Home ఆఫ్ బీట్ ఆత్మస్థైర్యమే… కొండంత అండ

ఆత్మస్థైర్యమే… కొండంత అండ

కలలు కనాలి…వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి… ఏ పనైనా పూర్తి చేయాలంటే వాయిదా వేయకుండా తొలి అడుగు గమ్యం వైపు వేస్తే చాలు సగం దూరం చేరినట్లే అంటోంది డాక్టర్ రేణికుంట్ల కవిత అజయ్. చిన్నతనంలోనే వివాహం జరి గినప్పటికీ కుటుంబీకులు, భర్త సహాయంతో అనుకున్న లక్షాలను చేరుకుంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్యూటర్స్ ప్రైడ్  సంస్థ, రాజారత్నం హెల్త్‌కేర్ వారు మహిళలకు అందజేసిన అవార్డుల్లో కవిత అజయ్ లెజెండ్ అవార్డును దక్కించుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూనే, మానసిక వికాస నిపుణురాలిగా, గాయకురాలిగా, యాంకర్‌గా, కవయిత్రిగా ఇలా బహుముఖ ప్రజ్ఞలను చాటుతోంది. అనేక చిత్రాలు, బుల్లితెర సీరియల్స్‌కు  డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.

lf

బెల్లంపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న డాక్టర్ కవిత అజయ్ చదువులో వెనుకబడిన విద్యార్థులకు సంగీతం ద్వారా ఏ విధంగా బోధించాలనే అంశంపై పరిశోధన చేసి పట్టా సాధించింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి నుంచి బిఎస్సీ, ఉస్మానియ విశ్వవిద్యాలయంలో బిఈడి పట్టా పొందారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ(ఇంగ్లీష్) కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి సాయి కళాశాలలో ఎంస్సీ పట్టా తీసుకుంది. అంతే కాకుండా ఎన్‌ఎల్‌పి (న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం) హిప్నాటిజంలో ఐఏఎన్‌ఎల్‌పి చేసింది. ఇలా ఆవిశ్రాంతంగా చదివి పాటల ద్వారా విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఆకట్టుకుంటోంది.
వాయిస్ ఓవర్‌లోనూ దిట్ట : బుల్లి తెరల్లో వస్తున్న, సినిమా హాల్‌ల్లో మారుమోగుతున్న అన్ని వాణిజ్య ప్రకటనల్లో వినిపించే మధురమైన గొంతు కవితదే. విద్య, వైద్య, వాణిజ్య, తదితర రంగాలకు చెందిన వందకు పైగా యాడ్స్‌కు కవిత గళాన్ని అందిస్తోంది. ఓ ఫాదర్ అనే డాక్యుమెంటరీలో నటించడంతో పాటు డబ్బింగ్ చెప్పింది. అమావాస్య వెన్నెల, పోస్టు చేయని ఉత్తరం, గుప్పెడు మనసు, హృదయాంజలి, కత్తిరించిన రెక్కలు తదితర రచనలు చేసింది. పెయింటింగ్‌లో ఒక చానల్ వారు నిర్వహించిన పోటీల్లో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకుంది.
దృఢ సంకల్పంతో ముందుకు సాగితే అన్నీ విజయాలే : సమాజంలో నైతిక విలువలు, మానవ విలువలు పెంపొందించాలనే తపనతో వ్యక్తిత్వ తరగతులను నిర్వహించడం, కౌన్సిలింగ్ చేయడం ప్రారంభించినట్లు చెబుతోంది. విద్యార్థులకు సాధారణ పద్ధతిలో పాఠాలు చెబితే వారికి అంత సులువుగా అర్థం కావని, అదే పాటల రూపంలో చెబితే తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను అర్థం చేసుకుంటారని ప్రయోగాత్మకంగా గుర్తించినట్లు తెలిపారు. వీటి అన్నిటి వెనుక భర్త అజయ్ ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిదని, ఆయనే నాలో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించారని అంటోంది. మహిళల ఆరోగ్యంపై ఆమె ఇటీవల మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు. రక్త హీనతతో పాటు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ప్రయోజనకారిగా ఉండే చెట్ల్ల ప్రాధాన్యాన్ని వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు.

* హెచ్‌ఐవి ఎయిడ్స్ బాధితులపై ఆమె రాసిన కవితా సంపుటి ‘అంత రంగ మథనం’ ను జంతు ప్రేమికురాలు, సామాజిక వేత్త, నటి అక్కినేని అమల ఆవిష్కరించింది.
* వాతావరణ కాలుష్యాన్ని నివారించడంతో భాగంగా సైకిల్ క్లబ్‌ను ఏర్పాటు చేసి, మోటారు వాహనాలకు బదులుగా సైకిల్‌ను వాడాలని ప్రచారం చేసింది కవిత.
* పూసలతో బొమ్మలు తయారు చేయడం, గోడలపై పెయింటింగ్స్ వేయడం, ఉపయోగించి పడేసిన వస్తువులకు రంగులు అద్ది చూడ చ్చటగా తయారు చేస్తోంది.
* వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులతో పాటు ఒక మొక్కను పంపిణీ చేసి, జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ ప్రశంసలు పొందింది.