Friday, April 19, 2024

లిల్లీతో స్నేహం ఎలా అయిందంటే!

- Advertisement -
- Advertisement -

love

“లిల్లీతో నాకు పరిచయం యెట్లా అయిందం టే!” అన్నాడు దామోదర్రావు, నేను పందిట్లో కి వచ్చేటప్పటికి. “దామోదర్రావుగారు ఏమిటో శలవిస్తున్నారే” అన్నాను. “వుండరా, నోరు మూసుకువిను” అన్నాడు కుమారస్వామి.
“వింటాను! మొదటి నుంచి చెప్పమను” అన్నాను. దామోదర్రావు రిటైర్డు స్కూళ్ల డిప్యూటీ యిన్‌స్పెక్టరు. వయస్సులో ఆయన రూపము షోకు తలచుకొని మురిసే ముసలమ్మలు ఇంకా ఉన్నారు. ఎన్నో కథలు చెప్పుకుంటారు, ఆయన సాహస దృశ్యాలను గురిం చి. అందరం కౌసల్య పెళ్లికి చేరుకున్నాం. మేము గోల చెయ్యగా చెయ్యగా ఆ రాత్రికి రెండు ‘తెల్లగుర్రాల’ బండ్లు తెప్పించారు పెళ్లివారు.

అర్థరాత్రి దేవీపూజకు చేరేము. అంతకుముందే నేను సోడా కొట్టుకు వెడుతూ దామోదర్రావుగారూ! నేను యీ మధ్య మీ చిన్నతనంలో తీసుకున్న ట్రయినింగు స్కూలు ఫొటో చూచాను. మీ కోరమీసాలు, మీ కరకు చూపులు, ఏమి గొప్పగా ఉన్నారండీ! చెయ్యి చూపిన చోటల్లా పంతులమ్మలు చిక్కేరంటే ఒక వింతా? కానీ! యిప్పుడు మిమ్మలను చూచి ఆ రూపం ఇమేజిను చేసుకొనుట కూడా కష్టమేనండీ” అన్నాను. నీళ్లు పోసుకోకుండానే ఒక గ్లాసు కొట్టేశాడు. “ఒరేయి, జాగ్రత్తగా దాచుకున్నానురా, ధనాన్నిగానీ, రూపాన్నిగానీ, ఆరోగ్యాన్ని గానీ ఈనాడు అర్భకపు వెధవలకు ఈ ప్రివెన్షనులు, ప్రొహిబిషన్లు, ఈ భయాలు! ఎందుకు పనికొస్తారు మీరు? అప్పుడు కాదు, ఈనాడు భాలన్జి” అంటూ ఉండగా నవ్వుతూ పరుగెత్తాను. సోడాలు తీసుకొచ్చేటప్పటికి కథ ప్రారంభించాడు.

“పొనమ్మ స్కూళ్ల ఇన్‌స్పెక్టర్ డిపార్టుమెంటల్‌గా అక్కడడక్కడ కలుసుకోవడం ద్వారా పరిచయమయింది మాకు. క్యాంపులకు పల్లెటూళ్లలో త టస్థపడేవాళ్లం. పట్నాల్లో పలకరించుకున్నది వేరు. క్యాంపుల్లో ఒకరి సహాయం లేకుండా ఇంకొకరికి గడవదు. ఒకరి దగ్గర స్టౌవ్ లేకపోతే ఇంకొకరి దగ్గర కాఫీపొడి అయిపోతుంది. ఒకరు చక్కెర యిస్తే ఇంకొకరు దీపమిస్తారు. అట్లానూ.” ఆ రోజు మధ్యాహ్నం బస్సుకోసం ఎదురుచూస్తూ ఒక చెట్టు క్రింద నిలుచున్నాము. “బస్సుల్లో వెళ్లే మనం, రోడ్డు వెంబడి మైళ్లకు మైళ్లు నడిచే వాళ్ల కష్టంగాని, సుఖంగాని, యెరగం కదా? ఇరికి, ఇరికి ఒత్తుకొని కూచుంటాము. ప్రయాణం ఎప్పుడు ఆఖరౌతుందా అని విసుక్కుంటో, ప్రపంచపు స్వేచ్ఛ వాళ్లది. ఆడవాళ్లు, మగవాళ్లు, అదివరకు మొదలెరగని మనుషులు కూడా, స్వచ్ఛమైన గాలిలో నవ్వుతూ, ఆనందం పరాచకాలాడుతూ, పోతూ ఉంటారు. సాయంత్రపు చల్లగాలి ఉదయపు మంచు, మధ్యాహ్నపు నీడల చల్లదనం, ఆ సౌఖ్యాలు వాళ్ల సొమ్ము, ఎంత విప్పి మాట్లాడినా, పరియాచకం కిందే తీసుకొని మాటకుమాట అంటిస్తారు ఆడవాళ్లు.

