Home ఎడిటోరియల్ ఎన్నికలు నేర్పిన పాఠాలు…

ఎన్నికలు నేర్పిన పాఠాలు…

 Polls

 

ఖచ్చితంగా ఒక ఏడాది క్రితం బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలన్నీ గొప్ప సమైక్యతా ప్రదర్శన చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో ఆ ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రతిపక్ష ఐక్యత గురించి అందరూ మాట్లాడడం ప్రారంభించారు. ఈ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఒకే మాటపై నిలబడతాయని, భారతీయ జనతా పార్టీకి సవాలు విసురుతాయని చెప్పుకున్నారు. మే 23వ తేదీన బిజెపి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఘన విజయం సాధించింది. బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల ఆనాటి సమైక్యతా ప్రకటన ఏమయ్యింది? ప్రతిపక్షాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఓటమితో నేలకూలాయి. ఈ సారి సార్వత్రిక ఎన్నికలు నిజానికి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేశాయని చెప్పాలి. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బిజెపి చెప్పిన మాట నిజం చేస్తోంది. గాంధీ విషయంలోను ఇది త్వరలో నిజం కావచ్చు. గాడ్సే దేశ భక్తుడని గట్టిగా చెబుతున్న వారికే ప్రజలు ఓటు వేశారు. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వామపక్షాల జాడ మిగల్లేదు. తృణమూల్ కాంగ్రెస్, తెలుగుదేశం, సమాజవాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ వంటి పార్టీలు ఉనికి కోల్పోయాయి.

ప్రతిపక్షాల్లో లుకలుకలు, బెకబెకలు తప్ప మరేమీ ప్రజలకు వినబడలేదు. బిజెపి, నరేంద్ర మోడీలకు సవాలుగా ఒక బలమైన నాయకుడిని నిలబెట్టి, బలమైన ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలేవీ ముందుకు రాలేకపోయాయి. ప్రతిపక్షాలు అత్యంత అవమానకరంగా విఫలమయ్యాయి, హిందీ రాష్ట్రాల్లో బిజెపి క్లీన్ స్వీప్ చేసింది. 2014లో గెలిచిన రాష్ట్రాలన్నింటా ఈ గెలుపును మరోసారి నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్లో 18 స్థానాలు గెలుచుకుని బలమైన పార్టీగా మారింది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది 22 స్థానాలు. కాని బెంగాల్లో ఉనికే లేని బిజెపి ఇప్పుడు 18 స్థానాలు గెలుచుకోడం సాధారణమైన విషయం కాదు. బెంగాల్లో మతతత్వ రాజకీయాలు నడిపే కొత్త ప్రత్యర్థితో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దీదీ తలపడవలసి ఉంది.

మమతా బెనర్జీ మైనారిటీలను బుజ్జగిస్తుందన్న ప్రచారం బెంగాల్లో గొప్ప ఫలితాలిచ్చింది. నిజానికి ఈ ప్రచారమే దేశ వ్యాప్తంగా బిజెపికి గొప్ప విజయాలు అందించింది. బెంగాల్లో ప్రజల మధ్య విభేదాలను నాటడం ద్వారా బిజెపి అక్కడ బలపడే ప్రయత్నాలు చేస్తోంది. కేరళలో వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వామపక్షాల కార్యకర్తలు ఇప్పుడు కాషాయ పార్టీలో చేరుతున్నారు. అంతేకాదు, వామపక్షాల ఓటు బ్యాంకు బిజెపి వైపు బదిలీ అవుతోంది. తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీకొనే పార్టీ ఇప్పుడు బెంగాల్లో వామపక్షాలు కాదు, బిజెపి అనే అభిప్రాయం ప్రజల్లో కనబడుతోంది. మమతా బెనర్జీ బెంగాల్లో వామపక్షాలను పూర్తిగా అణచేయాలని చేసిన ప్రయత్నమే ఇప్పుడు బిజెపికి కలిసి వచ్చింది. బిజెపి హిందూ కార్డును ఎలా తెలివిగా ఉపయోగిస్తుందో, ఎలా బిజెపి హిందూత్వ రాజకీయాలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయో గుర్తించడంలో ఆమె విఫలమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు మమతా బెనర్జీ తన విధానాలు, వ్యూహాలు మార్చుకోవలసిన అవసరం ఉంది. మరోసారి రాహుల్ గాంధీ విఫలమయ్యాడు. అమేథీలో ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్ లో సమాజవాదీ, బహుజన సమాజ్ పార్టీలతో పొత్తు సాధించడంలో విఫలమయ్యాడు. బీహారులో కూడా బలమైన పొత్తు చేసుకోలేకపోయారు. బెంగాల్లో మమతా బెనర్జీ అవగాహనకు రాలేకపోయారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌తో అవగాహన కుదరలేదు. గత సంవత్సరం మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సాధించిన విజయాల నుంచి కూడా ప్రయోజనం పొందలేకపోయారు. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణం గురించి మాట్లాడినా, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం గురించి మాట్లాడినా ప్రజలు వినే మూడ్‌లో లేరు. ప్రజలకు దేశభక్తి, దేశభద్రత ప్రముఖంగా కనిపించాయి. దేశ భద్రతను కాపాడే నాయకుడు, పాకిస్థాన్ కు బుద్ధి చెప్పే నాయకుడు కావలని ప్రజలు కోరుకున్నారు. నిరుద్యోగం, రైతు సమస్యల వంటి మౌలిక విషయాల కన్నా ఇదే ముఖ్యంగా భావించారు. కాంగ్రెస్ చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పార్టీని పునరుద్ధరించడం ముఖ్యమా లేక బిజెపిని నిరోధించడం ముఖ్యమా అనే డైలమా నుంచి కాంగ్రెస్ బయటపడలేకపోయింది.

మరోవైపు మాయావతి కూడా తన స్వంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌పై దాడులు చేయడమే ప్రధానంగా వ్యవహరించారు. వీలయితే ప్రధాని అభ్యర్థిగా పదవి పొందడానికి ఇది ఉపయోగపడుతుందనుకున్నారు. సమాజవాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల ఈ వైఖరి ఆ రెండు పార్టీలను ముంచింది. ప్రియాంక గాంధీని ప్రధాన కార్యదర్శిగా నియమించి ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ నడిపిన రాజకీయాలు మహాకూటమి ఓట్లకు కోత పెట్టాయి. ఈ వాస్తవాన్ని గుర్తించలేని మహాకూటమి నేతలు కాంగ్రెసును దూరంగా ఉంచడం ద్వారా ప్రధాని పదవికి అవకాశాలు మెరుగవుతాయని అనుకున్నారు. నిజానికి కాంగ్రెసుకు ఉత్తరప్రదేశ్ లో సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉంది.

మహాకూటమి కాంగ్రెసును కలుపుకోవడం ద్వారా బిజెపికి బలమైన పోటీ ఇచ్చి ఉండేది. కాని స్వార్థ పార్టీ రాజకీయాలతో తమ గొయ్యి తామే తవ్వుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్‌కు కేవలం ఒకే ఒక్క స్థానం లభించింది. సమాజవాదీ, బహుజన సమాజ్ పార్టీల మహాకూటమి, సోషల్ ఇంజనీరింగ్, యాదవ్, ముస్లిం, జాతవ్, జాట్ ఓట్లు.. ఈ లెక్కలేవి ఫలించ లేదు. బిజెపి, దేశభక్తి, దేశ భద్రత, పాకిస్థాన్ కు బుద్ధి చెప్పే నాయకుడు, జాతీయవాదం ఇవే ప్రముఖంగా ప్రజలు భావించారు. వాటికే ఓటు వేశారు. పుల్వామా ఉగ్రదాడి, ఆ తర్వాత బాలాకోట్ వాయుసేన దాడుల కారణంగానే ఈ మార్పు వచ్చిందని ప్రముఖ పోల్ పండిట్లందరి అభిప్రాయం. ఉత్తరప్రదేశ్ ఫలితాలు మాయావతి ఆశలపై చన్నీళ్ళు చల్లాయి. ప్రధాని పదవికి పోటీలో తాను కూడా ఉన్నానని ప్రకటించిన మాయావతి మర్నాడు మాట్లాడ లేదు. కాని గమనించవలసిన విషయమేమంటే, బహుజన సమాజ్ పార్టీ ఓట్ల శాతం కోల్పోలేదు. జాతవ్ ఓట్లు ఆమె వైపే ఉన్నాయి. అఖిలేశ్ యాదవ్ మరోసారి విఫలమయ్యాడు. శివపాల్ యాదవ్ పార్టీ వదిలి వెళ్ళిన తర్వాత అఖిలేశ్ యాదవ్ పార్టీ బలహీనపడింది.

శివపాల్ యాదవ్ వల్లనే సమాజవాదీ పార్టీ ఓట్లకు కోత పడుతుందని పలువురి విశ్లేషణ. బీహార్‌లో ఆర్‌జెడి బలమైన పార్టీ. కాని బీహారులో పొత్తు కుదరడానికి ముందు సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు, తటపటాయింపుల తర్వాతే ఈ పొత్తు కుదిరింది. పైగా రాహుల్, తేజస్వీ కలిసి ప్రచారంలో ఫాల్గొననే లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోవడం కూడా ఈ సారి ఆర్‌జెడిని దెబ్బతీసింది. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బీహారు రాజకీయాల్లో తిరుగులేని శక్తి. అలాంటిది ఇప్పుడు బీహారులో ఆయన పార్టీకి ఒక్క సీటు దక్కలేదు. ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత అనేక ప్రాంతీయ పార్టీలు అంతరించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ భవిష్యత్తు కూడా ఇప్పుడు అగమ్యగోచరమే.

Lessons Taught by Polls