Home ఎడిటోరియల్ డిజిటల్ మీడియాపై వేటు

డిజిటల్ మీడియాపై వేటు

Latest on Smriti Irani's Target

పత్రికాస్వేచ్ఛ గొంతునులిమే ప్రయత్నాలపై విమర్శలు సద్దుమణిగి ఎంతో కాలం కాలేదు, దేశంలో డిజిటల్ మీడియాను నియంత్రించడానికి ప్రసారశాఖ మంత్రిణి స్మృతి ఇరానీ కొత్త స్కీముతో ముందుకు వస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇంటర్నెట్‌లో వెబ్‌సైటుల ద్వారా సమాచారం అందుబాటులోకి రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయాన్ని చాలా మంది గుర్తించనేలేదు. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన సిటిజన్ ల్యాబ్, కెనడియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లు కలిసి చేసిన పరిశోధనలో బయల్పడిన వాస్తవమిది. అత్యధికంగా వెబ్ సైటులను బ్లాక్ చేసిన దేశాల్లో అగ్రస్థానం భారతదేశానిదేనని తేలింది. ఈ రిపోర్టు ప్రకారం భారతదేశంలోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ ఫిల్టరింగ్ సిస్టములను అత్యధికంగా వాడుతున్నారు. అత్యధికంగా వెబ్ సైటులను బ్లాక్ చేశారు. ఇలా అత్యధికంగా వెబ్ సైటులను బ్లాక్ చేయడం, అత్యధికంగా ఇంటర్నెట్ ఫిల్టరింగ్ సిస్టములను వాడడం జరుగుతున్న పదిదేశాల్లో అన్నింటికన్నా పైన భారతదేశమే ఉంది. భారతదేశం తర్వాత ఈ జాబితాలో ఉన్న దేశాలు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, కువైట్, ఖతర్, సోమాలియా, సూడాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఎమన్. మీడియాను, ఇంటర్నెట్ ను అణిచేయడం ద్వారా ప్రజలకు సమాచారం అందుబాటులో లేకుండా చేస్తున్న దేశాలుగా మిగిలిన ఈ తొమ్మిది దేశాలపై ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నింటికన్నా ఎక్కువగా భారతదేశం ఇంటర్నెట్ ఫిల్టరింగ్, వెబ్ సైటులను బ్లాక్ చేయడం వంటి పనులకు పాల్పడుతోంది. ఈ దేశాల్లో ప్రభుత్వాలు ఇంటర్నెట్ ఫిల్టరింగ్, సెన్సార్ షిప్ కోసం ఉపయోగిస్తున్న వివిధ సాంకేతిక పద్ధతులను సిటిజన్ ల్యాబ్ పరిశీలించింది. ఫైర్ వాల్స్, కంటెంట్ సెన్సారింగ్ సొల్యూషన్స్ ఉపయోగిస్తున్నారు. కెనడాకు చెందిన కంపెనీ నెట్ స్వీపర్ అందించే వాటర్లూవంటి ప్రోగ్రాములను ఉపయోగిస్తున్నారు. ఈదేశాల్లో ఇంటర్నెట్ వాడకంలో కాంటెంట్ ఫిల్టరింగ్ కోసం ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఉపయోగిస్తున్న ఈ ప్రోగ్రాములు కేవలం చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నైతికంగా వివాదాస్పదమైన వెబ్ సైటులను మాత్రమే బ్లాక్ చేయడం లేదు. అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం సమ్మతించబడిన డిజిటల్ సమాచారాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ధార్మిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, స్వలింగసంపర్కుల హక్కులు, LGBTQ+, రాజకీయ సంస్థల సమాచారం వగైరాగల అనేక వెబ్ సైటులను బ్లాక్ చేయడం జరుగుతోంది.