కాని ఈ ఆఫీసు బెంగలు ఆదుర్దాలు ఉండవు. స్త్రీ అన్ని మైళ్లు వెంటనడిచి తనతో నవ్వుతున్న మగవాడు అక్రమమైన చనువు తీసుకోడు. తీసుకునే బుద్ధే కలగదు చదువుకున్న వాళ్లలో. కొత్తవాడు పలకరించగానే, వాడి మాట చెవిమీద కాక, చెయ్యిమీద పడ్డట్టు అదిరిపడి, డిఫెన్సులలో ఉంటారు ఆడవాళ్లు. పరిచయమయిందా అర్థం లేని నమస్కారాలు, సారహీనమైన డిపార్టుమెంటు కబుర్లు నిజంగా ఇంటరెస్టులేని వార్తలూ, అని కూడా ఆలోచించి, తూచి మాట్లాడతారు. సహజంగా కాకులవలె, చీమలవలె కూడా సంభాషించుకోవడం మరచేపోయినాము, వెధవ బ్రతుకు, సెక్సు ఇంటరెస్టు కలిగినా, సహజంగా కోర్కె తెలియజెయ్యడమూ, నిర్భయంగా నిరాకరించడమూ లేనేలేవు” అన్నాను. ఆమె చక్కని కళ్లను వాల్చి మాట్లాడకనుంచుంది. “అప్పుడే కోపం తెప్పించినట్టున్నాను నా మాటలతో. ఊసేనా, కొంచెం చనువుగా మాట్టాడనిచ్చినందుకు, అప్పుడే అటువంటి సంగతులు మాట్లాడుతున్నాడో! అనుకుంటున్నారు. “కాదు మీ మాటల్లోని యదార్థం యోచిస్తున్నాను. బస్సులో ఒక్కరూ ఇంగ్లీషు వచ్చిన మొహాలు కనపళ్లేదు. మేము సంభాషణను ఇంగ్లీషులో కంటిన్యూ చేశాము. ప్రేమ వివాహం, వీటి విషయమై నేను విప్లవోద్దేశ్యాలు కలవాణ్ణని ఆమెకు చెప్పాను. కాని తెలియనట్లే నటిస్తోంది. నాకు ఆమె శరీరం కన్నా మనసు ముఖ్యం. ఆమె కేరక్టర్ మీద ఇంట్రెస్ట్ యెక్కువయింది.

“మీరిన్ని యేళ్లు జీవించారు. యౌవనమూ, ఆకర్షణా యిక ఉంటే అయిదారేళ్లో ఉంటాయి. తర్వాత ఉద్యోగమూ, మర్యాదా, గౌరవమూ ఉంటాయి. దూరంగా నుంచుని వందల కొలది పూలమాలలు భక్తితో వేస్తారు. కాని వేళ్లు తగిలిస్తో మీ మెడలో పూలమాలవేసి ఆ కొత్త అందాన్ని ఆరాధించడం వుంటుం దా? కొందరు, ఎవరో ఒక్కరు తృప్తి పొందుతారు. అధికారమూ ఉద్యోగము వున్న తక్కిన వాళ్లందరికి ఐశ్వర్యమూ, అధికారమూ, సౌందర్యమూ, బలమూ అన్నీ మరియింకో ప్రియతమైన ప్రాణికి ఆనందం కలిగించేందుకు సాధనాలే. అట్లాంటి ప్రేమ నెరగని వాళ్లు స్వార్థమనే యినుప కవచంలో నివసించారన్నమాట” అన్నాను.

“నేను యీ టీచర్లను ప్రేమిస్తున్నాను. చాలామందికి సహాయం చేస్తాను. చదివిస్తాను” అంది. “నాకు తెలుసు. అది ఒక స్వార్థం అధికారం. వాళ్లమీద ప్రేమవుందా? మిమ్మల్ని, మీ సౌఖ్యాల్ని మరచి వాళ్ల ఆనందం మీదిగా చేసుకోగలరా? లోకుల మీద యే యోగులకో, ఋషులకో అట్లాంటి ప్రేమ వుంటుందంటారు. అది ఆదర్శం. కాని సామాన్యుడికి ఒక్క సెక్సు ప్రేమలోనూ, దానికి సంబంధించిన పిల్లల మీద ప్రేమలోనే సాధ్యమవుతుంది. ఆ రెంటిని యెరగని బతుకు వాన నెరగని యెడారి.” ఆమెకు నా మాటలు శూలాలవలె గుచ్చుకున్నాయి. ఆమె అంతరాత్మ తెలీని భాషలో చేసే ఆర్తనాదాన్ని నేను తర్జుమా చేసి చెప్పినట్టు తోచిందిగావును. అందికదా కాని ప్రేమను అనుభవిద్దామన్నా, పిల్లల్ని ప్రేమించాలి అన్నా, మగవాళ్లతో సంబంధం అవసరమవుతుంది. చాలా చనువైన సంబంధం, వాళ్లచేతికి అధికారాన్ని వప్పజెప్పే సంబంధం ఆ పురుషులా, పశువులు, క్షమించండి.”
