Friday, March 29, 2024

బీహార్ బాటలో భూ రీసర్వే

- Advertisement -
- Advertisement -

Land Survey

 

ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం

హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. భూరికార్డుల ప్రక్షాళనలో వెల్లడయిన రికార్డుల ఆధారంగా ప్రతి అంగుళం భూమిని క్షేత్రస్థాయిలో లెక్క తేల్చాలని నిర్ణయించినట్టుగా సమాచారం. నూతన చట్టంలో భాగంగా వివాదాలు లేని భూములకు సంబంధించిన వివరాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల వివాదాలు నెలకొనడంతో వాటిని పార్ట్ బిలో రెవెన్యూ అధికారులు చేర్చారు. వీటితో పాటు ప్రభుత్వ, అటవీ, పోడు భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో రీ సర్వే జరిపాలని ప్రభుత్వం భావిస్తునట్టుగా సమాచారం. గతంలో పలు రాష్ట్రాల్లో భూ సర్వే విధానాలను అధికారులు పరిశీలించారు. అందులో బీహర్ రాష్టంలో అనుసరిస్తున్న విధానాలు పకడ్భందీగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. త్వరలో దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానున్నట్టుగా తెలిసింది.

బీహార్‌లో ఫలితాలిచ్చిన సమగ్ర భూ సర్వే
1910 తరువాత బీహార్ రాష్ట్రంలో జరిగిన భూ సమగ్ర సర్వే సత్ఫలితాలను ఇచ్చిందని రెవెన్యూ అధికారులు తమ అధ్యయనంలో గుర్తించారు. భూ సమగ్ర సర్వే అధునాతన అంశాలతో కూడుకున్నవి కావడంతో గతంలో సిసిఎల్‌ఏకు పనిచేసిన రేమండ్ పీటర్ బృందం బీహార్ రాష్ట్రంలో అవలంభిస్తున్న ఈ పద్ధతులను పరిశీలించింది. ఆ విధానం ఆచరణయోగ్యంగా ఉందని ప్రభుత్వానికి నివేదించింది. రెండేళ్ల క్రితం సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ నేతృత్వంలో సైతం ఓ కమిటీ గుజరాత్, హర్యానా, బీహార్ రాష్ట్రాలను సందర్శించి అధ్యయనం చేసింది.

త్వరలో ఈ విధానాలు శాసనసభ ముందుకు
2016 జనవరి 22న భూ సమగ్ర సర్వేకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం సర్వే సంస్థల గుర్తింపులో కొంత పురోగతిని సాధించింది. బీహార్‌లో జరిగిన సర్వేకు అప్పటి ప్రభుత్వం 2011లో రెండు బిల్లులను ఆమోదించింది. బీహార్ ల్యాండ్ మ్యుటేషన్ పారదర్శకంగా తక్షణం భూ యాజమాన్య హక్కులు లభించేలా నిర్ధేశిత గడువులో అన్ని వసతులను సమకూర్చింది. రాష్ట్రంలోనూ మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్లు, భూమిపై యాజమాన్య హక్కుల కల్పనకు ఇప్పుడు ఇవే విధానాలను ఆమోదించుకునేలా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఈ విధానాలను శాసనసభ ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్టుగా సమాచారం.

మరోసారి తెరపైకి జాతీయ భూ రికార్డుల ఆధునీకికరణ
జాతీయ భూ రికార్డుల ఆధునీకికరణ కార్యక్రమం మరోసారి తెరపైకి తెస్తున్నారు. గతంలో కేంద్రం నిధులిచ్చిన ఈ పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. తద్వారా భూములపై యాజమాన్య హక్కులతో పాటు (టైటిల్) వివిధ భూ వివాదాలకు చెక్ పడనుందని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో జాతీయ భూ రికార్డుల ఆధునీకికరణ ప్రాజెక్టులో భాగంగా కేంద్రం రూ.139 కోట్లను కేటాయించగా సకాలంలో వినియోగించని కారణంగా నిధులు వెనకకు మళ్లాయి. ఈ నేపథ్యంలో భూ రీ సర్వేకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 శాతంలో నిధులను ఖర్చు చేసేలా కేంద్రంతో సంప్రదింపులు జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.

రీ సర్వేతో కాలానికి అనుగుణంగా మారిన భూముల వాస్తవ స్థితిగతుల వివరాలు
రీ సర్వేతో కాలానికి అనుగుణంగా మారిన భూముల వాస్తవ స్థితిగతులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ ప్రాంత భూములకు సంబంధించిన లెక్కల చిక్కులు పూర్తిగా సమసిపోనున్నాయి. రీ సర్వేలో భాగంగా జిల్లాల వారీగా విస్తీర్ణం ఆధారంగా నిధులను అంచనా వేయనున్నారు. పూర్వపు హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రీ సర్వే చేపట్టనున్నట్టు తెలిసింది. పలు జిల్లాల్లో రీ సర్వే చేయనున్న భూముల తాలుకు వివరాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా                                 విస్తీర్ణం

వరంగల్                             9031
ఆదిలాబాద్                          8671
ఖమ్మం                              7387
రంగారెడ్డి                             6139
నల్లగొండ                            13,249
మహబూబ్‌నగర్                    15,242
మెదక్                               6584
ఖమ్మం                              11829

Land Survey Again in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News