Home మెదక్ ఏడుపాయలకు భారీగా భక్తుల తాకిడి

ఏడుపాయలకు భారీగా భక్తుల తాకిడి

god

*జాతర ముగిసినా తగ్గని భక్తుల తాకిడి
*వివిధ రూపాల్లో అమ్మవారికి మొక్కుల చెల్లింపు

మన తెలంగాణ/పాపన్నపేట : తెలంగాణలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి జాతర అనంతరం ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నర్సింహాచారి, శంకరశర్మలు ఉదయం వేకువజామున అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేసి వివిధ పూలతో అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులు ముందుగా మంజీరానదిలో పున్యస్నానాలు ఆచరించి ఆలయంలో వనదుర్గాభవానిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రూపాల్లో మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులు ఓడిబియ్యం, శివసత్తుల మేళాలతో, డప్పుచప్పుళ్ల వాయిద్యాలతో బోనాలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఆలయం ముందు గల సంతాన గుండంలో పిల్లలు కాని దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఏడుపాయల ప్రాంతంలోని చెట్లు, గుడ్డల కింద గుడారాలను ఏర్పాటు చేసుకొని సేదదీరారు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ చైర్మేన్ పి. విష్ణువర్ధన్‌రెడ్డి, ఇవో వెంకటకిషన్‌రావు, ఆలయ డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మినారాయణ, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ, బ్రహ్మచారిలు ఆలయానికి వచ్చిన భక్తులకు సేవలందించారు. భక్తులరద్ది ఎక్కువగా ఉండడంతో మెదక్ ఆర్టీసీ డిపో నుండి ఏడుపాయలకు ప్రత్యేక బస్సులను నడిపారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పాపన్నపేట ఎస్సై సందీప్‌రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసుబందోబస్తు నిర్వహించారు.