సిటిజన్ ల్యాబ్ వివిధ దేశాల్లో నెట్ స్వీపర్ ఇన్ స్టాలేషన్ కనుగొనడానికి ఐపి స్కానింగ్, నెట్‌వర్క్ మెజెర్‌మెంట్ డేటా తదితర టెక్నికల్ పరీక్షలు లోతుగా నిర్వహించింది. ముందు 30 దేశాలను కనుగొని అందులో అత్యధిక ఇన్ స్టాలేషన్లున్న 10 దేశాల జాబితాను తయారు చేసింది. ఇంటర్నెట్ ప్రొవైడర్లు ఈ పది దేశాల్లో ఎలా సమాచారాన్ని అడ్డుకుంటున్నారన్నది పరిశీలించింది. ఈ పరిశీలనలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కన్నా దారుణంగా భారతదేశంలో సెన్సార్ షిప్ నడుస్తోంది. ఇండియాలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఫైర్ వాల్ తదితర కంటెంట్ ఫిల్టరింగ్ పద్ధతులను విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, 12 ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సంస్థలు 42 ఇన్ స్టాలేషన్స్ ఉపయోగిస్తున్నాయని సిటిజన్ ల్యాబ్ కనుగొంది. అనేక వెబ్ సైటులను ఈ విధంగా బ్లాక్ చేయడం జరుగుతోంది.
భారతదేశంలోని ప్రధానమైన ఇంటర్నెట్ ప్రొవైడర్లు, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, హ్యాత్ వే, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్స్, టాటా స్కై బ్రాడ్ బ్యాండ్, టెల్ స్ట్రా గ్లోబల్, పసిఫిక్ ఇంటర్నెట్, నెట్ ఫర్ ఇండియా, ప్రైమ్ సాఫ్టెక్స్ వగైరా అందరూ నెట్ స్వీపర్ ఫిల్టరింగ్ సిస్టమ్ ద్వారా సైటులను బ్లాక్ చేస్తున్నారు. గమనించవలసిన విషయమేమంటే, ఇంటర్నెట్ ప్రొవైడర్లు సమాచారాన్ని అడ్డుకోడానికి ఉపయోగిస్తున్న ఈ ప్రోగ్రాములు, సమాచారాన్ని సెన్సార్ చేయడానికి అవలంబిస్తున్న ఈ పద్ధతులన్నీ కేవలం టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చెప్పడం వల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం చెప్పడం వల్ల సెన్సార్ చేస్తున్నారు. ఈ సెన్సార్ షిప్ ఎంత భారీగా కొనసాగుతుందంటే మిగిలిన దేశాలతో పోల్చితే రెట్టింపుగా ఉంది. పాకిస్తాన్ లో ఇన్ స్టాలేషన్లు కేవలం 20 మాత్రమే, బహ్రెయిన్ లో కేవలం 16 మాత్రమే. ఈ రెండు దేశాలు ఇండియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు దేశాల్లోని ఇన్ స్టాలేషన్లను కలిపినా ఇండియా స్థాయిలో లేవు. ఇండియా మొత్తం 42 ఇన్ స్టాలేషన్లను ఉపయోగిస్తోంది.
