Wednesday, March 22, 2023

పల్స్‌పోలియోను విజయవంతం చేద్దాం

- Advertisement -

polio*సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్, హాజరైన అధికారులు 

మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా : ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు జనవరి 28న పల్స్ పోలియో చుక్కలు ముమ్మరంగా వేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పల్స్ పోలియో, నులి పురుగు నిర్మూలన కార్యక్రమాలపై వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పల్స్ పోలియోను పూర్తిగా నివారించాలంటే ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ఎవరైనా తప్పిపోయినట్లు అయితే గ్రామాలలో అట్టి వారిని గుర్తించి ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జన సందోహం ఎక్కువగా ఉండే స్థలాలను గుర్తించి అక్కడ పోలియో చుక్కలు వేసేందుకు వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి అంగన్‌వాడీ, ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలల్లో కూడా కేంద్రాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేసేందుకు సిబ్బందిని సమకూర్చుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శితో ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని డిపిఒను కలెక్టర్ ఆదేశించారు. చిన్నారులకు జ్వరం, దగ్గు, విరేచనాలు ఉన్నా కూడా పోలియో చుక్కలు వేయవచ్చుననే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి పిల్లలకు పోలియో చుక్కలు వేసుకునేలా తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10, అగస్టు 10వ తేదీలలో 19 సంవత్సరాలోపు ఉన్న పిల్లలకు తప్పనిసరిగా నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నులి పురుగులు కలిగి ఉండడం వలన రక్తహీనత, కడుపునొప్పి, వాంతులు సంభవిస్తాయని అలాగే ఆకలి లేకపోవడం బలహీనత కల్గి ఉంటారని చెప్పారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికి అంగన్‌వాడీ కేంద్రాలలో మాత్రలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆరు నుంచి 19 సంవత్సరాలు కలిగిన పిల్లలందరికి విద్యను అభ్యసిస్తున్న పాఠశాలల్లో మాత్రలు వేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్ దశరథ్, డిఐఒ సుధాకర్‌షిండే, ఎస్‌ఎంఒ రాఘవేందర్‌పటేల్, డిఇఒ రేణుకాదేవి, డివైఎస్‌ఒ హన్మంత్‌రావు, బిసిడిఒ పుష్పలత, మైనార్టీ శాఖాధికారిణి హరిణి, సాంఘిక సంక్షేమ శాఖాధికారి శ్వేత, మాస్ మీడియా అధికారి చంద్రయ్య, ప్రోగ్రాం అధికారిణి లలిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News