Home రాష్ట్ర వార్తలు నీకో సగం నాకో సగం

నీకో సగం నాకో సగం

 ‘డబుల్’ జాగాపై బిల్డర్ల గొంతెమ్మ కోరికలు    

ఆలోచనలో అధికార వర్గాలు 

Double-Bedroomమన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనవున్న ప్రజానీకానికి ఉచితంగా నిర్మించి ఇవ్వాలని తలపెట్టిన ‘డబుల్ బెడ్ రూం’ గృహ నిర్మాణాలను చేపట్టేందుకు బిల్డర్లతో ప్రభు త్వం ఇంకా చర్చలు జరుపుతూనే ఉంది. ముఖ్యంగా రాజధాని నగరంలో త్వరిత గతిన ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. జిహెచ్‌ఎంసి పరిధిలో నిర్మించనున్న గృహాలకు రూ. 7 లక్షలు వెచ్చిం చాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినా బిల్డర్లు ముందు కు రావడం లేదని తెలిసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు తాము ఇళ్ళు నిర్మించి ఇవ్వలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. గత రెండు రోజుల క్రితం జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి బిల్డర్లతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో బిల్డర్లు డబుల్ బెడ్‌రూం గృహాలు నిర్మించి ఇస్తే దానికి ఉపకారంగా బిల్డర్లు ఇతర ప్రాంతాల్లో నిర్మించే భవ నాలకు మరో అంతస్తు ఉచితంగా నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తామని కమిషనర్ చెప్పినట్లు తెలిసింది. అయితే దీనికి ససేమిరా అన్న బిల్డర్లు, ప్రభుత్వం ఎక్కడ యితే డబుల్ బెడ్‌రూం గృహాలు నిర్మించేందుకు స్థలం సేకరిస్తుందో ఆ స్థలంలో సగభాగం తమకు ఇస్తే డబుల్ గృహాలను ఉచితంగానే నిర్మించి ఇచ్చేందుకు సిద్ఢంగా ఉన్నామని చెప్పినట్లు సమాచారం. జంటనగరాల్లోనే ప్రస్తుతం ఉన్న మురికి వాడల్లో ఈ ఇళ్ళ నిర్మాణం జరగ వలసి ఉంది. ప్రస్తుతం ఇటువంటి బస్తీలన్నీ నగరం మధ్యలోనే ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో గజం జాగా విలువ వేలు, లక్షలు పలుకుతుది. ఈ స్థితిలో బిల్ఢర్లకు ఆ ప్రాంతాల్లో సగం జాగా కట్టబెడితే కోట్లలో చెల్లించిన ట్లేనని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం మరో సారి చర్చించాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బిల్డర్లనుంచి వచ్చిన ప్రతిపాదనలను కమిషనర్ ప్రభుత్వం ముందుంచినున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాని పక్షంలో ప్రస్తుతం చెల్లిస్తామని చెబుతున్న మొత్తాన్ని పెంచవలసి ఉంటుందని అధికారులు అంటు న్నారు. అప్పుడు ఎంత మొత్తాన్ని పెంచాలని బిల్డర్లు కొరనున్నారో తెలుసుకునేందుకు మరో సమావేశం నిర్వహించవలసి రావచ్చునంటున్నారు. ఇలా కాలయా పన జరగడం వల్ల నిర్మాణ ధరలు మరింత పెరిగిపోయి తిరిగి నిర్మాణాల ధరలను పునఃపరిశీలించవలసి రావ చ్చని అధికారులు అంటున్నారు. ఆలస్యం కావడం మూలంగానే నగరంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంచే పథకాల కింద నిర్మించిన ఇళ్ళను ఇంకా లబ్ధిదారులకు అందించలేక పోతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వీటి నిర్మాణాలకు గానూ బిల్లుల చెల్లింపులో జరిగిన ఆల స్యం వల్ల ఇళ్ళ నిర్మాణాలు ఆలస్యమయ్యా యని, దీనికి తోడు బడుగు, బలహీన వర్గాలు తమ పది శాతం వాటాను చెల్లించలేక పోవడం వల్ల గృహాల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందించ లేని స్ఢితి నెలకొందంటున్నారు. నగరంలోని పూల్‌బాగ్, కస్తూరిబానగర్, బన్సీలాల్ పేట, ఉన్నికోట, పాటిగడ్డ, ఎన్‌బిటి నగర్ తదితర 13 ప్రాంతాల్లో జెఎన్‌ఎన్‌యు ఆర్‌ఎం, వాంబే పథకాల కింద సుమారు 2000 ఇళ్ళ నిర్మాణాలు మొదలు కాగా, 1920 గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 1532 లబ్ధిదారులకు కేటాయిం చారు. వీరిలో కేవలం 291 మంది లబ్ధిదారులు మాత్ర మే వారు చెల్లించ వలసిన మొత్తాన్ని చెల్లించడంతో వారికి మాత్రమే గృహాలు అప్పగించగా, మిగతావి ఖాళీ గానే ఉన్నాయి. ఈ నిర్మాణాలు మొదలు పెట్టి కనీసం ఆరు నుంచి ఏడు సంవత్సరాలు అవుతుండగా, ఇన్ని ఏళ్ళు జాగాలు అప్పగించిన వారు అద్దె ఇళ్ళలో ఉంటూ కాలం గడిపారని చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కొకరు రూ. 60 నుంచి70 వేలు చెల్లించవలసి ఉందని, వారి వద్ద అంత మొత్తం లేకనే చెల్లించలేక పోతున్నారని ఈ విషయాన్ని కెటిఆర్ దృష్టికి తీసుకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొంటున్నారు. ఇదీ కాకుండా ఆ బస్తీల్లో కొందరు చిన్నచిన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునే వారు ఉన్నారు. అయితే వారి ఇళ్లను కూడా అప్పట్లో అధికారులు తొలగించి నూతన నిర్మాణాలు చేపట్టినా ప్రస్తుతం వారికి ఇళ్ళు ఇవ్వడానికి వీలు లేందటున్నారు. అటువంటి వారు 80 నుంచి 90 కుటుంబాలు ఉంటాయని చెపుతున్నారు. కాగా, అప్పట్లో ఇళ్ళు ఇచ్చిన వారిలో కొందరు చనిపోయారని, వారి వారసులు ఉన్నా వారికి కూడా ఇళ్ళు ఇవ్వడం కుదరదని అధికారులు అంటున్నారని పూల్‌బాగ్‌కు చెందిన బాధిత కుటుంబాలవారు ‘మన తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ వాపోయారు. వీరంతా కెటిఆర్‌ను ఆశ్రయించి తమగోడు వెళ్ళబోసుకునేందుకు సిద్ధమవుతున్నారు.