లో ఎందుకు పంపి చచ్చావు.

నా ఇల్లంతా గలీజు చేసిందని అటువైపు సమాధానం వినకుండానే ఫోన్ పెట్టేసింది. విషయం తెలుసుకున్న సూరన్న హడావిడిగా పంకజం ఇంటికి చేరుకున్నాడు. ఇంటి బయట ఒక మూల తన కూతురు చచ్చిన శవంలా పడిఉండటం చూసి తండ్రి గుండె తరుక్కుపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మా గంగ.. గంగ… లే తల్లి ఏమైంది? కళ్ళు తెరువు అని గుండెలు బాదుకుంటున్నాడు. కానీ గంగ లేవడం లేదు రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. సూరన్న కేకలు విని బయటకు వచ్చిన పంకజం ఏంటి అలా కేకలు పెడుతున్నావు? గట్టిగా అరవకుండా నీ కూతురిని తీసుకెళ్ళు. నెలసరి ఎక్కువైంది అంతే దానికంత చించుకోవాలా పద పద నీ కూతిరిని ఎత్తుకొని బయటికి వెళ్ళు నేను ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అమ్మ ఒక యాభై రూపాయలు ఉంటే ఇవ్వండి, పాపను ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతాను. నాకెందుకో అనుమానంగా ఉంది, ఎక్కువగా రక్తస్రావం అయ్యింది స్పృహ కూడా తప్పిందని అడిగాడు సూరన్న. నా దగ్గర చిల్లర లేదు రెండు వేల రూపాయల నోటు ఉంది. బయట ఎవరినైనా అడిగి తీసుకెళ్ళు ముందు ఇక్కడి నుండి వెళ్ళండి.

చేసేది లేక కూతురిని భుజాన వేసుకొని బయటకి వచ్చాడు సూరన్న. దారిలో విషయం చెప్పి ఎంతమందిని డబ్బు అడిగినా ఎవరూ ఇవ్వక పోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అది గమనించిన శైలజ అనుమానం వచ్చి సూరన్నను ఆపి ఏమైంది? ఎవరు ఈ అమ్మాయి ? ఎందుకు పరిగెడు తున్నావు అని అడిగింది.? సూరన్న జరిగిన విషయం చెప్తుండగానే రక్తస్రావం గమనించిన శైలజ వెంటనే ఆటోను పిలిచి ఆసుపత్రికి బయలుదేరారు. ఆటోలో సూరన్న విషయం మొత్తం చెప్పాడు. ఆసుపత్రికి చేరుకోగానే వైద్యులు పరీక్షలు చేసి రక్తం చాలా పోయింది. A+ రక్తం కావాలి త్వరగా ఏర్పాటు చేసుకోండి అనగానే శైలజ తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి విషయం చెప్పగానే, రక్తం ఇవ్వడానికి వెంటనే ఇద్దరు స్నేహితులు వచ్చి రక్తదానం చేశారు. రక్తాన్ని ఎక్కించిన రెండు గంటలకు గంగ స్పృహలోకి వచ్చింది.
*************

శైలజ ప్రభుత్వ అడ్వకేట్ విషయమంతా తెలుసుకొని పంకజం మీద కోర్టు లో కేసు వేసింది. పది రోజులు గడవకముందే పంకజం ఇంటికి పిల్లలతో పని చేయించుకోవడం, తీవ్రంగా హింసించడంపై వివరణ కోరుతూ కోర్టుకు హాజరు కావాలని పంకజంకు నోటీసులు అందాయి. భార్యాభర్తలు ఇద్దరూ బెదిరిపోయి ఒక లాయర్‌ను నియమించుకున్నారు. కోర్టులో వాదనలు ప్రారంభ మయ్యాయి. గంగ తరుపు న్యాయవాది అయినా శైలజ చూడండి పిల్లలతో పని చేయించుకోకూడదని, అది నేరమని మీకు తెలియదా? అని పంకజంను అడిగింది. తెలుసండి నాకెందుకు తెలియదు అయినా గంగ వయసు ఇరవై నాలుగేళ్ళు అని సూరన్న చెప్పాడు. అందుకే పనిలో పెట్టుకున్నాము అని బదులిచ్చింది పంకజం. గంగను చూస్తే మీకు ఆ పిల్ల వయసు కనిపెట్టలేక పోయారా? ఏమోనండి కొంతమంది ఎక్కువ వయసు ఉన్నా చిన్న పిల్లలాగా ఉంటారు కదా! అవును అవును నిజమే! కొంతమంది ఎంత వయసు పెరిగిన మానవత్వం లేకుండా మీలాగా ఉంటారు కదా అలాగేనా? ఏమంటున్నారు మీరు అన్నది పంకజం?

