సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : వాహనాలకు వాటి ఓనర్లదే బాధ్యత అనే సాకుతో హోటళ్ల యాజమాన్యాలు ఇకపై పరిహారం బాధ్యత నుంచి తప్పించుకోలేరు. ఈ మేరకు సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. సాధారణంగా హోటల్స్ వెలుపల వాహనదారులను ఉద్ధేశించి ఓనర్సు రిస్క్ అంటూ బోర్డులు పెడతారు. వాహనాలు చోరీ అయితే తమకు సంబంధం లేదని, ఈ బాధ్యత సదరు వాహనదారులదే అని ఇందులో పేర్కొంటారు. అయితే హోటల్స్‌లో బసచేసే అతిథులు లేదా సందర్శకులు తమ వాహనాలను సంబంధిత హోటల్స్ లేదా లాడ్జిల సిబ్బంది ద్వారా లేదా వాలెట్ సౌకర్యంతో పార్కింగ్ చేస్తే, సదరు వాహనాల బాధ్యత హోటల్ వారిదే అని తీర్పులో స్పష్టం చేశారు. ఈ విధంగా పార్క్ చేసి ఉంచిన వాహనాలు చోరీకి గురయినా ఇతరత్రా దెబ్బతిన్నా వాటికి పరిహారం బాధ్యత నుంచి తప్పించుకోజాలరని అత్యున్నత న్యాయస్థానం తీర్పులో పేర్కొంది.
తమ సంరక్షణ లోపం లేదని స్పష్టమైన ఆధారాలతో తెలియచేసుకుంటే పరిహారం నుంచి వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. న్యాయమూర్తులు ఎంఎం శాంతానగౌడార్, అజయ్ రస్తోగీతో కూడిన ధర్మాసనం వివిధ రకాల వాహనాల సొంతదార్లకు సంబంధించిన ఈ కేసును పరిష్కరించింది. ‘ ఒక్కసారి వాహన సొంతదారుడు తమ వాహనాన్ని హోటల్ సిబ్బందికి లేదా వాలెట్ పరిధికి అప్పగించితే తిరిగి ఈ వాహనాన్ని సంబంధితులకు అప్పగించాల్సిన బాధ్యత హోటల్ యాజమాన్యానిదే. సురక్షితంగా వాహన సొంతదారుడి మార్గదర్శకాల మేరకు సి బ్బంది వాహనాలను తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఇది సహజంగానే అమలుజరగాల్సిన ఒప్పంద కట్టుబాటు ’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది.