Friday, April 19, 2024

రెండు తుమ్ములు

- Advertisement -
- Advertisement -

cartoon

రెండే తుమ్ములు రెండు బాంబుల్లా ప్రతిధ్వనించాయి. భూకంపం వచ్చేసిందా, వెర్రి నిశబ్దం ఆ ఆఫీసుగదిలో. పక్కనున్న జెఫ్ ఎగిరిపడ్డాడు సీటులోనే. కాస్త దూరంలో వంగొని కంప్యూటర్ చూసుకుంటున్న నూర్ హయాతి కింద పడిపోబోయింది. తలుపు తీసుకు వస్తున్న రెమా, నుంచునే బిగుసుకు పోయింది.
టిష్యూతో ముక్కు తుడుచుకుంటున్న బాబ్జీ ముందుకు ప్రత్యక్షమయ్యింది ఆడబాసు. తెల్లబడిపోయిన మొహంతో, వణుకు కప్పిపుచ్చుకుంటూ, చేతులు నలుపుకుంటూ చాలా చాలా నాజూగ్గానే అడిగింది, తుమ్మావా.. ఆవటాని …
బాబ్జీ అవునన్నాడు. హేమిటో పని చేయడంలో ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఎదురుపడి మెచ్చుకోని బాసు ఇలా స్వయంగా వచ్చి తు ..మ్మా ..వా .. అని అడుగుతుంటే మెలికలు తిరుగుతున్నాడు.
జలుబా .. దగ్గా .. అంది ఆవిడ ముక్కుకున్న మాస్క్ సరి చేసుకుంటూ, రెండడుగులు వెనక్కి వేసి.
బాబ్జీ “ కాదు నాకు అలెర్జీ. పొద్దున కొత్త పౌడర్ డబ్బా ఓపెన్ చేస్తే ముక్కులోకి పౌడర్ వెళ్ళి, అప్పటి నుంచీ అడపాదడపా వచ్చే తుమ్ములు మాత్రమే” అన్నాడు అంతర్జాతీయ వైద్య రహస్యాలను వివరిస్తున్నట్టు. మాస్క్ తీసి ముక్కు టిష్యూతో చీదుకుని, మళ్ళీ పెట్టుకుని..
బాబ్జీ ఇలా అయినా బాస్‌గారి నోటీసులోకి వచ్చానని మురిసాడు. కాని ఆ మురిపమెంతసేపో నిలవలేదు.
ఇంతకుముందు ఆ బాస్ అంత పొలైట్ గా మాటాడి ఉండదు. ఇకముందు కూడా మాటాడబోదు ఎవరితోనూ కూడా. అంత పొలైట్ గా బాబ్జీకి చెప్పేసింది..
“బాబూ బాబ్జీ ..! నువు తక్షణం ఇంటికి బయలుదేరి వెళ్ళి రెస్టు తీసుకో. వెనుదిరిగి చూడకు. తుమ్ములు తగ్గాలి. ఎంతెలాగ తుమ్ములు తగ్గాలంటే.. తుమ్ములు అంటే ఎలా తుమ్మాలో మర్చిపోవడం జరిగే దాకా అన్నమాట. రెస్టంటే బాబ్జీ చుట్టూ చూసాడు. తోటి ఎంప్లాయీస్ జీవన్మరణ సమస్యని ఎదుర్కొంటున్నవారిలా బాబ్జీని చూస్తున్నారు. ఒప్పుకో .. ఒప్పుకో, ఇక్కడ నుండి తప్పుకో అంటూ మనసులోనే వారి వారి దేవుళ్ళని ప్రార్ధించేస్తున్నట్టు వాళ్ళ చూపులు చెపుతున్నాయి.
బాబ్జీకి కొంచం తిక్క వచ్చింది. ఈమాత్రం తుమ్ములకేనా అనుకున్నాడు. తర్వాత తమాయించుకుని, ప్రస్తుత పరిస్థి తికి అనుగుణంగా పోవాలి కదా అని సరిపెట్టుకున్నాడు.
బాబ్జీ ముక్కు నలుపుకుంటూ అడిగాడు,
“నేనెళ్ళను. మరి నా జీతం సంగతి ఏమిటి” అని. అప్పటికే వణికిపోయిన బాస్ బతిమాలింది. నీకు పెయిడ్ లీవు, మా బాబువు కదా బాబ్జీ ఇంటికి బయల్దేరు అని.
బుర్రూపి ‘బై బై’ లు , ‘గెట్ వెల్ సూన్’లు అందుకుంటూ, తేలిక పడిన ఉచ్ఛ్వాస నిశ్వాస చప్పుళ్ళ డప్పులు వింటూ బయటపడ్డాడు బాబ్జీ.
ఇంటికి బయల్దేరాడు బాబ్జీ లోకల్ ట్రైను ఎక్కి. చలో ఇంటికెళ్ళి సందడి చేద్దామనుకుంటూ. ట్రైనులో అందరూ నిబద్ధతతో మాస్కులు వేసుకున్నారు. అసలే ఈ దేశంలో క్రమశిక్షణ ఎక్కువ.
క్యూ ఉందంటే ఎందుకని అడగకుండా వెళ్ళి క్యూలో నిలుచుంటారు. తుక్కు కిందవేయరు. కుప్పతొట్టెలో తప్ప. వద్దన్నారని ట్రైనులో ఏదీ నోట పెట్టరు తినడానికి. ఎక్కడి పడితే అక్కడ ఉమ్మరు. ఏదైనా రూలు పెట్టారంటే అది తలకిందులైనా పాటించి తీరతారు. అల్లాటి దేశంలోకి వైరస్ రావడానికి కూడా వణుకుతుంది కదా!
ఫోను మోగింది. ఎత్తాడు బాబ్జీ .. అమ్మ “ఒరే నాయనా.. అక్కడేదో మహమ్మారి వచ్చిందటకదా! తక్షణం వచ్చేయ ండ్రా నాయనా .. వైద్యమూ మందూ లేని వ్యాధిట కదు రా, నేనేం చేతునురా .. దేముడా, మీరక్కడ చిక్కడ్డారా..”
అంటూ ఒప్పారుస్తూ దాదాపు ఏడవడం మొదలెట్టింది.
“అమ్మా! ఆపవే బాబూ, ఇక్కడంతా బానే ఉంది. అసలు ఆ వైరస్ వచ్చిన దేశంలోనే భయపడటం, కాని మిగతా దేశాలన్నీ ముందు జాగ్రత్రలు తీసుకుంటున్నాయి. నేనున్న చోట కూడా వెర్రి జాగ్రత్తలు తీసుకుంటున్నారు గాని, నువ్వలా కంగారుపడి ఏడవకే అమ్మా. అందరూ జాగ్రత్తగా ఉంటే చాలు, ఆ వైరస్ వ్యాపించకుండా.. ముం దు నాన్నకియ్యి చెపుతాను” అన్నాడు బాబ్జీ.
తండ్రి ఫోను తీసుకోగానే మొదలెట్టాడు “అల్లం తిను, తమలపాకులు నములు, నిమ్మకాయరసం తాగు, ఇం ట్లోనే ఉండు, నలుగురితో కలవకండి, వీలయినంత తొంద రగా బయలుదేరి ఇక్కడకు రండీ” అని.
విసుక్కున్నాడు బాబ్జీ. “మీరు కూడా ఏమిటి నాన్నా! మేం బానే ఉన్నాము. ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేమందరం వారికి సహకరిస్తే చాలు. మేం తీసుకునే జాగ్రత్త తీసుకుంటాం. మీరు చెప్పినట్టూ చేస్తాం అని. అప్పటికి ఆ సంభాషణ అలా ముగిసింది.
ఈలోగా వాట్సప్‌లో మెసేజి చిట్టెమ్మ నుంచి బియ్యం పాలు కూరలు ఇంకా తిండులూ పొడులూ బన్నులూ ఫెయిర్ర్పైస్ నుంచి పట్టుకురమ్మని. హఠాత్తుగా చుట్టాలొస్తున్నారేమో అని బెంగ పడ్డాడు బాబ్జీ. కరువులో అధికమాసంలాగ ముందు వాళ్ళకి మాస్కులు సంపాదించాలి. వాటికి నిజంగానే కరవొచ్చింది. క్యూలు కట్టాలి. కార్డు స్వైప్ చేసి లోపలికెళ్ళాడు. చిట్టీ ఎక్కడున్నావ్ అని అరుస్తూ..
నే క్వారంటైన్ అయిపోయా. బెడ్ రూంలోంచి చిట్టి కేకవిని కంగారుగా పరుగెత్తాడు బాబ్జీ ఏమయ్యింది అంటూ.
“నాకు మూడు తుమ్ములొచ్చాయి. ఎందుకైనా మంచిదని తలుపులూ, కర్టెన్లూ వేసేసుకుని మాస్కు పెట్టుకు కూచున్నా” అంది చిట్టి.
ముందుకు బయటకు రమ్మని చిట్టిని బతిమాలి, చిట్టొచ్చాక ఎప్పుడు తుమ్ములు వచ్చాయని అడిగాడు బాబ్జీ. బయటకొచ్చిన చిట్టి దూరంగా పెడమొహంతో కూచుని ఏడుపు గొంతుతో “ఏమిటో ..నేను చచ్చిపోతా నేమో.. ఈలోగా నా అభిమాన హీరో సినిమా దర్బార్ చూడాలి. కాస్త ఏర్పాటు చేద్దూ. అమ్మా నాన్న బాధపడ కుండా నువ్వే చూసుకోవాలి బాబ్జీ. ఈ నాలుగురోజులు నచ్చిన బట్టలు కట్టుకుని నగలేసుకుంటా. వంట నువ్వే చేయాలి. అన్నీ మంచివి నాకు నచ్చినవీ వండు బాబ్జీ నీ చేతులతో. బిరియానీ ఒండుతావు కదూ” అంటూ అంపకాలు మొదలెట్టింది.
కాసేపు అలాగే ఏడిచి ఏడిపించి, తర్వాత అసలు
విషయం చెప్పింది, చారులో పోపు పెడుతుంటే ఘాటుకి తుమ్ములొచ్చాయని.
