Friday, April 26, 2024

ఎల్‌ఈడి వెలుగులతో ఔటర్ రింగ్‌రోడ్డు కాంతివంతం

- Advertisement -
- Advertisement -

రూ.136 కిలోమీటర్లు… రూ.100.22 కోట్లతో అభివృద్ధి పనులు
నాలుగు విభాగాలుగా పనుల విభజన
ఏజెన్సీలకు పనులు అప్పగింత
కోకాపేట చుట్టూ భారీ ప్రాజెక్టులు
రూ.300 కోట్లతో లే ఔట్‌లు, రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు
భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి హెచ్‌ఎండిఏ ముందస్తు ప్రణాళికలు
జిహెచ్‌ఎంసి ఎన్నికల తరువాత మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: జవహర్‌లాల్ నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) పూర్తి స్థాయి మార్గం వెలుగుమయం కానుంది. దీంతోపాటు కోకాపేట చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి కొన్నింటికి టెండర్లను ఆహ్వానించగా మరికొన్నిచోట్ల అభివృద్ధి పనులు కూడా మొదలయ్యాయి. అభివృద్ధి పనుల్లో భాగంగా ముందస్తుగా నగరం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 22 కిలోమీటర్ల మేర రూ.30కోట్ల జైకా నిధులతో 8 లేన్ల మెయిన్ కారిడార్ సెంట్రల్ మీడియన్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో మిగిలిన 136కిలోమీటర్ల మార్గంలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు హెచ్‌ఎండిఏ అధికారులు రూ.100.22 కోట్ల అంచనాతో ప్రాజెక్టు పనులకు టెండర్లను ఆహ్వానించారు. వీటిని నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. ఈ మేరకు టెండర్ ప్రక్రియలో ప్యాకేజీ 1, 4లను శబరీ ఎలక్ట్రానిక్స్‌కు, ప్యాకేజీ 2, 3 పనులను కెఎంవి ఎలక్ట్రానిక్స్ ఏజెన్సీలు దక్కించుకున్నాయి. 6,279 పోల్స్‌తో పాటు 13,303 లైట్లను బిగించనున్నారు. మెయిన్ క్యారేజీ వే, ఇంటర్‌చేంజ్‌లు, జంక్షన్లు, సర్వీస్ రోడ్ల వెంబడి ఈ ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. పనులను ఏడాదిలోగా పూర్తి చేయడంతో పాటు ఏడు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలను సంబంధిత ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులను జిహెచ్‌ఎంసి ఎన్నికల తరువాత మంత్రి కెటిఆర్ ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎల్‌ఈడీ ప్రాజెక్టు పూర్తయితే 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్‌రోడ్డు మార్గం ఎల్‌ఈడిలతో వెలిగిపోనుంది.

త్వరలో 105 ఎకరాల్లోని ప్లాట్లు వేలం

ఔటర్ చుట్టూ అభివృద్ధిలో భాగంగా కోకాపేట చుట్టూ భారీ ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండిఏ సన్నాహాలు చేస్తుంది. 105 ఎకరాల్లో భారీ లే ఔట్‌లను ఏర్పాటు చేసింది. త్వరలో వీటిని ఆన్‌లైన్ వేలం ద్వారా ఈ ప్లాట్లను విక్రయించాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. దీంతోపాటు ప్రస్తుతం మరో రెండు భారీ పథకాలకు ప్రణాళికలను హెచ్‌ఎండిఏ సిద్ధం చేస్తోంది. అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్‌ను పూర్తిగా ఎల్‌ఈడి విద్యుత్ దీపాలను అలంకరిస్తోంది. దీనికి తోడు ORR(ఔటర్ రింగ్ రోడ్డు) నుంచి నేరుగా కోకాపేట్ లే ఔట్‌లోకి రాకపోకలు సాగించేందుకు ప్రత్యేకంగా రోడ్డును ఏర్పాటు చేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. దీనికోసం టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. లే ఔట్‌లు, రోడ్డు నిర్మాణం మొత్తం రూ. 300 కోట్లు అంచనా వ్యయంగా హెచ్‌ఎండిఏ నిర్ణయించింది. త్వరలో ఈ పనులను మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేయనున్నట్టుగా సమాచారం.

భారీ మోడల్ టౌన్‌షిప్‌కు శ్రీకారం

కోకాపేట్‌లో ప్రత్యేకంగా రహదారులు, టౌన్‌షిప్‌లు, మెట్రో రైలు, బిఆర్‌టిఎస్ వంటివి రానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్‌ఎండిఏ తగిన ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగంగానే రోడ్ల వెంట ఆధునిక సైనేజ్‌లు, రోడ్ మార్కింగ్‌లను చేస్తున్నారు. రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి వయా కోకాపేట్ మీదుగా ప్రత్యేకంగా మెట్రో రైలు మార్గం ప్రతిపాదించారు. దీనికి రూ. 1,600 కోట్లు అంచనా వ్యయంగా హెచ్‌ఎండిఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనకు యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ అనుమతి కూడా లభించింది.
దీనికి తోడుగా హెచ్‌ఎండిఏ మరో 100 ఎకరాల్లో భారీ లే ఔట్‌లకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. వాస్తవానికి కోకాపేట్‌లో అథారిటీకి చెందిన భూమి 536 ఎకరాలు ఉంది. వీటిలో 72 ఎకరాలు గతంలోనే వేలం ద్వారా విక్రయించింది. మిగతా భూమిలో ప్రత్యేక మోడల్ టౌన్‌షిప్‌ను TOD (Transit Oriented Development) తరహాలోనే నిర్మించాలని హెచ్‌ఎండిఏ భావిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ORR (ఔటర్ రింగ్ రోడ్డు) సర్వీసు రోడ్డును మరింతగా అభివృద్ధి చేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది.

వ్యాపార, వాణిజ్యం, విద్య, వైద్యం, సాంకేతిక వ్యవస్థ ఒకేచోట ఉండేలా…

అథారిటీకి చెందిన 536 ఎకరాల్లో అత్యాధునిక టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యాపార, వాణిజ్యం, విద్య, వైద్యం, సాంకేతిక వ్యవస్థ, రవాణా, కృత్రిమ చెరువులు, క్రీడామైదానాలు, ఓపెన్ థియేటర్లు, రెస్టారెంట్లు ఇలా నవీన జీవన విధానానికి అద్దం పట్టే విధంగా టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో కోల్‌కతా విమానాశ్రయానికి చేరువగా ఉన్న న్యూ టౌన్ షిప్ తరహాలోనే ఈ కోకాపేట్ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News