“ఎట్లా?”
“మీకే స్త్రీతో సంబంధం కలిగితే అధికారం మీది. నాకు అట్లా కలిగితే, అధికారం అతనిదీ.”
‘ఏమీ!అధికారమిస్తేనేం? సర్వమూ ప్రేమించిన వారి చేతుల్లో పెట్టి, ఆ ఒక్క ఆలింగనంలో తను జీవిస్తున్న సంగతి మరవడం కన్నా స్త్రీకి పరమావధి
వుందా? ”
“కాని ఔన్నత్యంగల పురుషుడు దొరకవద్దూ! పెళ్లే చేసుకొన్నాననుకోండి. నన్నంటి పెట్టుకుని నాతో తిరగాలి ఆ మనిషి. అతనికేం గౌరవముంటుంది? నాకు మాత్రం అతని మీద ఏం గౌరవముంటుంది? ఇంకా ఆయన ఇల్లంతా సిగరెట్లు, కుర్చీలనిండా ఇంటినిండా మాసిన బట్టలు, ఆయన స్నేహితుల అల్లరి, తగాదాలు, అప్పుడపుప్పుడు తాగుడు. నా మీద అనుమానాలు, ఆజ్ఞలు పట్టుకుంటే వొదుల్తాడా! అందరిముందు చవక చేస్తాడు. బడాయిగా చెప్పుకుంటాడు. నేను తిరగబడ్డానా, నన్ను వొదిలేసిపోతాడు. అంతకన్నా యీ వొంటరి సుఖమే నయం. ఇవికాక ఇంకా పెద్దభయాలు మీకు తెలీనివి కావు.”
“వాస్తవమే. మీరు అనుభవంతో మాట్లాడుతున్నారు. నాది వొట్టి థియరీ.”
“నన్ను వెక్కిరించకండి నేను చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నాను.” కళ్లల్లో నీళ్లు కమ్మేయి. జొన్న చేల మధ్యనించి పోతోంది బస్సు. ఆ వొంగిన చేల మీద కమ్మిన సాయంత్రపు శాంతి నా హృదయాన్ని కలవరపెడుతోంది. “పాపం! మీకు తగిన మీ ఆత్మకు సంతుష్టినివ్వగలిగిన అనుభవం అవలంభించాలని మనఃపూర్వకంగా కోరుతున్నాను. అది మరిదేన్నో, ఈశ్వరకరుణో, ఎట్లా కలుగుతుందో మరి!”
“లాభం లేదు. కాలం మించిపోయింది. చిన్నతనపు ఆరోగ్యంలో చిన్నచిన్న గాయాలు లెక్క చెయ్యం, అట్లానే యౌవ్వనపు, ప్రేమలో ఈ లోపాలని లక్షపెట్టక ప్రేమించగలం. కాని ఇప్పుడు చిన్ననొప్పిగాని, చిన్నలోపంగాని సహించడం కష్టమవుతుంది. పరిపూర్ణత లభించదు మానవమాత్రులకు.
“కాని మీరట్లాంటి భయాలతో లోకాన్ని అనుమానంతో చూడకూడదు. గులకరాళ్లేకదా అని కళ్లు మూసుకుంటే, ఎన్నడో విలువగల రత్నం లభించే ఛాన్సు పోతుంది.”
“ఏమో నాకు ఆశలేదు. ఏమిటీ! మగవాళ్లయినంత మాత్రాన నేనెందుకు విరో ధం చూపాలి, అని కొంచెం స్నేహంగా, స్వేచ్ఛగా మాట్లాడితే, అప్పుడే, ఆనాడే, విక్టరీ తగాదాలన్నట్టుగా అనవసరపు విజిట్సు నాకు. తమ మీద ఆ విధంగా ఇష్టపడ్డానో లేదో తెలుసుకోగల విచక్షణ లేదు. పెద్ద పొట్టలు వేసికొని పీల్చుకుంటో వెకిలిచూపులతో, మాటలతో తయారు…”
“ఏదీ మీ ఫోటో వుందా?”
“ఈసారి క్యాంపు ఎక్కడ?”