“చిట్టీ! చదువుకున్నదానివి కాదూ .. చారు ఘాటుకు తుమ్ములొస్తే ఇంకోటేదో అనుకుని భయపడటమేమిటి. నిజంగా జలుబు తుమ్ములు టెంపరేచర్ ఉంటే నడు, తప్పనిసరిగా క్లినిక్ వెళ్ళి టెస్టు చేయించుకుందువు గాని”
చిట్టి లేచొచ్చి అంది “కంగారుపెట్టానా వట్టినే, నిన్ను సరదా చేద్దామని. నీకు వచ్చాయన్నావుగా, అందుకే, నిజానికి టెంపరేచరు లేదు”
“ఇల్లాటివి సరదా ఏమిటి నీకు ..అవునుగానీ ..ఏమిటన్ని సరుకులు రాశావు చిట్టీ, ఎవరైనా వస్తున్నారా”
“లేదు, అందరూ కొని నిల్వ చేసుకుంటున్నారుట బాబ్జీ. ముందు ముందు ఏం జరుగుతుందో అని. మనం కూడా కొనేసుకుని ఉంచుకుందాం. ముందు ముందు దొరకవేమో”.
“ అయ్యో! చిట్టీ, అలా పానిక్ అవుతే ఎలా మనం కూడ. అన్నీ దొరుకుతాయి. ఇలాటప్పుడే సంయమనంగా, బాలన్స్‌గా ఉండద్దా చెప్పు. కావలసినవి ఏమన్నా ఉంటే సాయంత్రం వెళ్ళి కొనుక్కుందాంలే. సరే మా లాబ్‌లో కూడా పనికి అంతా బావుంటేనే రోజూ రమ్మన్నారు లేదా శలవు తీసుకుని రెస్టు తీసుకోమన్నారు”.
నీకు తెలుసా.. యూనివర్సిటీ హాస్టల్స్‌లో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. కొద్దిపాటి వంట్లో బాగోకపోవడం జలుబు అంటే, లోపలే ఉండి విశ్రాంతి తీసుకోమన్నారు.
“అవును చిట్టీ! ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. చూడు ఆ వైరస్ తాకి ఎంత మంది చనిపోతున్నారో.. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంలాగ కాకుండా, కష్టమైనా ముందు కాస్త కఠినంగా జాగ్రత్తలు తీసుకుంటే మనందరకీ మంచిది కదా. ఏమైనా మనిషి ప్రాణాలే ముఖ్యంకదా. మనం ఖాళీగానే ఉంటే పొద్దున్న పూట కొంచం సేపు యోగా, ప్రాణాయామం చేసుకుందామా. నీకు నేర్పుతాను బాబ్జీ . ఇదో ఛాన్సు. ఇల్లాటి వైరస్లు అలాటప్పుడు ప్రాణాయామం చేస్తే శ్వాస మెరుగు పడుతుందిట. సరేలే కాని అన్నం తిందాంరా చిట్టీ.
ఆ..ఆ.. బాబ్జీ! చేతులు శుభ్రంగా కడుక్కొచ్చావా
మామూలుగా చిట్టి అలా చేతులు కడుక్కొచ్చావా.. అంటే గుర్రుమనేవాడు బాబ్జీ, ఇప్పుడు మాత్రం బుద్ధిగా చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూచున్నాడు.
ఇద్దరూ వెళ్ళి క్లినిక్‌లో పరిక్షలు చేయించుకుని , జరమూ గిరమూ లేదని తెలిసాక తేలికపడి , ఇంటికి కూడా ఫోను చేసి అన్ని ఆరోగ్యసూత్రాలు పాటిస్తున్నామని భరోసా ఇచ్చి, రోజూవారి పనుల్లో పడ్డారు బాబీ, చిట్టీ.
రెండు రోజులయ్యాక బాబ్జీ ఫోన్ చేసడిగాడు ఆఫీసులో బాసును. “నేను సుబ్బరంగా గుండులా ఉన్నాను. డాక్టరు కూడా ఏమీ లేదన్నాడు. నే రానా పనికి అని..”
బాస్ భయంతో సగం చచ్చి తప్పక ఒప్పుకుంది.
కాని అవాల్టి నుంచీ ఆఫీసు మొహం చూడకుండా ఆమె నిరవధిక శలవు పెట్టింది.
కొన్ని దేశాలలో కరోనా వైరస్ పై ముందు జాగ్రత్తగా అత్యధిక జాగ్రత్త తీసుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఇది. కాసింత హాస్యంగా మీకు చెప్పాను.

latest Telugu story about Two sneezes

జానకి చామర్తి (వరిగొండ),  కౌలాలంపూర్, 94934 26520

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News