Home ఎడిటోరియల్ తప్పుకోక తప్పదా?

తప్పుకోక తప్పదా?

Lakhimpur kheri violence in which four farmers were killed

ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలోని టికోనియాలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు అమరులైన ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించి అరెస్టు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటున్నది. ఈ నెల 3న అక్కడ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న రైతులపైకి మంత్రి వాహన శ్రేణిలోని ఒక కారును ఉద్దేశపూర్వకంగా తోలించగా వీరు దుర్మరణం పాలయ్యారు. వీరి అంతిమ ప్రార్థన ఘట్టం మంగళవారం నాడు టికోనియాలో జరిగింది. దీనికి రైతులు, రైతు ఉద్యమ నేతలు, సానుభూతిపరులు, ప్రియాంక గాంధీ తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రిని అరెస్టు చేయాలని రైతు ఉద్యమ అగ్రనేత, భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ డిమాండ్ చేశారు. అంతిమ ప్రార్థనల ఘట్టం రైతుల దృఢ దీక్షను ప్రతిబింబించింది. మంత్రిని చట్టానికి అప్పగించే వరకు విశ్రమించేది లేదని వారు స్పష్టం చేశారు. నలుగురు రైతులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఘటన జరిగిన తర్వాత అమరుల అంత్యక్రియల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంలో తికాయత్ ఉపయోగపడ్డారు. నష్ట పరిహారంపై అంగీకారం కుదిర్చి తదుపరి కార్యక్రమానికి ఆటంకం లేకుండా చేశారు.

ఆ సందర్భంలో మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేసి మంత్రి చేత రాజీనామా చేయించాలన్న రైతు ఉద్యమకారుల డిమాండ్లకు ప్రభుత్వ పక్షం అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. అరెస్టును తప్పించుకోడానికి ఆశిష్ మిశ్రా నేపాల్‌కు పారిపోయాడని వదంతులు కూడా వచ్చాయి. పోలీసులు విచారణకు పిలిచినా అతడు హాజరు కాలేదు. అతడిని ఎందుకు అరెస్టు చేయలేదని సుప్రీంకోర్టు గట్టిగా నిలదీసి మొట్టికాయలు పెట్టడంతో యుపి పోలీసులు ఒక రోజు ఆలస్యంగా ఆశిష్‌ను అరెస్టు చేశారు. ఎనిమిది మంది దుర్మరణానికి కారణమైన ఘాతుక ఘటన జరిగిన తర్వాత కూడా కేసుపై యుపి పోలీసులు నిజమైన శ్రద్ధ చూపుతున్నట్టు లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ తర్వాతనే ఆశిష్ మిశ్రా అరెస్టు జరిగింది. మొన్న సోమవారం నాడు అతడిపై హత్య కేసు నమోదయింది. అలాగే అతడి సన్నిహితులు ముగ్గురిని కూడా అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతుందనే భయంతోనో, విధ్యుక్త ధర్మ నిష్ఠతోనో, రాజకీయ బాసులు అనుమతించడం వల్లనో యుపి పోలీసులు కేసును ముందుకు తీసుకు వెళుతున్నట్టు స్పష్టపడుతున్నది. అయితే ఆనాటి ఘాతుక ఘటనకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాయే మూలకారకుడని, అతడిని అరెస్టు చేసి తీరాలని రైతు ఉద్యమకారులు పట్టుపడుతున్నారు.

గతంలో ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్న అజయ్ మిశ్రా తన నేరస్థ చరిత్ర గురించి ఘనంగా చెప్పుకుంటాడు. మహారాజ్ అని పిలిపించుకునే ఈ మంత్రి రైతు ఉద్యమకారులను కఠినాతికఠినమైన స్వరంతో హెచ్చరించి ఉన్నాడు. తాను తన అసలు స్వరూపాన్ని చూపిస్తే రైతులు ఆ ప్రాంతాన్నే విడిచిపెట్టి పోతారని, తాను కారులోంచి కాలుబయట పెడితే వారికి పరుగెత్తడం కూడా అసాధ్యమవుతుందని, అక్కడి ప్రజలకు తన గురించి బాగా తెలుసునని అజయ్ మిశ్రా వ్యాఖ్యానించి ఉన్నాడు. బబ్బర్ ఖల్సా వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన వారు రైతు ఉద్యమంలో ఉన్నారని కూడా ఆయన ఆరోపించాడు. దీనితో రైతులు ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. చివరికి ప్రదర్శనకారులపై కారును వేగంగా తోలించి నలుగురు రైతులు దుర్మరణం పాలవడానికి అజయ్ మిశ్రా కుమారుడే కారణమని స్పష్టపడుతుండడంతో రైతులు ఆయన మీద దృష్టి కేంద్రీకరించారు. అతడు మంత్రి పదవిలో ఉండగా కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగదనే రైతుల భయాన్ని కొట్టిపారేయలేము.

ఘటనకు ప్రధాన కారకుడని రైతులు నమ్ముతున్న వ్యక్తి కీలక అధికార పీఠంలో కొనసాగితే ఆ కేసులో నిజమైన న్యాయం జరుగుతుందనే నమ్మకం ఎలా కలుగుతుంది? మామూలు పరిస్థితుల్లోనైతే రైతుల డిమాండ్లను ఇప్పుడున్న పాలకులు పట్టించుకునే అవకాశాలు తక్కువ. ఐదు మాసాల్లో యుపి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అవి అత్యంత కీలకమైనవి. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది. అందుచేత లఖింపూర్ ఖేరీ దారుణ ఘటన ప్రభావం విస్తరించకుండా చూసుకోవాలన్న జ్ఞానోదయం దానిలో కలగలేదని అనుకోలేము. రైతు ఉద్యమకారులు అంతిమంగా తమ డిమాండైన కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు వారు చేస్తున్న కేంద్ర మంత్రి అరెస్టు డిమాండ్ కూడా అందులో భాగమే. మంత్రిని తొలగించకుండా కేంద్రం తాత్సారం చేసేకొద్దీ రైతు ఉద్యమం మరింతగా బలపడడం ఖాయం. అందుచేత అజయ్ మిశ్రాను కేంద్ర కేబినెట్ నుంచి తొలగించక తప్పకపోవచ్చు.

Lakhimpur kheri violence in which four farmers were killed