“ఇంట్లో మీకొక్కరేనా?” అని అడుగుతో ఉండే నా స్లిప్పరు తీసి మొహం మీద విసిరివెయ్యాలని వుంటుంది. నాకే మొగవాడు కావలిస్తే, పనిచేసే చాకలివాడు, ప్యూన్ నయం వీళ్లకంటే. పెద్ద అద్దం వాళ్ల ముందు పెట్టి చూసుకోండి, మీ అందం అనాలనిపిస్తుంది. “రాత్రి ఎన్నింటికి పడుకుంటారు! ఒకవేళ నిద్రపట్టకపోతే యిట్లా వస్తా, సినిమాకి వస్తారా?” అని కొందరు. నేను కొన్నాళ్లు పెయిం ట్ చేశాను. అందువలన శరీరం వొంపులు చప్పున గుర్తుపట్టగలను. ఇంక యౌవనులు, కొత్తగా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పేసైనవాళ్లు, ఈ కవులూ, కథకులు వస్తారు. మా అక్క కొడుకు పార్వతీశం తీసుకొచ్చేవాడు. వాళ్ల మాటలు ఎంతసేపూ ఈ మిస్ ఆ మిస్, అందరూ తనని ప్రేమించడమే. లక్షాధికార్ల కూతుళ్లు, దివానుల కుటుంబం వాళ్లు, ఇంగ్లీషు కన్యలు, నర్సులు. మరి అంత గొప్ప పిల్లలు తమని ప్రేమిస్తూవుంటే, సుఖంగా వాళ్లని పెళ్లిచేసుకోక ఈ గుమాస్తా పనులకి ప్రయత్నాలెందుకో తెలీదు.
“నేనండి. శామలాచటర్జీని కలిసికొని మాట్లాడాను. యీ మూవ్‌మెంటును గురించి అంటారు. ఏ శ్యామలా! ఆక్స్‌ఫర్డ్‌లో ఆరేళ్లు చదివి, ఇప్పుడు మూవ్‌మెంట్‌లో జైలుకు వెళ్లిన నాయికరాల్ని గురించి! ఆమె నన్ను చూసి వదలదండీ. నా సెక్రటరీగా వుండు’ అని చాలా ప్రేమతో చెయ్యి పట్టుకుందట! వాడి మొహం చూడవలసింది మీరు! ఇన్ని దేశాలు తిరిగి, రోజుకు ఇంతమందిని చూసే ఆమెకి, లోకం కొల్లబోయి, మీ చుంచుమొహంవాడే దొరికేడట! ఏం అహంభావాలంటారు? వీళ్ల తాహతు? సైన్స్ ఆఫ్ ప్రపోర్షన్ పోతుంది వీళ్లకి.” ఆమె మాటలు వింటే నాకు భయం వేసింది. ఇంత విచక్షణా, స్వతంత్రమూ, ఆమెలో వున్నాయనుకోలేదు. నా మామూలు మాటలలో స్త్రీ యౌవనమూ కోర్కె ప్రాతివత్యం మాట్లాడి తబ్బిబ్బు చేసి తమాషా చూద్దామనుకున్నాను. అదృష్టవశాత్తు ఎన్ని గారెలు తిన్నా, నాకు బొర్ర రాలేదు. వచ్చివుంటే బస్సులోంచి దూకి పారిపోదును.
“మాట్లాడరేం.”
“ఏమీ తోచటం లేదు.”
“మిమ్మల్ని అంటున్నాననుకున్నారా?” షర్టు కింద చూచుకున్నాను.
“మొన్న ఇద్దరు ప్లీడర్లండీ. పక్క కంపార్టుమెంటులో ఎక్కారు.”
ఎవరూ లేరురా, ఇంట్రడ్యూస్ చెయ్యడానికి అంటారు. ఇంట్రడ్యూస్ చెయ్య డం, రావడం, నాతో కూచోడం, జయించడం… ఇట్లా ఉంటుంది ధోరణి.
“ఇంక తిట్టకండీ మొగవాళ్లని.”
“మిమ్మల్ని కాదండీ!”
“నేనూ అందరిలాంటి వాణ్నే.”
“కాదనుకునే మాట్లాడుతున్నాను. పొరబడ్డానేమో!”
“ఏమైతేనేం! పురుష రక్తమే!”
“మీరు వేరని నా నమ్మకం. అందుకనే ఇంతదూరం మాట్లాడాను. ఇట్లా మాట్లాడి నా మనస్సు కనుక్కోవాలనే మొదలుపెట్టారు. అవునా? వొప్పుకోండి.”
“నిజమేమిటి?” అని ప్రశ్నించుకున్నాను.
“మొదట ఆ ఉద్దేశ్యం లేదుకాని పూర్తిగా లేదనటం నిజం కాదు.”
“ఎక్స్‌పెరిమెంట్ చూద్దామా?”
“ఏమిటి?”
“ప్రేమ”
“ఉఁ”
“కాని అదే బంధమవుతుందని భయం. అది మన స్వభావంలోనే ఉన్నది. హృదయాన్ని అర్పించకుండా అనుభవిస్తే ఆనందం లేదు. హృదయాన్నిస్తే బానిసత్వం, విరహం, ఈ బాధలన్నీ వెంటనే వస్తాయి.”
