Home వరంగల్ మాటల తూటాలు

మాటల తూటాలు

Wrangal-by-poll-Campaignమన తెలంగాణ/వరంగల్: ఉప ఎన్నికల ప్రచారం మంచి జోరుమీదున్నది. రాష్ట్ర, జాతీయ నాయకులు సైతం తమ పార్టీ అభ్యర్థుల విజయానికి రంగంలోకి దిగారు. ఓరుగల్లు ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ఒక పక్క ప్రయత్ని స్తూనే భారీ సభలతో జనంలో ప్రచారం తారాస్థాయికి చేర్చి తమ తమ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల ముఖ్యనేతలంతా ఓరుగల్లు ఉప ఎన్నికల్లోనే తలమునకలయ్యారు. అన్నిపార్టీలు తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు సైతం ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌కు పరిమితమై ఓటర్లను ఆకట్టుకునేందుకు చెమటోడు స్తున్నారు. ప్రధాన నేతల ప్రచార ఆర్భాటం, సభలు, సమావేశాలతో ప్రచారం హోరెత్తుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్, బిజెపిలపై వామపక్షాలు కాంగ్రెస్‌లు నిప్పులు చెరుతున్నాయి. టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై బిజెపి, టిడిపిలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ సర్కార్‌లు చేస్తున్న కార్యక్రమాలను టిఆర్‌ఎస్, బిజెపి నాయకులు ఏకరువుపెడుతున్నారు. టిఆర్‌ఎస్, బిజెపిల మధ్య మాటల యుద్ధం పెరిగింది. తాజాగా ఆదివారం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సభలు, సమావేశాలు, ప్రెస్‌మీట్‌లలో ఆయా పార్టీల ప్రధాన నేతల ప్రతిస్పందన ఈ విధంగా ఉంది.

తుగ్లక్ పాలనగా మారింది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్: కేంద్రంలో మోదీది, రాష్ట్రంలో కెసిఆర్‌ది తుగ్లక్‌పాలనగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలెక్కడ? ఓరుగల్లు ఉద్యమ చరిత్రగలది. రాష్ట్ర కల నిజమైందంటే జిల్లా ప్రజల పోరాటం ప్రధానం. తెలంగాణ కల కాంగ్రెస్ ఎంపీలతోనే సాధ్యమైంది. ఇద్దరు టిఆర్‌ఎస్ ఎంపీలతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమా? రాష్ట్రం ఎవరితో వచ్చిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం కోసం మన్మోహన్, సోనియాగాంధీలు పనిచేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి మద్ధతు ఇచ్చి రుణం తీర్చుకోండి

మాటలు తప్ప చేతలేవీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజల ఆకాంక్షలు అమలు పరచడంలో సిఎం కెసిఆర్ విఫలమయ్యారు. సిఎం మాటలకు చేతలకు ఎక్కడ పొంతనలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసుకొని సాధించిన రాష్ట్రంలో ప్రజల కలల నీరుగారిపోతున్నాయి. మాటలతో మభ్యపెడుతున్నారు. నియంతృత్వపోకడలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. వామపక్షాలకు మద్ధతు అందించండి

సంక్షేమంలో ముందంజ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్: సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది. ఎక్కడా అమలు చేయని విధంగా పెన్షన్‌లు, రూపాయికి కిలోబియ్యం, వింతంతువులకు పెన్షన్‌లు, గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక పథకం, మంచినీరందించేందుకు వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ తదితర హామీలను అమలు చేస్తోంది. తెలంగాణ ప్రజల కలలు తీర్చేందుకు కృషి సాగుతోంది. కోతలు లేని కరెంట్ సరఫరా, నీటిపారుదల రంగానికి పెద్ద పీట, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మహిళల కోసం పథకాలు అమలు చేస్తున్న సర్కార్ తమది. తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి.

శాపనార్ధాలతో ఓట్లు రాలవు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి: ప్రజలకు శాపనార్ధాలు, బెదిరింపులతో ఓట్లు రాలవు. పత్తి రైతులపై పైసా ఖర్చుపెట్టకుండా సొల్లు కబుర్లు చెబుతున్నారు. సిఎం రాజీనామా చేస్తే తాను అమలు చేసి చూపిస్తాను. కెసిఆర్ కుటుంబ పూటకోమాట చెబుతోంది. ఇచ్చిన హామీల్లో ఏదీ పూర్తి చేశారో చెప్పాలి. అన్ని పథకాలు అమలు చేస్తే ఇంతమంది మంత్రులెందుకు ప్రచారం చేస్తున్నారు? లక్షకోట్ల బడ్జెట్‌తో ఏం చేస్తుండో చెప్పాలి. ఉద్యోగాలిచ్చాడా?భూమి పంచాడా? ఫీజు రియంబర్స్‌మెంట్ చేశారా? రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్ళు నిర్మించాడా? చెప్పాలి.

ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా ఉంది వైఎస్సార్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి: రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజాకాంక్షలకు నేతల చేతలకు పొంతనలేదు. అన్ని వర్గాల్లో నిరసన పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. టిఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికల్లో చెంపదెబ్బ తప్పదు. దశాబ్దాల కల ఫలించిన వేళలో అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అండగా నిలుస్తాం. ప్రభుత్వాలను నిలదీస్తాం. తమకు మద్ధతుగా నిలవాలి.