Home తాజా వార్తలు 25 శాతం ప్రీమియం వృద్ధి

25 శాతం ప్రీమియం వృద్ధి

New premium business of LIC rises 25% in FY20

 

అత్యధికంగా రూ.1,77,977 కోట్ల వ్యాపారం
2019-20 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ఎల్‌ఐసి

మన తెలంగాణ/ హైదరాబాద్ : గత ఆర్థిక సంవత్సరం (2019-20) మార్చి ముగింపు నాటి ఆడిటెడ్ గణాంకాలను ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. ఈ ఫలితాల్లో మార్చి నాటికి ఎల్‌ఐసి కొత్త వ్యాపారం విషయానికొస్తే, ప్రీమియంలో అత్యధికంగా రూ.1,77,977 కోట్లతో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. పెన్షన్ అండ్ గ్రూప్ బిజినెస్ ఒక లక్ష కోట్ల మార్క్‌ను దాటి చరిత్ర సృష్టించింది. కొత్త వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.1,26,696 కోట్లు వసూలు చేసింది. ఇది గతేడాదిలో రూ.90,848 కోట్లుగా ఉంది.

అంటే ఈసారి 39.46 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి ముగింపు నాటికి కార్పొరేషన్ మొత్తం ప్రీమియం ఆదాయం కూడా వేగంగా 12.42 శాతం వృద్ధితో రూ.3,79,062 కోట్లు నమోదు చేయగా, అంతకుముందు సంవత్సరంలో ఇది రూ.3,37,185 కోట్లుగా ఉంది. మొత్తం పాలసీ పేఅవుట్స్ 1.31 శాతం పెరిగాయి. రూ.2.50 లక్షల కోట్ల నుంచి రూ.2.54 లక్షల కోట్లకు పెరిగాయి. స్థూల మొత్తం ఆదాయం 9.83 శాతం పెరిగింది. ఇది రూ.5.60 లక్షల కోట్ల నుంచి రూ.6.15 లక్షల కోట్లకు పెరిగిందని సంస్థ వెల్లడించింది.

ఎల్‌ఐసి రూ.26 కోట్ల క్లెయిమ్
కోవిడ్19తో పాటు ఇతర కారణాల వల్ల మృతి చెందినవారికి ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి తక్షణమే చెల్లింపులు చేపట్టింది. ఎల్‌ఐసి ఇప్పటికే కోవిడ్ 19 కారణంగా చనిపోయిన దాదాపు 561 పాలసీలకు రూ.26.74 కోట్లు క్లెయిమ్ చేసింది. సంస్థ నిబంధనల్లో పలు మార్పులు చేపట్టింది. క్లబ్ ఏజెంట్, డెవలప్‌మెంట్ కార్యాలయాల నుంచి మెయిల్ ద్వారా డెత్ క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించింది.

LIC of India announces the Financial results 2019-20