“కాదు, నేను బంధం కానీను.”
“మీరామాట అంటే అప్పుడే నాకు బాధ యింత త్వరగా తప్పుకోగలవాడు నన్నేం ప్రేమిస్తున్నారని చూశారా!” బస్సాగుతోంది. “మా యింటికి రండి త్వరలో. తక్కింది మాట్లాడుకుందాం. విజిట్ అనుకోనులెండి.”
మొదట నుంచీ కూడా మా సంబంధం స్కాన్‌డల్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డది పొన్నమ్మ. నన్ను చాలా జాగ్రత్తగా ఉండమని బతిమాలేది. “మీరు చెప్పే స్వేచ్ఛలో వుండే ఆనందం నేనెరక్కపోలేదు. కాని ఆ ఆనందం కన్న పనిలేని వాళ్ల ఆక్షేపణలూ, నీచపు మాటలూ, చాలా కష్టాల్ని తీసుకొచ్చి, మన ప్రేమనే నీచంగా చూపిస్తాయి. బాధలు తిట్లూ అనుభవించి ప్రపంచాన్ని సంస్కరింపవలసిన ధీరులు అవసరమని వొప్పుకుంటున్నాను. కానీ నెనట్లాంటి ధీరురాల్ని కావాలని నాకేమి కోర్కెలేదు. ఒక్కమాట ఎవడైనా నన్నంటే వారం రోజులు బాధపడి, ఆ ఊరు విడిచి పారిపోతాను” అన్నది. ఆర్నెలయింది. మా ఎక్స్‌పెరిమెంట్ పూర్తి అయ్యే కాలం వచ్చిందని తోస్తుంది. కాని నాకు చెప్పటానికి ధైర్యం చాలటం లేదు. ఆమెకు చాలా బాధ కలుగుతుందని తెలుసు. ఆమె మనసులో ఎంతో ఉత్సాహమున్నా, శరీరం తిరగబడుతోంది. ఇన్నాళ్లు నిర్లక్షం పొందిన కసిని శరీరం ఈనాడు తీర్చుకుంటోంది. ఓ ఉదయం నా ఆఫీసులోకి ఇరవైయ్యేళ్ల అమ్మాయి వచ్చింది.
“ఎవరు”
“నా పేరండి లిల్లీ”
కొంచెంసేపు ఆమె అందం చూస్తూ నుంచున్నాను. హంపిలో విగ్రహాలను చూశాను. నా చూపులకి సంతోషానిచ్చింది ఆ జఘనము. నేననుభవించిన అందం వెనక, ఏ మాత్రం నా మనసు భ్రమపడలేదని చెప్పగలను. ఏం అంత అందాన్ని చూసి మాత్రం దుర్మార్గపు ఆలోచనలు రావొచ్చునా అనుకొని పెదవి విరుస్తారు మీరు. మీకు రావా: నిజం చెప్పండి” అంటున్నాను నేను. “రావు” అని అంటారా, మిమ్మల్ని చూస్తే జాలి పడతాను. జాలికి రెండు మూడు కారణాలున్నాయి. దాంట్లో ఏ కారణం వల్ల మీరంత పవిత్రులైనారా అని ఆలోచించుకుంటున్నాను. ఆలోచనలు వచ్చినా, మేము ఏదో మరచిపోతాము కాని అనుభవిస్తామా అంటారు. నాకు లభ్యమయింది కనుక అనుభవించాను. మీకు లేదు. అదృష్ట భేదం తప్ప, నీతిభేదం కాదు, పవిత్రవంతులైన మీకూ పాపాత్ముడైన నాకూ. కొంతసేపు తేరిపార చూస్తూ కూర్చున్నాను మాట్లాడక.
“ఏమిటి?”
‘నా ఉద్యోగం పోయింది. నేను టీచర్ని. నా మీద నిందలు రాసి, గిట్టనివాళ్లు తీయించేశారు.”
“నన్నేమి చేయమంటావు?”
“తమరి దయ”
“ఏమిటి నా దయ! నేనేం చెయ్యను?”
“అమ్మగారితో తమరు చెపితే,”
“ఏ అమ్మగారూ?”
“ఇన్స్‌పెక్టర్ దొరసానిగారు.”
“ఆమెనా తీసేసింది?”
“ఆమె మా మేనేజరు చేత తీయించేశారు.”
“నేను చెపితే ఆమె యెందుకు వింటుంది?”
“ఆమె నెరుగుదురు కదా!”
“ఎరిగి వుంటే మాత్రం!”
మాట్లాడలేదు.
“మా రహస్యం వెల్లడయ్యిందా?”
“నాకు తెలీదు వెళ్లు.” కన్నీళ్లు పెట్టుకుంటూ నుంచుంది.
