Thursday, April 25, 2024

భూమి మార్కెట్ విలువ పెంపు?

- Advertisement -
- Advertisement -

Land market value

 

100 నుంచి 200 శాతం పెంచాలని నిర్ణయం
ఐటి కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న చోట భారీగా పెంపు
ఏప్రిల్ లేదా మే నుంచి అమల్లోకి రానున్న కొత్త చార్జీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ఖజానాకు మార్చి (20వ తేదీ) వరకు దాదాపు రూ.6,900 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి 11 రోజులు మిగిలి ఉండ గా మరో రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మార్చి నెలాఖరు నాటికి స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,880.87 కోట్ల రాబడి రాగా ఈసారి వెయ్యి కోట్లకు పైగా అదనంగా వస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి (2020, 21)గాను ఈ శాఖ ద్వారా రూ. 9 నుంచి 10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని, అందులో భాగంగానే ప్రస్తుతం భూముల మార్కెట్ వాల్యూను పెంచాలన్న ప్రతిపాదనను అమల్లోకి తీసుకురావాలన్న యోచనలో ఉన్నట్టుగా ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

సిఎం కెసిఆర్ ఆమోదముద్ర పడగానే…
త్వరలో భూముల మార్కెట్ వాల్యూను పెంచుతామని అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మార్కెట్ పెంపునకు సంబంధించి థర్డ్‌పార్టీ ఏజెన్సీ సైతం అధ్యయనం చేసి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు నివేదిక సమర్పించినట్టుగా తెలిసింది. ఈ నివేదికలో ఐటి కారిడార్‌తో పాటు భారీ నిర్మాణాలు, స్టేట్ జాతీయ రహదారులు, అద్దె ఎక్కువగా డిమాండ్ ఉన్నచోట భూముల విలువను 100 నుంచి 200 శాతం పెంచాలని థర్డ్‌పార్టీ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఈ నివేదిక ప్రభుత్వానికి అందించారని సిఎం కెసిఆర్ ఆమోదముద్ర పడగానే దీనిని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించనున్నట్టుగా తెలిసింది. ఏప్రిల్ లేదా మే నెలలో కొత్తగా సవరించనున్న మార్కెట్ వాల్యూను అమలు చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

2013 చివరగా ఆమోదం
ఈ నేపథ్యంలో ఓపెన్ మార్కెట్ విలువ ఆధారంగా 100 నుంచి 200 శాతం మార్కెట్ విలువ పెంపునకు ప్రతిపాదనలు సిద్ధమయినట్టుగా సమాచారం. మార్కెట్ విలువల పునఃసమీక్ష సవరణ ఉమ్మడి రాష్ట్రంలో 2013 ఆగష్టులో చివరగా ఆమోదించగా ఇప్పటివరకు ఇవే ధరలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013లో ఉమ్మడి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సమీక్షించారు.

11 రోజుల సమయం ఉండగానే రూ. 6,900 కోట్ల ఆదాయం
ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 11 రోజుల సమయం ఉండగానే రూ. 6,900 కోట్ల ఆదాయం సమకూరగా గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి వృద్ధిరేటు అధికంగా నమోదు చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం నలుదిక్కులా ఏర్పడిన అనుకూల పరిస్థితులతో స్థిరాస్తి వ్యాపారాన్ని అగ్రభాగాన నిలబెడుతున్నాయి. వాస్తవానికి 2003లో భూముల విలువ పెంచిన తర్వాత ఇప్పటివరకు మార్కెట్ విలువల పునఃసమీక్ష సవరణ జరగలేదు, ప్రజలపై రిజిస్ట్రేషన్ రుసుం భారం పడకుండా ఉండేందుకు స్టాంప్ డ్యూటీని సైతం ప్రభుత్వం పెంచలేదు. అయినా అనుకున్న దానికన్నా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అభివృద్ధిలో ముందుకు దూసుకెళుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 14 లక్షల పైచిలుకు డాక్యుమెంట్లు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో హైదరాబాద్ మోస్ట్ డైనమిక్ సిటీగా, లివబుల్ సిటీగా ప్రపంచ చిత్రపటంలో నిలబడడం, అత్యంత సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ, నలువైపులా అభివృద్ధి అన్నీ కలిపి రియల్‌రంగంలో పెట్టుబడులకు బాటవేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆ జిల్లాల నుంచే ఎక్కువ రిజిస్ట్రేషన్లు
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాల నుంచే ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఆదాయం కూడా ఎక్కువగా ఇక్కడినుంచే వస్తుందని అధికారులు గణాంకాలను బట్టి తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడంతో అన్ని చోట్లా పెట్టుబడులు పెట్టడానికి రియల్ రంగం సంస్థలు ముందుకొస్తున్నాయని, దీంతో అన్ని ప్రాంతాల్లో భూము ల ధరలు అమాంతం పెరుగుతున్నాయని రియల్‌ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరగడం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కలిసివచ్చిందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

 

Land market value increase
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News