Home ఎడిటోరియల్ లా కమిషన్ కీలక అభిప్రాయాలు

లా కమిషన్ కీలక అభిప్రాయాలు

Law Commission is key points

లోక్‌సభ, రాష్ట్ర శాసన సభలకు ఏకకాలంలో (జమిలి) ఎన్నికల నిర్వహణ, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124ఎ (రాజద్రోహ నేరం, ప్రస్తుత పరిభాషలో దేశద్రోహ నేరం) ను రద్దు చేయవలసిన ఆవశ్యకతపై లా కమిషన్ విలువైన అభిప్రాయాలను చర్చకు ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.ఎస్.చౌహాన్ ఛైర్మన్‌గా ఉన్న లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాలిచ్చే అత్యున్నత సంస్థ. జస్టిస్ చౌహాన్ పదవీ విరమణ చేస్తున్న ముందు రోజు గురువారం ఈ కీలక అంశాలపై అభిప్రాయాలను ప్రజల మధ్య చర్చకు ప్రతిపాదించింది. జమిలి ఎన్నికల అంశం తక్షణ ప్రాధాన్యత దృష్టా కమిషన్ తన అభిప్రాయాలను ముసాయిదా సిఫారసుల రూపంలో, ఐపిసి సెక్షన్ 124ఎ అంశంపై అభిప్రాయాలను చర్చా పత్రంగా ప్రజలముందుంచింది.

లా కమిషన్ జమిలి ఎన్నికలు “ఆదర్శవంతం, వాంఛనీయం” అని అభిప్రాయపడింది. అయితే ప్రస్తుత రాజ్యాంగ చట్రం లోపల సాధ్యం కావని వ్యాఖ్యానించింది. తుది సిఫారసులు చేసే ముందు దీనిపై సంబంధీకులందరితో మరోసారి చర్చలు అవసరమని భావించింది. జమిలి ఎన్నికల వల్ల “ప్రజాధనం ఆదా అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా దళాలపై భారం తగ్గుతుంది. ప్రభుత్వ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు జరిపే అవకాశం ప్రభుత్వ యంత్రాంగానికి లభిస్తుంది. జమిలి ఎన్నికలను ఆచరణలోకి తేవాలంటే చట్ట సభలు, వాటి సెషన్స్‌కు సంబంధించిన అధికరణలను సవరించాలి” అని పేర్కొన్నది. అవిశ్వాస తీర్మానం, ముందస్తుగా చట్ట సభ రద్దు ఇందుకు ప్రధాన అవరోధంగా భావించిన కమిషన్, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పార్టీ అదే సమయంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని సూచించాలని, హంగ్ చట్టసభ సందర్భంలో ప్రతిష్టంభన తొలగించే నిమిత్తం ఫిరాయింపులు నిరోధక చట్టం ఆంక్షలను సడలించాలని సూచించింది. లోక్‌సభ, శాసన సభకు మధ్యంతర ఎన్నికలు అవసరమైనప్పుడు రద్దయిన సభలకు మిగిలి ఉన్న కాల పరిమితికే కొత్త సభల పదవీకాలాన్ని పరిమితం చేయాలని సూచించింది.

ప్రస్తుతానికి ఒక మార్గాంతరం సిఫారసు చేసింది. రాజ్యాంగానికి కనీస సవరణ చేసి 2019 లో సార్వత్రిక ఎన్నికలతోపాటు 12 శాసన సభలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఐదు శాసన సభలకు ఎలాగూ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సిన మిజోరం, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ శాసన సభల పదవీకాలాన్ని పొడిగించటం, మరికొన్ని శాసన సభల పదవీకాలాన్ని తగ్గించటం ద్వారా ఈ పని చేయవచ్చు. దీనికి రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అయితే జమిలి ఎన్నికలకు ఇప్పుడున్న తక్కువ వ్యవధిలో రాజ్యాంగ సవరణ సాధ్యం కాదని, అందువల్ల ఈ పర్యాయానికి జమిలి ఎన్నికలుండవని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అంతేగాక ఓటింగ్ యంత్రాలు, వివిపాట్‌లు సమకూర్చుకునేందుకు వ్యవధి చాలదని కూడా చెప్పింది. లా కమిషన్ సిఫారసులు కేంద్ర ప్రభుత్వానికి శిరోధార్యం కానందున ఈ సస్పెన్స్‌ను తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినాక దాని విధానాలను వ్యతిరేకించే వారిపై ‘రాజద్రోహం’ (సెడిషన్) కేసులు బనాయించటం పెరిగింది. బ్రిటీష్ పాలన కాలంలో వారి వలసపాలనను ప్రతిఘటించే వారిని భయపెట్టటానికి, అణచటానికి ఐపిసిలో 124ఎ సెక్షన్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ప్రభుత్వమే దాన్ని తమ చట్టాల నుంచి తొలగించింది. అయితే మన ప్రజాస్వామ్య దేశంలో ఏడు దశాబ్దాల తదుపరి కూడా అది చట్టంలో కొనసాగుతూ నిరంకుశ పాలకుల చేతిలో ఆయుధంగా ఉపయోగపడుతున్నది. ఈ సెక్షన్ గూర్చి పునరాలోచించాలని, రద్దు చేసే విషయాన్ని ఆలోచించాలని లా కమిషన్ అభిప్రాయపడింది. ‘వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణలు ప్రజాస్వామ్యంలో ఆవశ్యకమైన అంతర్భాగంగా పరిగణించే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో “ఇది అవసరమా అని ప్రశ్నించిన లా కమిషన్, స్థితిగతులపై నిరాశ, నిస్పృహ వ్యక్తీకరణను సెడిషన్‌గా పరిగణించరాదని అభిప్రాయపడింది. “అధికారంలోని ప్రభుత్వ విధానానికి అనుగుణంగాలేని ఆలోచన వ్యక్తం చేసినంతమాత్రాన ఆ వ్యక్తిపై సెడిషన్ కేసు పెట్టరాదు. అలాచేస్తే స్వాతంత్య్ర పూర్వానికి, అనంతరానికి తేడా ఏమిటని ప్రశ్నించింది. అందువల్ల దీన్ని చర్చించాలని ప్రజలకు సూచించింది.“అసమ్మతి ప్రజాస్వామ్యానికి రక్షాకవాటం” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మరునాడే ఈ చర్చా పత్రం ప్రచురణ ప్రాధాన్యం సంతరించుకుంది.