“ఏమని అర్జీపెట్టారు నీ మీద?”
“నా నడత మంచిది కాదని.”
“మంచిదేనా?” నవ్వాను.
“ఏం చెప్పను?” అంది. అవినీతికి తీసివేసిందా, పొన్నమ్మ!
“నేనె చెపితే ఆమె వింటుందా?”
“వింటారండి. నాకు తెలుసు.”
“ఏం తెలుసు”
“తెలుసులెండి” అంది చిరునవ్వుతో.
“తెలిస్తే యింకేం! మరి నీకు పని యిప్పిస్తే నాకేమిస్తావు?”
“నేనే మివ్వగలనండి?”
“ఇవ్వగలిగినదే”
“ఇస్తాను”
“మాట తప్పవు గదా?”
“తప్పను.”
సాయంత్రం పొన్నమ్మ దగ్గరికి తీసుకువెళ్లేను.
“ఏమిటి, లిల్లీ నీకెట్లా తెలుసు?” అంది ఇంగ్లీషులో.
“నా దగ్గరకు వొచ్చింది. పాపం! పని తీసేశావుటగా.”
“కారణం కూడా చెప్పలేదా. లిల్లీ నీతో?”
చెప్పింది. కాని ఆ కారణం నీకు కోపం తెప్పించిందా?న్యాయంగా తోచిందా?
“ఏం చెయ్యను, పిటీషన్లు వస్తే?”
“కాని నీకు యిష్టంలేకపోతే, నువ్వు నమ్మవలసిన అవసరమేముంటుంది
‘కాని చూడు! అదేం టీచరు? ఎన్నాళ్లు పనిచేస్తుంది. అలాంటి దాన్ని బోధనలకు పసిపిల్లల్ని ఎట్లా వప్పజెప్పగలము?”
“నువ్వుకూడా అట్లా అంటే?”
“నేనుకూడానా? అంటే అర్థమేమిటి?”
“నువ్వే యోచించుకో” ఆమెకి కోపం వొచ్చింది.
“నేను మొదట్లోనే చెప్పలేదూ? మగవాళ్లకి హక్కుల్ని యిస్తే చవకైపోతామని, చదువుకున్నవాళ్లం యోచించి మనసు వున్న మనకీ యీ పశువులకీ….”
“సరే మనం వాదించుకుందాం గాని, ముందు ఆమెని పంపేయి.”
“పొమ్మను”
“ఉద్యోగమిస్తానను.”
“వీల్లేదు, నిశ్చయం.” లిల్లీని వెళ్లమన్నాను. వెళ్లింది.
మాట్లాడకుండా కూర్చున్నాము.
“భర్తలున్న స్త్రీలు ఎందుకు పురుషులతో వెడతారో నాకు అర్థం కాదు, కావాలసింది దేహసౌఖ్యం. అది తీరితే ఇంకేం అవసరం!” అంది.
“కాదు, అనేక కారణాలున్నాయి. మగవాడు స్త్రీని కోరడమో?”
“అదీ నా కర్థం కాదు.”
“రోజూ గోంగూరపచ్చడి తింటే యెట్లా వుంటుంది? భార్య అన్నం. అది మామూలు. అది లేంది భోజనం లేదు. తక్కిన వ్యవహారాలు ఆధరవులు. అవి లేంది అన్నం రుచించదు. వాటి సహాయంతో ఎక్కువ అన్నం తింటాం. అది భార్యలు గుర్తించరు. “చిరుతిండి మరిగి అసలు అన్నం తినడం మానేసేవారూ లేరూ?”
“వారు అవివేకులు, చిన్నపిల్లలు చేసేపని అది. వాళ్ళకి అజీర్ణం తప్పదు.”
“ఆడదానికి ?”
“ఆడదానికి వేరు….. కొందరికి తప్ప.”
“ఏమో?”
“స్త్రీ విషయంలో ఎక్కువ కష్టాలున్నాయి.”
“ఎవరు తెచ్చి పెట్టినవి?”
“సంఘం.”
“అంటే పురుషులు.”
“ కావచ్చును. కాని బాధలు, సమస్యలు ఎక్కువైన మాట నిజం. కారణం మేమైతేనేం. అదికాక నాగరికత లేని వాళ్ళు పుట్టి అన్నం తిని తృప్తిపడగలరు. చాలా మంది స్త్రీలు ఇంకా నాగరికత పొందనేలేదు. కొద్దిమందికే వివిధ రుచుల మీద ఆశ వుంది. అట్లాంటి వాళ్లని అనుభవించనీ, అందువల్ల సంఘమూ భర్తా కలిగించే బాధలు పడనీ.”
“మొత్తానికి భర్తలు వున్న స్త్రీలు ఇతర పురుషులను వాంఛించడం క్షమించదగిన పనిగాదు.”
“లిల్లీకి పెళ్ళయిందా?”
“ఆ”
ఆ రాత్రికి ఇంకేమి మాట్లాడటానికి నాకు బుద్ధి పుట్టలేదు.
ఇంటికి వెళ్లేటప్పటికి లిల్లీ నా కోసం కాసుకుని వుంది.
“లిల్లీ, నీకు పెళ్ళి అయిందట కదా?
“అయింది, కాని ఆయనకూ నాకూ సంబంధం లేదు.”
“ఆయన ఎక్కడ వున్నాడు?”
“ నా యింటిలోనే కాని సంబంధం లేదు… ఏమన్నారండీ?”
“ ఆమె, నా మాట వినడం లేదు”
“ నాకు వుద్యోగం లేకపోతే మళ్ళీ ఆయన చేతుల్లో చిక్కాలి.”
“ఏం, చిక్కితే?”
“అంతకన్న చస్తే మంచిది.”
“ ఏమి లోపం?”
“ఎట్లా చెప్పనండీ? నాకు చేతకాదు.”
“పోనీలే, కాని ఇట్లాంటి అపవాదులు ఎందుకు తెచ్చుకున్నావు?”
“నాకు గిట్టనివాళ్ళు”
“విరోధాలెందుకు వచ్చాయి?”
“చూడండి. నాదీ మానవశరీరం. ఎవరిమీదో ఎందుకో యిష్టం వుంటుంది. అందువల్ల ప్రతివాడు తన మీద ఎందుకు యిష్టపడకూడదంటే, సాధ్యమా? అట్లా అంటే కోపాలు.”
“నేనడిగితే!”అన్నాను సాహసించి.
“మీరా?” అని సిగ్గుపడుతూ దగ్గరికొచ్చింది.
కుర్చీమీద కూర్చున్న నేను, ఆమె పిరుదులను చేతులతో అందుకుని, నా తలని ఆమె నున్నని పొట్ట కింద ఆనించాను.. కాలుతోంది. లిల్లీ నా భుజాలమీద తలపెట్టుకొని కూచుంది. ఆలోంచుకుంటున్నాను. ఇల్లాంటి సౌఖ్యాన్ని యిన్నేళు ఎలా ఎరగకుండా మిస్ ఐనానా అని? ఇంక ఏ పదేళ్ళో మిగిలింది మళ్ళా యిట్లాంటి ఆనందాలకి. ఈ పదేళ్ళలో ఒక్కరోజు వృథా చేశానా, నా అంత మూర్ఖుడుండడు. మొగవాడి ఉద్రేకపు కామానికి తీసిపోక ఎదురు కామం ఇవ్వడానికి సృజించేరు ఆమె జఘనాన్ని మన్మధ ప్రభృతులు. రంభ అంటే యిదే కావును ఆ స్వప్నం!
“లిల్లీ!”
“ఏమండీ… మాట్లాడరేం? ఎందుకు పిలిచేరు?”
“ఏమీలేదు”
“చెప్పండి”
“నువ్వు నల్లకలువవి. కలవలన్నంటిలోకి శ్రేష్టమైనది. విశాలమైనది, సువాసన కలది, దేవతల చేత ప్రేమింపబడినది గంగానది సరోవరాలలో పుడుతుందని ప్రతీతి కలదు” పక పక నవ్వింది. ఆమె రొమ్ము కదలిక చూసి పరవశుడనయ్యి మళ్ళీ ఆమెను ఆలింగనంలో అనుభవించాను.
***
నేను క్షవరం చేసుకుంటున్నాను.
“ఏమండీ, నా పని సంగతి?”
“ఇంకా పని జ్ఞాపకముందా?”
“పనీ, భోజనమూ, జీతమూ యిట్లాంటి శుష్క ప్రయోజనాలు మనకేం పని?”
“ఇవ్వాళ ఆఫీసుకు వెడతారా?”
“ఆ, తప్పదు”
“నన్ను కూడా స్కూలుకు పంపండి”
“ఎంత చమత్కారివి?… నిన్ను వదలను”
“ నే నిక్కడినుంచి కదలను”.
“నిజంగా యిష్టమా నా మీద?” అని నా పురుష అహంకారం అడిగింది.
“అవును”
“మరి నాతోనే వుంటావా?”
“నిజంగా వుంచుకుంటారా?”
చచ్చేను. ఆమె ఒప్పుకోదలనే ధైర్యంతో ఆ ప్రశ్న వేశాను.
“మరి నీ పని?”
“మీ దగ్గరే వుంటే నాకు పని ఎందుకు?”
“అట్లాకాదు. “వుద్యోగం స్త్రీ లక్షణం” వచ్చేపని మానేస్తే ఎట్లా?”
“సరే! యిప్పించండి’
మళ్ళీ బాధపడ్డాను. నన్ను వొదలిపోవాలంటే చింత కనపర్చదే?