ప్రపంచంలో అత్యధికంగా సెన్సార్ షిప్ చేస్తున్న దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పేరుపడింది. కాని అక్కడ నెట్ స్వీపర్ ఇన్ స్టాలేషన్లు కేవలం మూడు మాత్రమే. అంటే ఎమిరేట్స్ కన్నా 15 రెట్లు అధికంగా ఇంటర్నెట్ సెన్సార్ షిప్ ఇక్కడ జరుగుతోంది. అత్యధికంగా నెట్ స్వీపర్ ఇన్ స్టాలేషన్లు ఉపయోగించడమే కాదు, దేశంలో వెబ్ సైటులను బ్లాక్ చేయడం కూడా చాలా ఎక్కువ. దేశంలో 1158 వెబ్ సైటులను బ్లాక్ చేశారు. ఈ జాబితాలోని మొత్తం పది దేశాలు బ్లాక్ చేసిన మొత్తం వెబ్ సైటుల సంఖ్య 2464. అంటే దాదాపు సగం వెబ్ సైటులను బ్లాక్ చేసిన ఘనత మనదే. ఎలాంటి సమాచారాన్ని బ్లాక్ చేస్తున్నారన్నది కూడా ముఖ్యం. ఈ పరిశోధనలో తెలిసిన సమాచారం ప్రకారం, యునైడెట్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఎమన్‌లలో స్వలింగ సంపర్కానికి సంబంధించి “గే”, “లెస్బియన్‌” పదాల గూగుల్ సెర్చ్ బ్లాక్ చేశారు. కువైట్ లో “అబార్షన్‌” కు సంబంధించిన వెబ్ సైటులన్నీ బ్లాక్ చేశారు. బహ్రెయిన్, ఖతర్, సూడాన్, సోమాలియా, పాకిస్తాన్‌లలో రాజకీయాలకు, రాజకీయ విమర్శలకు సంబంధించిన వెబ్ సైటులను బ్లాక్ చేశారు. భారతదేశంలో, చైల్డ్ పోర్నోగ్రఫీ, పైరేట్ వెబ్ సైటులను బ్లాక్ చేయడమేకాదు, బర్మాలో ముస్లిముల ఊచకోతలు, భారతదేశంలో మైనారిటీలపై దౌర్జన్యాలు, అధికారుల కుట్రలను బట్టబయలు చేసే సమాచారం, విదేశీ ఎన్జీఓల వెబ్ సైట్‌లు, మానవహక్కుల సంఘాల వెబ్ సైటులు, ఫెమినిస్టు గ్రూపులు, రాజకీయ గ్రూపుల వెబ్ సైటులను కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇందులో ఏబిసి న్యూస్, ది టెలీగ్రాఫ్ (యుకే), అల్ జజీరా, ట్రిబ్యూన్ (పాకిస్తాన్) వంటి వార్తాసంస్థలకు చెందిన వెబ్ పేజీలు, రోహింగ్యా శరణార్ధులకు సంబందించిన సమాచారం, బర్మాలో, భారతదేశంలో ముస్లిముల మరణాలకు సంబంధించిన సమాచారం ఉన్న వెబ్ పేజీలను కూడా బ్లాక్ చేశారు. ఈ పేజీలను 2018 జనవరి తర్వాతి నుంచి బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సిబిసి న్యూస్ ప్రకారం ఫేస్ బుక్‌లోను శరణార్ధుల సమస్యపై చర్చించే గ్రూపులను బ్లాక్ చేసే ప్రయత్నాలు జరిగాయి. కాని ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్ల వల్ల అవి అందుబాటులో ఉన్నాయి. ఇలా సమాచారాన్ని అడ్డుకోవడమన్నది దేశంలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛలను నిరాకరించడమే. ఈ సెన్సార్ షిప్‌ను ఇలా కొనసాగనిస్తే దానివల్ల అనేక హింసాకాండలకు, విద్వేషానికి సంబంధించిన నేరాలు మరుగున పడిపోతాయి. నేరస్థులు శిక్షలు తప్పించుకు తిరుగుతారు. ఫలితంగా సమాజం ముక్కలు చెక్కలవుతుంది. కశ్మీరులో ఇంటర్నెట్ పై పూర్తి నిషేధం, మిగిలిన చోట్ల ప్రజలకు డిజిటల్ సమాచారం అందకుండా ఫిల్టరింగ్, సెన్సార్ షిప్ ప్రయత్నాలు ఇవి భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమైనవి. మిగిలిన దేశాలన్నింటి కన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ఇంటర్నెట్ లో వెబ్ సైట్‌లను భారతదేశమే బ్లాక్ చేస్తుందని, మిగిలిన దేశాలన్నింటి కన్నా ఎక్కువగా కంటెండ్ ఫిల్టరింగ్ కోసం నెట్ స్వీపర్ ఇన్ స్టాలేషన్లు ఉపయోగిస్తుందని ఈ అధ్యయనంలో తెలిసి వచ్చింది. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం.