Home తాజా వార్తలు వరదనీటిలో కొట్టుకుపోయిన లారీ.. డ్రైవర్ గల్లంతు

వరదనీటిలో కొట్టుకుపోయిన లారీ.. డ్రైవర్ గల్లంతు

వరదనీటిలో కొట్టుకుపోయిన లారీ, గల్లంతైన డ్రైవర్
కుందనపల్లి వాగులో చిక్కుకుపోయిన 12 మంది రైతులు
హెలీక్యాప్టర్‌తో కాపాడిన రెస్కూ బృందాలు
నిండుకుండను తలపిస్తోన్న హుస్సేన్ సాగర్
దిగువకు నీరు విడుదల

Larry washed away in heavy floods in Siddipet

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధిపేట జిల్లాలో వాగును దాటేందుకు ప్రయత్నించిన ఓ లారీ ఆ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ సురక్షితంగా బయటపడగా, డ్రైవర్ మాత్రం నీటిలో కొట్టుకుపోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలం కుందనపల్లి వాగులో 12 మంది రైతులు చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు వెంటనే ప్రభుత్వం రెస్కూ బృందాలను వెంటనే అక్కడకు పంపించింది. సిఎం కెసిఆర్ ఈ సంఘటనపై మంత్రి ఎర్రబెల్లిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి హెలీక్యాప్టర్‌ను పంపించారు. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు రాకపోకలు స్తంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని, ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది. పలు గ్రామాల్లోని రోడ్లు కొట్టుకుపోవడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
రికార్డు స్థాయిలో 27 సెంటిమీటర్ల వర్షపాతం
రాష్ట్రంలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో 27 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మూడురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని రోజులు వర్షాల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో 27 సెంటిమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యింది.
జిహెచ్‌ఎంసి పరిధిలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
జిహెచ్‌ఎంసి పరిధిలో మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న ముసురుకు ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో తూము ద్వారా జిహెచ్‌ఎంసి లేక్స్ అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే అధికారులు కిందకు వదులుతున్నా నీటిమట్టం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ ముసురుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పలుచోట్ల రోడ్లపై వర్షంనీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిహెచ్‌ఎంసి పరిధిలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
24 గంటల్లో మరింత బలపడే అవకాశం
ఉత్తర కోస్తా, ఒరిస్సా, గ్యాంగేటిక్ పశ్చిమబెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు 7.6 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో సుమారుగా ఈనెల 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం కురిసిన వర్షపాతం వివరాలు ఇలా…
రాష్ట్రవ్యాప్తంగా శనివారం కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కుమురంబీం ఆసిఫాబాద్ 98.3 మిల్లీమీటర్లు, కరీంనగర్ 85, ములుగు 65.8, నాగర్‌కర్నూల్ 57, జనగాం 56.5, భద్రాద్రి కొత్తగూడెం 46.3, వరంగల్ అర్భన్ 40.6, సిద్ధిపేట 40.8, వరంగల్ రూరల్ 40.3, నిర్మల్ 36.5, హైదరాబాద్ 35.3, యాదాద్రి భువనగిరి 34, రంగారెడ్డి 33.5, కామారెడ్డి 33.3, జయశంకర్ భూపాలపల్లి 33, మంచిర్యాల 32, మహబూబ్‌నగర్ 32, రాజన్న సిరిసిల్ల 29.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Larry washed away in heavy floods in Siddipet