“ఆమె యివ్వదు”
“మీరు చెప్పితే, బెదిరిస్తే, ఇస్తారు.”
“ఏమని బెదిరించను?”
“మీకు తెలుసు?”
ఎంత తెలివికలదానివి, లిల్లీ!
“అట్లాకాదులే. ఆమెతో ఎందుకుగాని చైర్‌మన్‌గారితో చెప్పి వూళ్ళోనే యిప్పిస్తాలే”.
“ఎప్పుడు?”
“యీ వేళ వెడతాను. నువ్వు మీ బంధువుల యింట్లో వుండు. సాయంత్రం వస్తావా?”
“రాత్రంతా ఏమైనావని అడుగుతారు గావును వాళ్ళు”
“పని ప్రయత్నంలో వున్నానను”
“అర్ధరాత్రా! అంటారు? సరేలెండి”
మూడోరోజుకి లిల్లీకి ఆ వూళ్ళోనే హెడ్‌మిస్ట్రస్సు పని అయింది. డబుల్- స్కూల్లోనూ, నా ఇంట్లోనూ! పొన్నమ్మ నాకు కబురంపించింది.
“చాలా పనిగా వున్నట్టున్నారే! దర్శనమే లేదు”.
“అవును వచ్చి చెప్పాలనుకుంటున్నాను”
“Experiment of…..F !”
“లిల్లీ ఏనా కొత్త Experiment”
“ఏమైతేనే?
“దాని వుద్యోగం మళ్ళీ వూడుతుంది.”
సాయంత్రం చైర్‌మన్ కబురంపేడు నాకు.
“ఇదేమిటయ్యా? యీ ఇన్‌స్పెక్ట్రస్సు లిల్లీ ఉద్యోగానికి అభ్యంతరపెడుతోంది.”
“ఆ అభ్యంతరాలకేం లెండి, మీరు తలచుకుంటే”
“మీకు చాలా యింటరెస్టుందే!”
“ఏదో కూడు లేనివాళ్ళు పాపం”
రాత్రి లిల్లీ రాలేదు. తలనొప్పిగా వుందని కబురంపింది. కొత్తలో- మోహపుకొత్తలో వస్తానన్న మనిషి రాకపోతే ఎంత బాధ పడతామో, ఎలాంటి సాహసపు పనులు చేస్తామో అందరికి తెలిసిన విషయమే!
మనసు పట్టలేక లిల్లీ యింటికి వెళ్ళాను.
తలనొప్పిగా ఉన్నా పక్కన కూచుని ఆమెను, బాధతో మూసుకున్న ఆమె కళ్ళను చూస్తూ, ఆమె చెంపలు, నడుము రాసుకూచోడమే ఆనందం.
లిల్లీ లేదింట్లో. సిగ్గును చంపుకుని దరియాప్తు చేశాను. చైర్‌మెన్ గారి యింటికి వెళ్ళిందట, యింకా రాలేదు.
“ఇంత పొద్దుపోయినదాకానా?”
“కొత్తలో యిక్కడే పడుకునేది. ఈ మధ్య పదిరోజుల నుంచి రాత్రులేమవుతోందో ఎవరికీ తెలీదు. ఏమోనండి? ఈ ఇంటిలోంచి పొమ్మనాలని చూస్తున్నాము”
“అవును మీ వంటి మర్యాదస్తులు వుపేక్షించవలసిన విషయం గాదు ఎప్పడొస్తుందంటారు?”
“ఏమో?”
పక్క గుడిసె లోంచి ఒకడు-
“చైర్మనుగారింటికి సాయంత్రం ఆడది వెడితే పొద్దున్నే రావడం” అన్నాడు.
“మరి ఇంటి దగ్గర ఆయన ఆడవాళ్ళు ఊరుకుంటారా?”
“ఇంటికి కాదండి. రహదారి బంగళాలో చేరుకుంటారు, వీళ్ళు అంతా.”
బంగళాకు పోయినాను, నా వుద్దేశ్యమేమిటో నాకే తెలీదు.
“చైర్మనుగారున్నారా?”
“లేరు”
“ఉన్నారని తెలుసు నాకు. ఇనస్పెక్టరుగారు వొచ్చేరు, అవసరంగా మాట్లాడాలని చెప్పు”.
“ఏమంటారో?”
“చెప్పు. వీల్లేదంటే పోతాను.”
బైటకు వొచ్చేడు చైర్మను. చాలా కులాసాగా వున్నాడు. బ్రాందీ మహత్యం వల్ల.
“ఏం బ్రదర్, ఏమిటా అర్జంట్? తొందరగా కానీ.”
“లిల్లీ వుందా? ఏం చేస్తోంది?”
“ఉద్యోగం సంపాదించుకుంటోంది.”

latest Telugu story about friendship

– చలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News