ఉన్నదే అంటున్నా! అసలు మీరు స్త్రీ అనే విషయాన్నీ మరిచారా? కనీసం చిన్న పిల్ల అని కూడా చూడకుండా బండెడు చాకిరీ చేయించుకుంటూ గంగకు నెలసరి వచ్చి బాధపడితే కనీసం సానిటరీ ప్యాడ్ కూడా ఇవ్వలేదు. ఆ అమ్మాయికి ఎక్కువగా రక్తస్రావం అయ్యి ఇంట్లో పడిపోతే ఇంటి నుండి గెంటేసి మూలన పడేశారు. తండ్రి వచ్చి ఆసుపత్రికి డబ్బు అడిగితే లేదన్నారు? స్త్రీగా పుట్టినందుకు సిగ్గుపడండి. ఇదంతా విన్న పంకజం తరుపు న్యాయవాది యువర్ ఆనర్ నా క్లైంట్ పంకజం నిరపరాధి నిజానికి ఆసుపత్రికి వెళ్ళమని సలహా ఇచ్చి పంపింది కూడా పంకజమేనని వాదించాడు. వెంటనే శైలజ లేదు లేదు యువర్ ఆనర్ స్వయంగా నేనే సూరన్న గంగను ఎత్తుకొని బజారులో పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే అనుమానం వచ్చి ఆపి విషయం తెలుసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళానని చెప్పి ఆటో డ్రైవర్‌ని, గంగకు వైద్యం చేసిన వైద్యుడిని సాక్షాలుగా ప్రవేశపెట్టింది.

సాక్ష్యాలని పరిశీలించి న్యాయమూర్తి బాలకార్మికుల చట్టం కింద రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేసి. అసలు గంగ నెలసరి అయ్యిందని తెలిసి కూడా తనతో అమానుషంగా ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ ఒక స్త్రీ అయ్యి ఉండి కూడా కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోర్టు కొన్ని సూచనలు చేస్తోంది. ఈ దేశంలో ప్రతి పండుగకు ప్రభుత్వం సెలవు దినములు కేటాయించింది. అలాగే అన్ని రంగాలలో ఉన్న ప్రతి మహిళకు నెల నెలా మూడురోజుల పాటు నెలసరి సమయంలో సెలవు ఇవ్వాల్సిందిగా సూచిస్తున్నాము. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాదు ప్రతి మహిళకు వర్తించేలా చట్టం తీసుకొచ్చి అమలుపరిచేలా చేయాలి. నెలసరి గురించి కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించాలి. ప్రతి నెలా ప్రభుత్వం ఎలా అయితే పేద ప్రజలకు తక్కువ ధరకే సరుకులు ఇస్తుందో,అలానే నెలసరి సమయంలో ప్రతి మహిళకు కావాల్సిన సానిటరీ ప్యాడ్‌లను ఉచితంగా అందించాలి. నిజానికి చాలా మూఢనమ్మకాలతో ఆ సమయంలో వారిని దూరం పెట్టి మానసిక క్షోభకు గురిచేయకండి. నెలసరి ఒక సాధారణ విషయమేనని ప్రజలందరికీ అవగాహన కల్పించండి. బాలకార్మిక చట్టాలు మరింత కఠినతరం చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తున్నాము. దీనిపై నెల రోజుల్లో ప్రభుత్వం తరపు నుండి నివేదిక సమర్పించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
***************

కోర్టు ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం బాలకార్మిక చట్టాలను కఠినతరం చేయడానికి కమిటీ వేసింది. నెలసరి రోజుల్లో దేశ మహిళలందరికీ మూడు రోజుల పాటు సెలవు దినంగా ప్రకటించడమే కాకుండా ఆ సమయంలో వారికి అవసరమైన సానిటరీ ప్యాడ్ లను, బలంగా ఉండటానికి అవసరమైన తినుబండారాలు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసింది. ఈ కేసు ద్వారా దేశ ప్రజలందరికీ తెలిసిన గంగకు అపూర్వమైన మద్దతు లభించింది . ప్రభుత్వమే గంగను ఆధీనంలోకి తీసుకొని తన భవిష్యత్ మొత్తం మేమే చూసుకుంటామని ప్రకటించడంతో ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన శైలజకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ కథ ఒక గంగ కోసమే కాదు ఎంతోమంది ఆడపిల్లలు స్కూల్స్, కాలేజెస్‌లో, ఆఫీసులలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది నెలసరి గురించి మాట్లాడటానికి సంకోచిస్తున్నారు, నెలసరి అంటే పాపమేమీ కాదు లేదా తప్పేమీ కాదు అదో సాధారణ విషయం అని అభిప్రాయం చాలామంది అర్థం చేసుకోవాలి. నెలసరి గురించి అందరికీ అవగాహన కలగాలి కథలో చెప్పినట్టు నెలకు మూడురోజులు కాకపోయినా కనీసం రెండు రోజులు సెలవు ప్రకటిస్తే మహిళలు ఆనందిస్తారు.

విరాజిత (నిజాగ్ని)

సామాజిక విశ్లేషకురాలు