Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) హెచ్‌ఎండిఎ ఆసక్తి!

హెచ్‌ఎండిఎ ఆసక్తి!

ల్యాండ్ పూలింగ్ స్కీంపై చిరంజీవులు నజర్
250-500 ఎకరాల్లో లే అవుట్‌కు ప్రణాళిక
రూ. 250-300 కోట్లు ఆదాయమే లక్షం
కీసర-ఘట్‌కేసర్ వైపు అథారిటీ దృష్టి
ప్రభుత్వం ఆమోదమే తరువాయి
చర్చించిన మునిసిపల్ కార్యదర్శి, కమిషనర్‌లు

hmda

మన తెలంగాణ/సిటీబ్యూరో : లాభదాయకంగా ఉన్న భూసమీకరణ పథకం వైపు దృష్టి సారించింది హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఎ). ఓవైపు నిధులను కేటాయించడంలేదు. మరో వైపు పథకాలను సొంతంగా పూర్తి చేయాలనే సంకేతాలు ప్రభుత్వం నుంచి వెలువడటంతో హెచ్‌ఎండిఎ భూసమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం)ను చేపట్టాలని నిర్ణయించింది. కనీసంగా 250-500 ఎకరాలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధ్దం చేశారు కమిషనర్ చిరంజీవులు. తద్వారా కనీసంగా రూ. 250-300 కోట్లు అర్జించాలనే లక్షంగా ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించిన మౌలిక సూత్రాలను తయారుచేసిన ఆయన గత రెండు మాసాల క్రితమే సూత్రాలకు అనుమతినివ్వాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు సమాచారం. ఈ నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే అథారిటీ భూసమీకరణ కోసం పత్రికా ప్రకటనను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఈ పథకాన్ని చేపడితే సేకరించాల్సిన భూమి, అయ్యే వ్యయం, రైతులతో వాటాలకు సంబంధించిన ఒప్పందం వంటివి అంచనా వేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.
కీసర-ఘట్‌కేసర్ వైపు…
ప్రస్తుత పరిస్థితిల్లో వరంగల్ హైవే వైపు హెచ్‌ఎండిఎ ప్రాధాన్యతనివ్వాలనే యోచన చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరిచడానికి మొదటి కారిడార్‌గా హైదరాబాద్ నుండి వరంగల్ మార్గాన్ని ఎంపిక చేసినందున అథారిటీ ఆ కారిడార్ ప్రాంతంలోనే భూసమీకరణ పథకాన్ని చేపట్టాలని భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట్ మండలాల పరిధిలోనే చాలా తక్కువగా లేఅవుట్లు వెలిశాయని, భూమి కూడా అధికంగా అందుబాటులో ఉన్నదని, ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు, రేడియల్ రోడ్లు, వరంగల్ జాతీయ రహదారి అతిచేరువగా ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లోనే ల్యాండ్ పూలింగ్ స్కీంను అమలు చేసేందుకు కమిషనర్ చిరంజీవులు ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఎంఎంటిఎస్, పుష్‌పుల్, మెట్రో రైలు, ఘట్‌కేసర్ ఔటర్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వెలుపలి వరకు స్కైవే వంటివి ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికితోడు మరో రెండేళ్ళలో ఘట్‌కేసర్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ కూడలిలో వ్యాపార సముదాయాలు వేసైడ్ ఎమినిటీస్ పథకంలో భాగంగా రానున్నాయి. నీటి వనరులు కూడా శామీర్‌పేట్ నుండి అనుసంధానంగా ఇతర చెరువులను కలుపుతూ కాలువలు ఉండటం వల్ల నీటి వసతికి ఏవిధమైన ఇబ్బందులు ఉండవని, వీటిని పరిగణలోకి తీసుకున్న ఆయన ఈ మండలాల పనరిధిలోని భూములను సేకరించాలనే కచ్చితమైన నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది.
సూత్రాల్లో మార్పులు….
హెచ్‌ఎండిఎ యాక్ట్ -2008 ప్రకారంగా అథారిటీ కనీసంగా 80 హెక్టార్లకు తగ్గకుండా ల్యాండ్ పూలింగ్ స్కీంను అమలుపరిచే అధికారమున్నది. అయితే, చట్టం ప్రకారంగా ఈ స్కీంను చేపట్టేందుకు అవసరమయ్యే మౌలిక సూత్రాలను ప్రత్యేకంగా తయారుచేసుకున్న కమిషనర్ చిరంజీవులు ప్రభుత్వానికి పంపించారు. అనంతరం ఇటీవల మునిసిపల్ విభాగంలోని ఉన్నతస్థాయి అధికారితో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిరంజీవులు రూపొందించిన సూత్రాల్లో పలు మార్పులు చేయడంతో పాటు మరికొన్ని కొత్త సూత్రాలను కూడా ఆ నివేదికలో పొందుపరచాలని సూచించినట్టు తెలిసింది. ఆ ఉన్నతాధికారి సూచన మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేసి తిరిగి ఉన్నతాధికారికి ఆ సూత్రాలను పంపించేందుకు సిద్దమైనట్టు అధికారుల సమాచారం. గత నాలుగు రోజుల క్రితం మునిసిపల్ మంత్రి కెటిఆర్ నగరంలోని పలు సంస్థల అధికారులతో సమవాశాన్ని నిర్వహించిన ఆయన భూసమీకరణలో ఏవిధమైన భూవివాదం లేని భూములను మాత్రమే సేకరించాలని సూచించినట్టు తెలిసింది. అందుకు అనుగుణంగా చిరంజీవులు మౌలిక సూత్రాల రూపకల్పనచేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించనున్నారు
రూ.250-300 కోట్లు…
250 ఎకరాల్లో లేఅవుట్‌ను హెచ్‌ఎండిఎ చేయడం వల్ల లేఅవుట్‌గా 128 ఎకరాల వరకు ప్లాటింగ్ ప్రాంతం మిగిలనున్నట్టు అధికారుల భావన. 128 ఎకరాల్లో కనీసంగా అథారిటీకి 55 ఎకరాలు రావచ్చనేది అథారిటి ధీమా. ఈ వాటా భూమిని విక్రయించడం ద్వారా సంస్థకు ఏటా రూ. 250-300 కోట్లు మేర అధాయం చేకూరుతుందనేది అధికార వర్గాల ధీమా వ్యక్తమవుతోంది. మరి మౌలిక సూత్రాలకు ప్రభుత్వం ఆమోదం ఎప్పుడవుతుందో…? వేచి చూడాలి.